యష్ 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్ | Yash Toxic Trailer Released: Geetu Mohandas Directorial Action Thriller Sets Grand Release on August 26 | Sakshi
Sakshi News home page

Toxic Trailer: ఆకట్టుకునేలా 'టాక్సిక్' ట్రైలర్.. మీరు చూశారా?

Aug 8 2026 7:01 PM | Updated on Aug 9 2026 1:13 AM

Yash Toxic Movie Trailer Telugu

యశ్‌ హీరోగా నటించిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్‌) చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ – అప్స్‌’. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వంలో వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘టాక్సిక్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కన్నడ స్టార్‌శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. యశ్‌ నాకు బ్రదర్‌లాంటివాడు. తను ప్రతి సినిమాతో ఎదుగుతుండటం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 

యశ్‌ మాట్లాడుతూ– ‘‘నాకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. దాని కోసం చాలా సమయం అవసరమైంది. ఇండియన్‌ సినిమాను గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఎంతోమంది ప్రతిభావంతులు ప్యాషన్‌తో హార్డ్‌ వర్క్‌ చేశారు. 

(ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)

గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. నిర్మాత వెంకట్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. అలాగే నా భార్య రాధిక స పోర్ట్‌ లేక పోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. నేను ఇండియన్‌ సినిమాకు ఒక కార్మికుడిలా పని చేస్తాను. నా బెస్ట్‌ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్‌’ కచ్చితంగా మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా గుర్తుండి పోతుంది’’ అన్నారు. 

దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని నమ్మి కేవీఎన్‌గారు అన్నీ సమకూర్చడంవల్లే ఈ సినిమా సాధ్యమైంది. యశ్‌ వండర్‌ఫుల్‌ యాక్టర్, బ్రిలియంట్‌ ప్రోడ్యూసర్, అద్భుతమైన కో రైటర్‌. మా ప్రోడక్షన్‌ టీమ్‌కి, డైరెక్షన్‌ టీమ్‌కి, నటీనటులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వాళ్లందరి హార్డ్‌ వర్క్‌ వల్లే ఈ సినిమా సాధ్యపడింది’’ అని చెప్పారు.

‘‘దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వెంకట్‌ కె. నారాయణ. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించే అడుగుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని హ్యూమా ఖురేషి అన్నారు. ‘‘నా కెరీర్‌లో ‘బిఫోర్‌ టాక్సిక్, ఆఫ్టర్‌ టాక్సిక్‌’ అని తప్పకుండా అంటారు. ఇది నాకు చాలా స్పెషల్‌ మూవీ’’ అని కియారా అద్వానీ తెలిపారు. 

‘‘మంచి క్యారెక్టర్‌ ఇచ్చి, నన్ను ప్రోత్సహించిన గీతూగారికి థాంక్యూ. ఈ సినిమా నాకో గొప్ప అనుభవం’’ అని రుక్మిణి వసంత్‌ పేర్కొన్నారు. ‘‘గతంలో గీతూతో కలిసి ఒక సినిమా చేశాను. కానీ ‘టాక్సిక్‌’ చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా వేరుగా కనిపించారు. ఈ సినిమా కథను ఆమె మైండ్‌ బ్లోయింగ్‌గా చెప్పారు’’ అని నయనతార చెప్పారు.

(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement