దసరా వేళ సిటీలో కనిపించని రాష్ట్ర పక్షి
నగర విస్తరణతో మారుతున్న ఆవాసాలు
దసరా వచ్చిందంటే జమ్మిచెట్టు పూజలు.. పెద్దల ఆశీర్వాదాలు.. పాలపిట్ట దర్శనం అనేది తెలంగాణలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పాలపిట్టను చూసేందుకు ఒకప్పుడు పొలాల గట్లు, చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలపై దృష్టి సారించేవారు.
అయితే వేగంగా విస్తరిస్తున్న మన నగరంలో ఆ నీలిరంగు రెక్కల అందం అదృశ్యమవుతోంది. దసరా వేళ పాలపిట్ట కోసం నగర శివారు ప్రాంతాల వైపు వెళ్లాల్సి వస్తోంది. ఇది కేవలం ఓ పక్షి జాడ కోసం అన్వేషణ మాత్రమే కాదు.. నగరంలో మారుతున్న జీవ వైవిధ్యానికి అద్దం పట్టే అంశం కూడా!
సంప్రదాయంలో ప్రత్యేక స్థానం..
పాలపిట్టగా పిలిచే ఇండియన్ రోలర్ పక్షిని విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజ అనంతరం చూడటం శుభప్రదమనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఒకప్పుడు పల్లెల్లో సహజంగా కనిపించే ఈ పక్షిని ఇప్పుడు ప్రత్యేకంగా వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తోందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని శామీర్‌పేట సరస్సు, గండిపేట, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఖాజాగూడ లేక్ వంటి పచ్చదనం ఉన్న ప్రాంతాల్లోనే దీని ఉనికి కనబడుతోంది. హైదరాబాద్ బర్డ్ అట్లాస్ తొలి సీజన్ సర్వేలో మొత్తం 26 పక్షులను గుర్తించగా, శామీర్‌పేట, పీర్జాదిగూడ, శంషాబాద్ పరిసరాల్లో వీటి ఉనికి నమోదైంది.
పావురాల వల్ల..
హైదరాబాద్ చుట్టూ నిర్మాణాలు పెరగడం, ఖాళీ స్థలాలు తగ్గడం, పాత చెట్ల తొలగింపు, పురుగుమందుల వినియోగం వంటి అంశాలు పక్షుల జీవన పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయి. సిటీలో అతిగా పెరిగిన పావురాల వల్ల కూడా ఇతర పక్షుల మనుగడ కొంత వరకు కష్టతరమైతుందని పరిశోధకులు చెబుతున్నారు. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదికలోనూ ఇండియన్ రోలర్ జాతీయ స్థాయి దీర్ఘకాలిక ధోరణి తగ్గుదలగా నమోదైంది. పాలపిట్ట దర్శనమే కాకుండా దాని పరిరక్షణనూ మనం బాధ్యతగా తీసుకోవాలని పక్షి ప్రేమికులు అంటున్నారు.
ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో షాపుల్లో కొత్త సరుకులు!


