breaking news
Personal development
-
వాయిదాల నవగ్రహాలకి.. భయమే అడ్డంకా?
సమయం దొరికితే చాలు పనులను రేపటికి వాయిదా వేస్తున్నారా? అయితే మీరు ఏ రకమైన ‘ప్రొక్రాస్టినేటర్’ (వాయిదా వేసే వ్యక్తి) అయి వుండవచ్చో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బద్ధకం వల్లే కాకుండా భయం, ఒత్తిడి, ఆలోచనా తీరు మొదలైన వాటి వల్ల పనులను వాయిదా వేసే 9 రకాల మనుషులను పరిశోధకులు గుర్తించారు.అయినా, సమయం దొరికితే చాలు పనులు చక్కబెట్టుకోవాలి కానీ, వాయిదా వేసుకోవటం ఏంటి?! ఈ అలవాటు మీ సమయాన్ని దొంగిలించకుండా, మీ కెరీర్‌ను దెబ్బతీయకుండా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలంటే, వాయిదా వేయకుండా ఈ రెండు ముక్కలూ చదివేయండి.టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడాన్ని వాయిదా వేయటం, ముఖ్యమైన పనులను చివరి నిమిషం వరకు చేయకుండా వదిలేయడం లేదా అత్యవసరమైన ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం.. ఇలా మనమందరం అప్పుడప్పుడు పనులను తాత్కాలికంగా ‘తప్పించుకుంటూనే’ ఉంటాం. అయితే, పనులను తాత్సారం చేయటం అనేది కేవలం ఉత్సాహం లేకపోవడం లేదా సమయం విలువ సరిగ్గా తెలియకపోవడం వల్ల మాత్రమే జరగదు.‘‘పనులను వాయిదా వేయడం అనేది – పని చేయవలసిన అవసరానికీ, చేయొచ్చులే అనే అలసత్వానికి మధ్య జరిగే ఒక రకమైన ‘తాడు లాగే ఆట’ (టగ్ ఆఫ్ వార్) లాంటిదిట’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ ఇటామర్ షాట్జ్ అంటున్నారు. ఆయన తన కొత్త పుస్తకం ‘సాల్వింగ్ ప్రొక్రాస్టినేషన్: ది సైన్స్ ఆఫ్ వై వి పుట్ థింగ్స్ ఆఫ్ అండ్ హౌ టు (ఫైనల్లీ!) స్టాప్’లో.. వాయిదా మనస్తత్వాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వందలాది పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట, ఆయన.. ఈ వాయిదా వేసే వ్యక్తులను 9 భిన్నమైన రకాలుగా వర్గీకరించారు. (ఈ పుస్తకం ఆగస్టు 25న విడుదల అవుతోంది).వాయిదా తత్త్వాలు– పరిష్కారాలువాయిదా వేసే అలవాటును వదిలించుకోవడం అంటే రోజంతా పడీ పడీ చేస్తూనే ఉండటం కాదు, ఎలాంటి అపరాధ భావం లేదా ఒత్తిడి లేకుండా అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయటం. అయితే మీరు ఏ రకమైన స్వభావం గల వ్యక్తి అనే దానిని బట్టి మీ వాయిదా తత్వానికి పరిష్కారాలు మారుతుంటాయి. ఈ తొమ్మిది తత్వాలలో మీది ఏ తత్వమో చెక్ చేసుకోండి.1. వర్రీయర్లు (ఆందోళన చెందేవారు)లక్షణం: తాము ఏదైనా పని చేస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో అని ఎప్పుడూ భయపడుతుంటారు. సమస్యల్లో పడకుండా ఉండటం కోసం అసలు చేయాల్సిన పనినే వదిలేస్తుంటారు.పరిష్కారం..మీ భయాలను స్పష్టంగా గుర్తించాలి. పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదలను వదిలిపెట్టి, మీపై మీకు నమ్మకాన్ని పెంచుకోవాలి.2. పెసిమిస్ట్లు (నిరాశావాదులు)లక్షణం: తాము విజయం సాధించే అవకాశం చాలా తక్కువ అని ముందే ఊహించుకుంటారు. దీనివల్ల అసలు ప్రయత్నించడంలో కూడా ఎలాంటి అర్థం లేదని భావిస్తారు.పరిష్కారం..మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. భయాలను స్పష్టంగా గుర్తించి, మీకు మద్దతుగా నిలిచే సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి.3. పర్ఫెఫెక్షనిస్టులు (అన్నీ కచ్చితంగా ఉండాలనుకునేవారు)లక్షణం: ప్రతిదీ అక్షరాలా పర్ఫెఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. కానీ, తప్పులు చేస్తామనే భయం వల్ల లేదా అందుకోలేని ప్రమాణాలను నిర్దేశించుకోవడం వల్ల ఏ పనీ చేయలేక అక్కడికక్కడే ఆగిపోతారు.పరిష్కారం..‘ఇది చాలు’ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల ప్రమాణాల కంటే మీ సొంత లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం మాని, మిమ్మల్ని మీరే సమర్థించుకోవాలి.4. డ్రీమర్లు (ఊహాలోకంలో విహరించేవారు)లక్షణం: ప్రస్తుతం చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి, భవిష్యత్తు గురించి ఊహల్లో తేలిపోతూ సమయాన్ని గడుపుతుంటారు.పరిష్కారం..పగటి కలలు మీ ఉత్పాదకతను ఎప్పుడు దెబ్బతీస్తున్నాయో గుర్తించాలి. లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన కచ్చితమైన అంశాలను విడమర్చి రాసుకోవాలి. అసలు ఊహాలోకంలో ఎందుకు చిక్కుకుపోతున్నారో (ఉదాహరణకు పర్ఫెక్షనిజం భయం) గుర్తించి సరిచేసుకోవాలి.5. జిగ్జాగర్స్ (ధ్యాస మళ్లేవారు)లక్షణం: తమ దృష్టిని ఆకర్షించే వేర్వేరు పనుల వైపు చాలా త్వరత్వరగా మారిపోతుంటారు. దీనివల్ల వారు నిజంగా చేయాల్సిన పనిపై ఎక్కువ సేపు నిమగ్నం కాలేరు. పరిష్కారం..కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి అవసరమైన పనులను కాగితంపై రాసి పెట్టుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.6. థ్రిల్ సీకర్లు (సాహసాలు కోరుకునేవారు)లక్షణం: డెడ్‌లైన్ కంటే కాస్త ముందు మాత్రమే, ఎంతో ఒత్తిడి మధ్య చాలా వేగంగా పని చేయడాన్ని ఇష్టపడతారు. ఆ హడావిడి వీరికి ఒక థ్రిల్‌ను ఇస్తుంది.పరిష్కారం..కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.7. రెబెల్స్ (తిరుగుబాటు స్వభావం గలవారు)లక్షణం: తమ జీవితంపై తమకు తగినంత నియంత్రణ లేదని భావిస్తారు. అందుకే తమ స్వేచ్ఛను చాటుకోవడానికి, పైఅధికారులపై లేదా వ్యవస్థపై నిరసన చూపించడానికి పనులను వాయిదా వేస్తారు.పరిష్కారం..ఒక పనిని వెంటనే చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఆలోచించాలి. ఇతరుల కఠినమైన నిబంధనలను పక్కన పెట్టి, మీ సొంత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీపై ఇతరుల నియంత్రణ తక్కువగా ఉండే వాతావరణాన్ని ఎంచుకోవాలి.8. హెడోనిస్టులు (సౌఖ్య వాదులు)లక్షణం: ఆ క్షణంలో లభించే ఆనందానికి, తక్షణ సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు.పరిష్కారం..మిమ్మల్ని ముందుకు నడిపించే బాహ్య/అంతర్గత ప్రేరణలను కనుగొనాలి. మీ ధ్యాసను మళ్లించే ఆకర్షణలను మీ చుట్టుపక్కల నుండి పూర్తిగా తొలగించాలి.9. బర్న్అవుట్లు (తీవ్రంగా అలసిపోయినవారు)లక్షణం: చాలా ఎక్కువగా కష్టపడి ఉండటం వల్ల లేదా ఒత్తిడితో కూడిన, అర్థం లేని పనులు చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఉంటారు. అందుకే చేయాల్సిన పనిని చేయడానికి ఓపిక లేక వాయిదా వేస్తారు.పరిష్కారం..మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నిద్ర, విశ్రాంతి లభించేలా చూసుకోవాలి. పని భారాన్ని తగ్గించుకోవాలి. ఈ ఏఐ యుగంలో వ్యక్తిగత ఉత్పాదకతకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వాయిదా వేసే అలవాటు వినడానికి సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే జీవితాలను, కెరీర్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని డాక్టర్ షాట్జ్ హెచ్చరిస్తున్నారు.గుణాల దశావతారాలు..పనులను వాయిదా వేసే స్వభావాలపై పరిశోధన వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల ముందే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్, సోషల్ థియరిస్ట్ డాక్టర్ మారియస్ ఓస్ట్రోవ్స్కీ మనుషుల ఆలోచనా సరళిపై మరో ఆసక్తికరమైన పరిశోధన చేశారు. సైకాలజీ, సోషియాలజీ ఆధారంగా ఆయన 10 రకాల ఆలోచనా విధానాలను (సిగ్నేచర్ థింకింగ్ స్టయిల్స్) వర్గీకరించారు. అవి..1. హ్యాపీ క్యాంపర్ : ఏ పరిస్థితినైనా సానుకూలంగా, మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించే స్వభావం కలవారు.2. జోక్స్టర్ : క్లిష్టమైన విషయాలను కూడా హాస్యస్ఫూర్తితో, తేలికగా తీసుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరదాగా మార్చేవారు.3. హాట్హెడ్ : పరిస్థితులకు చాలా త్వరగా, తీవ్రంగా స్పందిస్తూ ఆవేశంతో లేదా కోపంతో నిర్ణయాలు తీసుకునే ఆలోచనా సరళి గలవారు.4. కీన్ బీన్ : ఏ పనిలోనైనా విపరీతమైన ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపిస్తూ ఎల్లప్పుడూ చురుగ్గా పాలుపంచుకునేవారు.5. క్విబ్లర్ : ప్రతి చిన్న విషయానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, లోపాలను ఎత్తిచూపుతూ వాదించే స్వభావం గలవారు.6. గ్లూమ్స్టర్ : ఎప్పుడూ నిరాశావాదంతో ఉంటూ, ఏ పని చేసినా ఫలితం ప్రతికూలంగానే వస్తుందని ముందుగానే ఊహించేవారు.7. ఎగోనైజర్ : చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తీవ్రంగా సతమతమవుతూ, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే ఆలోచనా విధానం కలిగినవారు.8. కూల్ క్యాట్ : ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అస్సలు కంగారు పడకుండా ఎంతో స్థిరంగా, హుందాగా ఆలోచించేవారు.9. వర్రీవార్ట్ : జరగబోయే పనుల గురించి, లేనిపోని సమస్యల గురించి అనవసరంగా ముందే ఆందోళన చెందే స్వభావం కలవారు.10. రెవెలర్: జీవితాన్ని, ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటూ ఉల్లాసంగా, సంబరంగా ఆలోచించే వారు.అయితే ప్రతి ఒక్కరూ వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఆలోచనా విధానాల మిశ్రమంగా కూడా ఉండే అవకాశం ఉందని మారియస్ ఓస్ట్రోవ్స్కీ వివరించారు. మనుషుల పెంపకం, వారి అనుభవాలు, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఈ ఆలోచనా సరళిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.ఇందులో మీరు స్వాభావికంగా ఏ రకానికి చెందిన వారో గుర్తించి, నేడే మార్పు వైపు అడుగులు వేయండి! వాయిదా వేసే అలవాటును వదులుకుని, మీ సమయాన్ని ఎలా గడపాలో మీరే నిర్ణయించుకునేలా మారటమూ గొప్ప విజయమే.- సాక్షి స్పెషల్ డెస్క్ -
ఆలోచనల్లో స్పష్టత... అప్రమత్తత
విద్య - విలువలు ‘వ్యక్తిత్వ వికసనం’ అన్న అంశంలోని ఐదు లక్షణాల్లో మొదటిదైన ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. రెండవది అత్యవసాయం. అంటే ఆలోచనల్లో అప్రమత్తత. దీన్ని ఆంగ్లంలో మెంటల్లీ అలర్ట్ అంటారు. మీరు ఎక్కడికి ఎప్పుడు వెడుతున్నా మీకో స్పష్టత ఉంటుంది. నేను ఒక సభకు వెడుతున్నాననుకోండి. పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెడుతున్నప్పుడు రామాయణ, భారత, భాగవతాదులు, శివుడి అష్టమూర్తితత్త్వం వంటి విషయాలపై ప్రవచనాలు చెప్పకూడదు కదా! పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెళ్లేటప్పుడు ప్రతి మాటా పిల్లలకు పనికివచ్చేదే మాట్లాడుతున్నానా అని నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. అదీ అలర్ట్‌గా ఉండడం అంటే. అది ఆలోచనల్లో స్పష్టతను ఏర్పరుస్తుంది. నేను మా నాన్నగారి దగ్గరికి వెడుతున్నాను. ఈ పని చెయ్యవచ్చా, చెయ్యకూడదా, ఇది చేస్తే మంచిదా, చెయ్యకపోతే మంచిదా? అని నేను మా నాన్నగారిని అడగబోతున్నాననుకోండి. మనసులో ఒక స్పష్టత ఉండాలి. నేను ముందే ఒక నిర్ణయం చేసేసుకుని, మా నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయకూడదు. నాన్నగారు విజ్ఞులు, అనుభవజ్ఞులు. వారికి తెలుసు. నాన్నగారూ! ఇలా చెయ్యమంటారా? అని అడుగుతాను. ఇలా చెయ్యి అంటే అలానే చేసేస్తాను. వద్దంటే మానేస్తాను. అంతే తప్ప ముందే నిశ్చయం చేసేసుకుని, అది ఒప్పుకునేటట్లు ఆయనపై ఒత్తిడి తేవడానికి నేనెళ్లకూడదు. అలా చేస్తే నేను అడగడానికి వెళ్లలేదు, నేననుకున్నది సాధించుకోవడానికి వెళ్లినట్లు లెక్క. అలా ఉండకూడదు. స్పష్టత ఉండాలి. మన శ్రేయస్సు కోరి ఆయన సభలో మాట్లాడుతున్నాడు. అవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. వాటిని అనుసరించడానికి అవేమైనా కష్టమైనవా? ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చెయ్యండని ఆయన చెబుతున్నారు. అది మంచి సలహానా, దోష భూయిష్టమైనదా? మంచి విషయమని మీరు నమ్మారనుకోండి, దాన్ని కచ్చితంగా పాటించడానికి సిద్ధపడి ఉండాలి. మీ మనసు అందుకు సిద్ధంగా లేదనుకోండి. ఉపన్యాసం విని కూడా రేపు మీరు ఒక్క అరగంట నడవడం కానీ, 10 నిమిషాలు పరుగెత్తడం కానీ, నాలుగు బస్కీలు తియ్యడం కానీ చెయ్యలేదనుకోండి. అప్పుడు ఎన్ని విన్నా అది ఒక వినోద ప్రక్రియలాగా ఉంటుంది. శోభానాయుడిగారి నృత్యం చూడడానికి వెళ్లాం. ‘పద్మావతీ కళ్యాణం’ ఆమె ఎంత బాగా చేశారో! అంటాం. అంతే తప్ప ఆవిడ ఎలా చేశారో చేసి చూపే ప్రయత్నం చేయం. సాధ్యం కాదు. అది మనసు సంతోషం, ఉల్లాసం పొందడానికి. కానీ మన మంచి కోరి ఎవరైనా చెబుతుంటే వాటిని వినడం ఎందుకంటే జీవితంలో పాటించడానికి. అంతే తప్ప- ‘‘చాలా బాగా చెప్పారండీ’’ అని ఆయనకు కితాబివ్వడానికి కాదు. అవి మనకు ఉపయోగపడతాయనుకున్నప్పుడు వాటిని ఆచరణలోకి తెస్తే ఆయన శ్రమకు, ఆర్తికి ఫలితం లభిస్తుంది. అదీ స్పష్టత. మెంటల్లీ అలర్ట్. అది అలవాటయితే మీరు ఏ పనిమీద ఉంటే మీ మనసు దానియందే లగ్నమై ఉంటుంది. ఆడుకోవడానికి వెళ్లారు. ఆటల్లో పూర్తిగా మునిగిపోతారు. పూజ చేసుకోవడానికి వెళ్లారు, పూజలో నిమగ్నమైపోతారు. అంతేతప్ప పూజ చేయడానికి వెళ్లి కాలేజి గురించి ఆలోచించడం, క్లాస్‌రూమ్‌లో కూర్చుని పాఠం వింటూ ‘అయ్యో, నేను ఈవేళ పూజ సరిగా చేసుకోలేకపోయాను’ అని చింతించడం, అమ్మతో కఠినంగా మాట్లాడడం, ఆ తరువాత బయటికెళ్లి ‘అనవసరంగా అమ్మతో దెబ్బలాడానేమో, పాపం బాధపడిందేమో’ అని ఏడవడం, ఇంటికెడితే చులకనైపోతానేమోననే అయోమయం... అన్నీ అయోమయమే. జీవితంలో ఏ ఒక్క విషయంలో స్పష్టత ఉండకపోతే ఎలా! జీవితంలో ఏది చేస్తున్నా ఇది నేనెందుకు చేస్తున్నాననే విషయంలో స్పష్టత ఉంటే మీకు జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా వాటిని అనాయాసంగా అధిగమించగలుగుతారు. తెల్లవారుఝామున 5గంటలకు లేవాలని అలారం పెట్టుకుంటారు. దాని పేరే అలారం. అంటే నీవు ఇప్పుడు లేవకపోతే ప్రమాదంలో పడిపోతావు అనే హెచ్చరిక అది. నీవు మోగమంటేనే అది మోగింది. లేచి దాని నోరు నొక్కేసి మళ్లీ వెళ్లి పడుకుంటే... ఏదీ స్పష్టత? ఒకసారి చేద్దామనుకోవడం, ఒకసారి వద్దనుకోవడం, ఒకసారి చేయడం, మరోసారి ఇంకోలా చేయడం. అది జీవితాన్ని ఆయోమయం పాలు చేస్తుంది సినిమా చూడ్డానికి వెళ్లాడు. దేనికెళ్లాడు? వినోదించడానికెళ్లాడు. సినిమాలో చెప్పిన విషయాలు ఆదర్శంగా తీసుకొమ్మనమని ఎవడు చెప్పాడు? సినిమా ఎప్పుడైపోతుందంటే... అందులో వాడనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. నీవు