బొండా ఉమామహేశ్వరరావు బాటలో బుద్దా వెంకన్న..! | MLA Bonda Uma Creates Ruckus In Vijayawada Amid Growing Tensions Within TDP, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బొండా ఉమామహేశ్వరరావు బాటలో బుద్దా వెంకన్న..!

Aug 8 2026 9:49 AM | Updated on Aug 8 2026 10:19 AM

MLA Bonda Uma Creates Ruckus in Vijayawada

టీడీపీలో అంతర్గత అసంతృప్తి, అధిష్టానం మెప్పు కోసం జరుగుతున్న పోటీ ఇప్పుడు బహిరంగ దూకుడుకు దారి తీస్తోందా? విజయవాడ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. ఇటీవల ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ఆ తర్వాత పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే యత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొండా చర్యకు మరుసటి రోజే పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుద్దా వెంకన్న కూడా అదే తరహాలో వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అధిష్టానం మెప్పు కోసం టీడీపీ నాయకుల మధ్య మొదలైన ఈ పోటీ నగర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధిష్టానం మెప్పు పొందేందుకు విజయవాడ నగరంలోని టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. తొలిరోజు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. వైఎస్సార్‌ సీపీ దీక్షా శిబిరంపై దాడి చేస్తే దాన్ని చూసి రెండోరోజు నగరంలోని టీడీపీ ‘పశ్చిమ’ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే బాట పట్టారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ రచ్చను నగర ప్రజలు అసహ్యించుకుంటున్నారు.   

అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. తర్వాత ప్లేటు మార్చి.. 
తాను టీడీపీకి కట్టుబడి ఉన్నానని అధిష్టానం మెప్పు పొందేందుకే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్‌ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారు. ఇటీవల వరకూ అసంతృప్తితో ఉండటం, అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉమా ఒక్కసారిగా ప్లేటు మార్చారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాపసభలో పాల్గొన్న బొండా ఉమా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమాలే కారణమంటూ వ్యాఖ్యానించడం, వైఎస్సార్‌ సీపీతోపాటు అన్ని పార్టీల్లోని కాపు నేతలతో మాట్లాడటం అధిష్టానానికి కోపం తెప్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడితో కమిటీ వేయడం, అ కమిటీ ముందు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక ఇచ్చిన తర్వాత బుధవారం  సంజాయిషీ ఇచ్చుకుని వచ్చారు.   

దాడికి వ్యూహరచన 
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం అని చెప్పేందుకే వైఎస్సార్‌ సీపీపై దాడికి వ్యూహరచన చేశారు. గురువారం ఉదయం సింగ్‌నగర్‌కు చేరుకుని అక్కడ జన సమీకరణ చేసుకున్న తర్వాత నేరుగా ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం వద్ద డీఎస్సీలో అక్రమాలపై జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. షామియానాను తొలగించడంతో పాటు వైఎస్సార్‌ సీపీ నేతలపై తన అనుచరులను దాడులకు పురికొల్పారు.   

వెంకన్న దాడికి యత్నం 
రెండోరోజు శుక్రవారం పశ్చిమలో కేదారేశ్వరపేటలోని బాప్టిస్ట్‌పాలెంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడికి వెంకన్న ప్రయత్నించారు. ఆయనను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయగా, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుని దాడికి తెగబడ్డారు. గురువారం ఘటనతో పరువు పోగొట్టుకున్న పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అధిష్టానం మెప్పుకు ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకుంటుండటంతో ఈ ట్రెండ్‌ ఎక్కడికి పోతోందనన్న భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

బ్రాహ్మణ నేతపై దాడి 
బ్రాహ్మణ సామాజికవర్గానికి చెంది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో బొండా వర్గం దాడి చేయడాన్ని ఆ సామాజికవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌ నుంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులకు దిగినట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడులకు దిగిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.

లోకేష్‌ దృష్టిలో పడటానికే హడావుడి 
ఈ నేపథ్యంలోనే తాను కూడా లోకేష్‌ దృష్టిలో పడేందుకు ఈ హడావుడి చేసినట్లు తెలుస్తోంది. రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ కమిటీ సభ్యులపై మహిళలతో కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన స్ఫూర్తితోనే మహిళలకు కోడిగుడ్లు ఇచ్చి వారిని గొడవకు తీసుకువచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ నడి»ొడ్డున రెండుగంటలపాటు టీడీపీ నేతలు హడావుడి చేసినా పోలీసులు చోద్యం చూడటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement