ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ భవన ప్రారంభోత్సవంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డీజీపీ సీవీ ఆనంద్, డీజీ మహేశ్ భగవత్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సు ఏర్పాట్లు అదిరిపోవాలి
120 దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా ఉండాలి
ఫ్యూచర్ సిటీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
నవంబర్ నెలాఖరులోగా సమ్మిట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి
సాక్షి, రంగారెడ్డి: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 120 దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. నవంబర్ నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘ఇది కేవలం వ్యాపార సదస్సు మాత్రమే కాదు. తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే చారిత్రక వేదికగా నిలుస్తుంది. అందుకే సమ్మిట్ ఏర్పాట్లపై ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి..’ అని చెప్పారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
15 రోజుల్లో పూర్తవ్వాలి..
‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ‘మీ పెట్టుబడులకు మాది భరోసా’ పేరిట ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి సమ్మిట్ ఏర్పాట్లపై కసరత్తు చేయాలి. నిర్దేశిత గడువుకు పదిహేను రోజుల ముందుగానే పనులు పూర్తయ్యేలా చూడాలి. అవసరమైతే సిబ్బంది సంఖ్యను పెంచాలి. బహిరంగ ప్రాంగణ పనులను నవంబర్ 15లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఒక కమిటీని నియమించుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. స్కిల్స్ వర్సిటీకి ఎదురుగా ఉన్న 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయాలి. భూమి ఎత్తు పల్లాలను చదును చేసి, పరిసర ప్రాంతాలను అందంగా ముస్తాబు చేయాలి. సమ్మిట్ ప్రారంభం నాటికి మీర్‌ఖాన్‌పేట నుంచి స్కిల్స్ వర్సిటీ వరకు రోడ్డు పనులను పూర్తి చేయాలి. కుర్మిద్ద తండా రోడ్డు పనులు కూడా వేగంగా పూర్తి చేయాలి. ఏర్పాట్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎన్‌ఐయూఎంకు శంకుస్థాపన
కురి్మద్దలో రూ.200 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐయూఎం)కు మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అ«థారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనం సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎఫ్‌సీడీఏ అధికారులతో సమీక్షించారు. సాయంత్రం 4 గంటలకు ఆక్టోపస్‌కు వచ్చిన రేవంత్.. రాత్రి 8 గంటల వరకు ఫ్యూచర్‌సిటీ పరిసర ప్రాంతాల్లోనే కలియతిరిగారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్రారంభం
భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించే ముందు ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. భవనంలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించి తరుణ్ జోషికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: TG: వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడురోజులు వర్షాలు?