జీవితంలో అలా చేసుకుంటే అయిపోతుందా? అయిపోదు. అక్కడ మొదలవుతుంది నీ జీవితం. సినిమా ఎంతవరకో అంతవరకే. దాన్ని జీవితంలోకి తెచ్చుకోవడమేమిటి? సినిమాలో ప్రేయసీ ప్రియులు పార్కుల్లో పాటలు పాడతారు, నృత్యాలు చేస్తారు. అలా చేస్తున్న ప్రేయసీ ప్రియులను నేనెక్కడా చూడలేదు నిజ జీవితంలో.. సినిమాలో చూపించినట్లు బయట ఉండదు. సినిమాలో వందమందిని చితకబాదినవాడు బయట చీపురుపుల్లలాంటివాడు. చెయ్యెత్తితే కిందపడిపోతాడు. అవన్నీ నిజాలు కావు, నటనలు. అందులో నటుడు నిజ జీవితంలో కోటీశ్వరుడు. భారతదేశంలో బయటికొస్తే వెంటపడతారని, సింగపూర్ వెళ్లి షాపింగ్ చేస్తుంటాడు. ఆయన మీకు ఆదర్శం ఏంటి? వినోదాన్ని వినోదం వరకే తీసుకోవడం అలవాటు చేసుకోండి. పెద్దల దగ్గరికెళ్లావు- ‘‘ఇవిగో ఇవీ నా ఆలోచనలు. ఈ ఈ విషయాల్లో నాకు మీ మార్గదర్శనం కావాలి’’ అని స్పష్టంగా అడగగలగాలి. నిద్రపోవడానికి వెళ్లావు. అన్ని అలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా నిద్రపో. మళ్లీ రేపు నిద్ర లేచిన తరువాతే ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకో. తరగతి గదిలోకి వెళ్లావు. పాఠం వినడమే ప్రయోజనం. బండి నడుపుతున్నావు మరో ఆలోచన లేకుండా నడపడమే నీ ప్రయోజనం. మనసు పరధ్యానంగా ఉంచి బండి నడిపితే ఏమవుతుందో... జీవితంలో స్పష్టత కోల్పోయిన ప్రతి సందర్భంలో అవే అనుభవాలు ఎదురవుతాయి. దీన్నే మెంటల్లీ అలర్ట్ అంటాం. ఆలోచనల్లో స్పష్టత, అప్రమత్తత. ఇవి రావాలంటే మిమ్మల్ని మీరుగా ప్రతిక్షణం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రయత్న పూర్వకంగానూ, అభ్యాసం మీద ఇది అలవాటు చేసుకోండి. -
వ్యక్తిత్వం పువ్వులా వికసించాలి
విద్య - విలువలు ‘వ్యక్తిత్వ వికాసం’ అనే మాట ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. వికసనము - అన్న మాటకు అర్థం.. క్రమక్రమంగా విచ్చుకొనుట, వికసించుకొనుట - అని. సాధారణంగా దీన్ని పువ్వు విషయంలో వాడతాం. పువ్వు అనేక రేకులతో ఉంటుంది. తొలిదశలో మొగ్గగా ఉంటుంది. ఆ దశలో దాని రేకులు బలవంతంగా తుంచే ప్రయత్నం చేస్తే దానిలో నుంచి పసరిక వాసన వస్తుంది. కానీ అదే మొగ్గ సూర్యకిరణాల స్పర్శతో వికసనాన్ని పొందుతుంది. దాని మధ్యలో ఉన్న దిమ్మచుట్టూ ఆ రేకులన్నీ క్రమపద్ధతిలో విచ్చుకుని, వికసనం పొందిన పువ్వు సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉంటుంది. అలా సుగుణాలతో వికసనం పొందిన వ్యక్తి ఎక్కడ ఏ పదవిలో ఉన్నాడన్న దానితో సంబంధం లేకుండా ఎవరితో ఏ అనుబంధం ఉన్నా ఆ వ్యక్తివల్ల ఒక మార్గదర్శనం లభిస్తుంది. అటువంటి వ్యక్తిని అనుసరించినవారికి మనశ్శాంతి లభిస్తుంది. అతను ఉన్నచోట అందరికీ కూడా ‘‘మనకు ఇక్కడ ఒక పెద్ద దిక్కు ఉన్నాడు’’ అన్న ఉపశాంతి లభిస్తుంది. అలా తయారుకావడానికి అవసరమైన మంచి గుణాలు సంతరించుకునే ప్రక్రియను ‘వ్యక్తిత్వ వికాసం’ అంటారు. దీనికీ చదువుకూ సంబంధం లేదు. ఇవి అందరికీ పుట్టుకతో వచ్చే గుణాలు కావు. ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని జీవితపర్యంతం అనుష్ఠించాలి. ఇది లేనప్పుడు ఎంత చదువున్నా అది నిష్ర్పయోజనం. ప్రయోజనం లేకపోగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పల్లెపట్టున ఉండి ఏమీ చదువుకోని వ్యక్తి చేయదగిన పెద్దనేరం జేబు దొంగతనం లేదా ఇళ్ళల్లో దొంగతనం. అదే బాగా చదువుకున్న వ్యక్తి, తనకింద పనిచేస్తున్న వందమందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి దోషభూయిష్టంగా ప్రవర్తించి తప్పులు చేస్తే, ఆ తప్పులు తప్పులు కావని తన మేధస్సుతో నమ్మించడానికి వాటిని ఒప్పులుగా నిరూపించే ప్రయత్నం చేశారనుకోండి. అటువంటి వ్యక్తిని కట్టడి చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. ‘నీవిలా ప్రవర్తించకూడదు’ అని తన కింద పనిచేసే వందలమందికి చెప్పడానికి సాహసించడు. అందుకే వికసించిన వ్యక్తిత్వంతో కూడిన జీవితం అందరికన్నా ముందు - బాగా చదువుకున్నవాళ్ళకే ఉండాలి. ‘వికాసం’ అన్న అంశంలో ఐదు లక్షణాలుంటాయి. మొట్టమొదటిది ఆరోగ్యం. ఇది శరీర సంబంధమైనది. తరువాత వరుసగా అత్యవసాయం, ఆలోచనలో సునిశిత ప్రజ్ఞ, సర్వకాల సర్వావస్థల్లో ఆవేశంలో సమతౌల్యత. చివరిది ఆధ్యాత్మికమైన ప్రగతి. ఈ ఐదింటినీ కలిగి ఉన్నవారు ‘‘వీటిని పూర్తిగా సంతరించుకున్నాను, నా వశం చేసుకున్నాను’’ అని చెప్పడం కూడా ఏ ఒక్కరికీ ఎప్పుడూ సాధ్యపడదు. కారణం - అది నిరంతర ప్రక్రియ. బతికున్నంతకాలం ఈ ఐదూ కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వికసనం, విచ్చుకోవడం కాలం గడిచే కొద్దీ జరుగుతూనే ఉంటుంది. అది ఎవరు అలవాటు చేసుకున్నారో వారు చాలా వృద్ధిలోకి వస్తారు. దీన్నే ఆంగ్లంలో చెప్పాలంటే ‘One should be physically fit, mentally alert, interllectually sharp, emotionally well balanced and spiritually elevated. ఈ ఐదు లక్షణాలు జీవితపర్యంతం సాధన చేస్తున్నవారు తగినవిధంగా వ్యక్తిత్వ వికాసాన్ని పొంది ఉంటారు. మన పౌరాణిక వాఙ్మయాన్ని పరిశీలిస్తే ‘వీరు మహాత్ములు’ అని ఎవరిని మనం పౌరాణికంగా ప్రస్తావిస్తుంటామో వారందరిలో ఈ ఐదు లక్షణాలు కనబడతాయి. మొదటిది - ఆరోగ్యం : పరమేశ్వరుడు మనకు శరీరమనే అద్భుతమైన సాధనాన్నిచ్చాడు. ఇది ఎక్కడికో అంగట్లోకి వెళ్ళి తెచ్చుకున్నది కాదు. 80లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే శరీరంతోపాటూ బుద్ధిని, కంఠాన్ని (వాక్కును) కూడా ఇచ్చాడు. పక్షిలా ఎగరలేకపోయినా, చేపలాగా ఈదలేకపోయినా ఈ బుద్ధిబలం చేత నీళ్ళలో, గాలిలో వెళ్ళగల శక్తి (ఓడలు, విమానాల ద్వారా) సమకూర్చుకోగలిగాడు. నెమలిని చూసి నృత్యాన్ని, కోకిలను అనుకరించి గానాన్ని నేర్చుకున్నాడు. ఇంతటి ప్రజ్ఞ సమకూర్చుకోవడమేగాదు, ప్రదర్శించగలుగుతున్నాడు. అయితే ఇంతటి ప్రజ్ఞకు ఆధారభూతమైన శరీరాన్ని జాగ్రత్తగా పోషించకపోతే అనారోగ్యం చేత నశించిపోతుంది. దీన్ని నిరంతరం ఆరోగ్యంగా నిలబెట్టాలంటే దీని గొప్పతనమేమిటో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మహాత్మాగాంధీ తన జీవిత చరిత్రలో ఇలా రాసుకున్నారు - ‘‘ నేను చిన్నతనంలో ఆటలాడేవాణ్ణికాను, అందరూ ఆడుకునే సమయంలో అవి మానేసి వెళ్ళిపోయిన కారణంగా నా శరీరం ఆరోగ్యంగా తయారుకాలేదు. తరచూ వ్యాధులకు గురవుతుండేవాడిని. రోగనిరోధక శక్తి తక్కువైపోయింది. అందుకే పిల్లలు ఆ వయసులో ఆటలు బాగా ఆడాలి అని చెబుతుంటాను’’ అని రాసుకున్నారు. ఆటల ద్వారా వ్యక్తిగత మనస్తత్వం కంటే జట్టు మనస్తత్వం ఏర్పడుతుంది. అంటే పెద్దయిన తర్వాత కూడా ఈ టీం స్పిరిట్ జీవితంలో ప్రతి దశలో ముందుకు తీసుకెడుతుంది.’’ మేం ఎప్పుడూ గెలవాలి. అందరికంటే ముందుండాలి’’ అనే భావన కేవలం మీరు ఆడే అటల్లోంచే వస్తుంది. ఏ వయసులో ఉన్న వాళ్ళు ఆ వయసుకు తగ్గ వ్యాయామం నిరంతరం చేస్తుండాలి. యజుర్వేదం కూడా శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఒక మంత్రంలో నొక్కి చెపుతుంది. వికాసం అనేది అకస్మాత్తుగా ఒక్కరోజులో వచ్చి ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. వ్యాయామమే కాదు, దాని ఆరోగ్యం కాపాడాలంటే చక్కటి పోషకాహారం అందించాలి. నా చిన్నతనం నుండీ ఉద్యోగంలో చేరేవరకూ అమ్మపెట్టే చద్దన్నం తినడం మినహా ఫలాహారం (బ్రేక్‌ఫాస్ట్) అంటే మరేదీ తెలియదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఉదయం తీసుకునే ఆహారం పెరుగన్నం మాత్రమే. దీనిని ‘మాత్రా ప్రసాదం’ అంటారు. నిజానికి అది ‘మాత్రా’ కాదు, ’మాతృప్రసాదం’. వకుళమాత దగ్గర తయారుచేస్తారు. పెరుగన్నం తయారుచేసి కొత్తకుండ పగులగొట్టి, కుండ పెంకులో ఈ అన్నం పెట్టి కులశేఖరుపడి ఆళ్వారు దాటి లోపలకు తీసుకెడతారు. మిగిలినవి ఎన్ని ప్రసాదాలు చేసినా ప్రధాన గడపకు ఇవతలే ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఏం తింటారంటే..అమ్మచేత్తో పెట్టిన పెరుగు-అన్నం. ఇది ఉదయాన్నే తింటే విశేషమైన బలం ఇస్తుంది. రాత్రిపూట తినగూడదు. త్వరగా జీర్ణం కాదు. అందువల్ల పిల్లలందరూ కూడా బాగా ఆటలాడడం ద్వారా వ్యాయామం చేసి, తాజా ఆహార పదార్ధాలతో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉండడమన్నది మానవ ప్రయత్నంగా ఉంటుంది. ఆరోగ్యం లేక మంచాన పడితే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఏం ప్రయోజనం? మనం మనకే కాదు, పదిమందికీ పనికిరావాలి అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే వ్యక్తిత్వ వికాసంలో మొదటిమెట్టు విజయవంతంగా ఎక్కినట్టే.


