హైదరాబాద్ నలుమూలలా ఏ అఘాయిత్యం జరిగినా, ఎక్కడ బందోబస్తు అవసరమైనా, ఏ ప్రత్యేక కేసు విచారణకైనా తక్షణం స్పందిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండే టాస్క్‌ఫోర్స్‌లో కొత్త శకం ఆరంభమైంది. తొలిసారిగా క్షేత్రస్థాయి విధుల నిర్వహణకు ఓ మహిళను ఎస్‌ఐగా నియమిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ జోన్ లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్ లో పనిచేస్తున్న వి.పరమేశ్వరిని టాస్క్‌ఫోర్స్ కొత్త ఎస్‌ఐగా నియమించారు.
నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియాకు చెందిన వి.పరమేశ్వరి తండ్రి మల్లయ్య సీఆర్‌పీఎఫ్‌లో హెడ్–కానిస్టేబుల్‌గా పని చేశారు. ఇంటర్ పూర్తిచేసిన పరమేశ్వరికి 2011లోనే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక డిగ్రీ, ఎంబీఏ పట్టాలు పొందారు. బ్యాకింగ్ రంగంలోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఎంబీఏ రెండో సంవత్సరంలో ఉండగానే సంబంధిత పరీక్షలకోసం నగరంలో కోచింగ్ తీసుకున్నారు.
అయితే 2020లో ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసిన తన సోదరుణ్ణి చూసిన ఉత్సాహంతో ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ పట్టుదలతో శారీరక దారుఢ్య పరీక్షలు, రాత పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఎస్‌ఐగా ఎంపికయ్యారు. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో నియమితులైన పరమేశ్వరి తుకారాంగేట్, గోపాలపురం, సైఫాబాద్ ట్రాఫిక్, సైఫాబాద్ లో విధులు నిర్వర్తించారు. పురుష అధికారులతో పోటీపడుతూ గంటల తరబడి నిర్విరామంగా పని చేయడం, బందోబస్తు స్కీమ్స్ రూపొందించడంలో పరమేశ్వరికి ప్రత్యేక నైపుణ్యం ఉంది.
– శ్రీరంగం కామేష్, సాక్షి


