రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో షాపుల్లో కొత్త సరుకులు! | Telangana Ration Shops Essential Commodities Subsidy | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో షాపుల్లో కొత్త సరుకులు!

Oct 20 2026 6:44 AM | Updated on Oct 20 2026 6:44 AM

Telangana Ration Shops Essential Commodities Subsidy

రేషన్‌ దుకాణాల్లో పంపిణీపై ప్రభుత్వం కసరత్తు

పామాయిల్, చక్కెర, చింతపండు తదితర నిత్యావసరాలు కూడా..

14 నెలల పాటు ఆహార భద్రతకు ప్రణాళిక

అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ దుకాణాల ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి తదితర నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఊరట కల్పించేలా ఈ ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.

సరుకుల సేకరణ, లబ్ధిదారులకు అందించే పరిమాణాలు, పంపిణీ విధానం, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై చర్చించారు. అధికారుల ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం నిత్యావసరాల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

వర్షాభావం ఏర్పడి పంటల దిగుబడులు తగ్గినా, ఆహార ధాన్యాల ధరలు పెరిగినా ప్రజాపంపిణీ వ్యవస్థకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రేషన్‌ ద్వారా లబ్ధి పొందుతున్న 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా 14 నెలలకు సరిపడా నిల్వల సమీకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

11.7 నెలలకు సరిపడా బియ్యం
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజనం తదితర అవసరాలకు నెలకు 2.38 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. అక్టోబర్‌ 16 నాటికి బఫర్‌ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలున్నాయి. మరో 18.39 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్, ఇతర వనరుల ద్వారా రావాల్సి ఉంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే మొత్తం 28.03 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం లభించనుంది.

ఇది సుమారు 11.7 నెలల అవసరాలకు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యం నిర్ణీత గడువులోగా ప్రభుత్వ గోదాములకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో భవిష్యత్తులో పంటలు దెబ్బతిన్నా లక్షలాది కుటుంబాల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. సమీక్షలో పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ ముఖచిత్రాన్ని గ్లోబల్‌ సమ్మిట్‌ మార్చేస్తుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement