breaking news
Task Force
-
దారి చూపిన చెప్పులు
దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 10న చోటు చేసుకున్న విధ్వంసం మానవబాంబు దాడిగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సిటీ పోలీసు విభాగానికి గుండెకాయ లాంటి నగర పోలీసు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై 2005 అక్టోబర్ 12న రాత్రి 7.20 గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఓ చెప్పుల జత ఆధారంగా ముందుకు వెళ్లారు. బేగంపేటలో గ్రీన్లాండ్స్ చౌరస్తాలోని నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్‌కు మారింది) 2005 అక్టోబరు 12న మానవబాంబు దాడి జరిగింది. నగరానికి చెందిన గజ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ కుట్రలో బంగ్లాదేశ్‌కు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్ మానవబాంబుగా మారాడు. ముందే పెట్టుకున్న ముహూర్తం ప్రకారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై దాడి చేశాడు. ఆ రోజు దసరా పండుగ కావడం, అప్పటికి కొద్ది నిమిషాల ముందే సిబ్బంది సమావేశం ముగించుకుని బయటకు వెళ్లిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పి ఉగ్రవాదుల అంచనాలు తలకిందులయ్యాయి. సెంట్రీ డ్యూటీలో ఉన్న హోంగార్డు ఎ.సత్యనారాయణ చనిపోగా, కానిస్టేబుల్ వెంకట్రావుకు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన కొద్దిసేపటి వరకు అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పంజగుట్ట పోలీసులు తొలుత ఇది టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉంచిన బాణసంచా లేదా స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వల్ల జరిగిందని భావించారు. కొంత సమయానికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం అనేక కోణాల్లో పరిశీలించి, మృతదేహం శరీరభాగాలు సేకరించి, విశ్లేషించిన తర్వాతే మానవబాంబు దాడిగా నిర్ధారించింది. ఈ ఘాతుకం విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, హోంమంత్రి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే చాలా వరకు ధ్వంసమైన టాస్క్‌ఫోర్స్ కార్యాలయం మొండి గోడల నుంచి అప్పటికీ పొగలు వస్తూనే ఉన్నాయి. పోలీసుల్నే టార్గెట్‌గా చేసిన ఈ దాడి కేసును సవాలుగా తీసుకున్న అధికారులు పంజగుట్ట పోలీసుస్టేషన్ నుంచి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు.ఈ కేసును ఎంత సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినా, తొలి అడుగు వేయడానికి అవసరమైన ఒక్క ఆధారంగా కూడా అప్పటికి పోలీసుల వద్ద లేదు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఓ వ్యక్తి మానవబాంబుగా మారి దాడి చేశాడనే అంశం తప్ప అతడు ఎవరు? ఎక్కడి వాడు? వెనుక ఉన్నది ఎందరు? తదితర వివరాలేవీ అందుబాటులో లేవు. మానవబాంబు ఎవరనేది తెలిస్తేనే అడుగు ముందుకు పడుతుందని భావించిన పోలీసులు మరోసారి ఘటనాస్థలిని సమగ్రంగా పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని రప్పించారు. అక్కడి అణువణువూ పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులకు ఓ జత తోలు చెప్పులు లభించాయి. ఆరో నంబర్ సైజుతో కూడిన వాటిని అంతకు ముందు సేకరించిన మానవబాంబు మృతదేహం పాదాలకు పోల్చిచూడగా సరిగ్గా సరిపోయాయి. దీంతో అవి మానవబాంబువే అని నిర్ధారించిన నిపుణులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిపై ఉన్న ‘టీకే 200’ అక్షరాలు నిపుణుల దృష్టిలో పడ్డాయి. అది ఆ చెప్పుల రేటును స్పష్టం చేసే అంశంగా తేల్చిని అధికారులు చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కరెన్సీ వివరాలు ఆరా తీశారు. ఇలా టీకే అంటే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా అని గ్రహించిన నిపుణులు సదరు మానవబాంబు బంగ్లాదేశ్‌కు చెందిన వాడని స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం కోణంలో దర్యాప్తు జరిగి కేసు కొలిక్కి వచ్చి, ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) పాత్ర వెలుగులోకి వచ్చింది. అలా దొరికిన తీగతో మొదలైన దర్యాప్తు దేశవిదేశీ కోణాలను వెలికి తీసింది. ‘టాస్క్‌ఫోర్స్’ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ విదేశాల్లో, పరారీలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన పది అరెస్టు చేసింది. మూడో నిందితుడిగా ఉన్న మానవబాంబు డాలిన్ ఘటనాస్థలిలోనే మరణించాడు. మిగిలిన తొమ్మిది మందిలో ప్రధాన నిందితుడు గులాం యజ్దానీ అలియాస్ నవీద్ 2006లో ఢిల్లీలో, రెండో నిందితుడిగా ఉన్న షాహెద్ అలియాస్ బిలాల్ 2007లో పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో ఎన్కౌంటర్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫ్, ముతాలిబ్, ఇక్బాల్, అష్రాఫ్, పాకిస్తాన్‌కు చెందిన ఖాన్ అలియాస్ పఠాన్లతో సహా ఏడుగురు చిక్కనే లేదు. ఈ కేసుకు సంబంధించి సిట్ చార్జ్‌షీట్, సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, అదనపు సెక్షన్లు చేర్చే విషయంపై స్టే కారణంగా సుదీర్ఘకాలం విచారణకు బ్రేక్ పడింది. చివరకు 2012లో మళ్లీ నాంపల్లి కోర్టులో ట్రయల్ ప్రారంభమైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులపై నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందింది. దీంతో ఈ కేసు వీగిపోయి నిందితులు బయటపడ్డారు. -
విజిలెన్స్‌లో ఏఐ టాస్క్‌ఫోర్స్: వీసీ సజ్జనార్
అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు.సజ్జనార్ మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరం. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయి. కాబట్టి వ్యవస్థను పటిష్ట పరచి, మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.సింగరేణి సంస్థతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. నేడు దేశ జీడీపీ పెరుగుదలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ యువ సీఎండీ ఎన్ బలరామ్ సారథ్యంలో పలు వ్యాపార విస్తరణ చర్యల ద్వారా గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ దిశగా మరింత వేగంగా ఎదగాలి అని ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలను వివరించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కోసం, పని గంటల సద్వినియోగం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను మరింత పటిష్ట పరిచేందుకు ఈసారి విజిలెన్స్ వారోత్సవాలలో ప్రముఖులను ఆహ్వానించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా, అలాగే అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. -
ఎందుకు వచ్చేశాడు? ఎవరిని కలిశాడు?
సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) నమోదైన కేసులో వాంటెడ్‌గా ఉండి, గత వారం టాస్క్ ఫోర్స్ పోలీసుల కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన సతీష్ ఉప్పలపాటి వ్యవహారంలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని విచారిస్తున్న ఉన్నతాధికారులు పోలీసు బృందాలకి నేతృత్వం వహించిన సబ్–ఇన్స్పెక్టర్ కదలికల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క పరారీలో ఉన్న నిందితుడు సతీష్‌తో పాటు ఆయన భార్య శిల్ప బండ కోసం సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహారం... ఘరానా మోసగాడు సతీష్‌ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్‌్కఫోర్స్ ఎస్ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు. రెండు గంటల ముందే వచ్చిన మరో కారు... వీరిది ఎస్యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్‌లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్‌లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్ఐ సమాచారం ఇచ్చారు. బృందం రాకముందే హైదరాబాద్‌కు.. సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గా లిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్ ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్‌ను పోలీసులు ప్రశి్నస్తున్నారు. వాహనాలు మారుస్తూ ఏమారుస్తూ... సదాశివపేట్ దాబా వద్ద నుంచి సతీష్, అతడి కుటుంబం మహారాష్ట్రలోని కొల్హాపూర్ వరకు వెళ్లింది. అక్కడ నుంచి మరో కారు అద్దెకు తీసుకుని ముంబై రూట్లో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిందితులను పట్టుకోవడానికి బుధవారం నుంచి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఫిర్యాదు మేరకు సతీష్ తదితరులపై సీసీఎస్‌లో నమోదైన కేసులో నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు దొరకొద్దని భావించిన సతీష్, శిల్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈలోపే టాస్‌్కఫోర్స్‌కు చిక్కడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు. -
చదివింది ఎంటెక్... చేసేది చీటింగ్స్!
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్ చదివిన ఓ వ్యక్తి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేసి వాటిలో జరిగే ఎంపిక ప్రక్రియ తెలుసుకున్నాడు. ఆపై తానే సొంతంగా ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో ఎర వేశాడు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో మోసం చేశాడు. ఇతడిపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు కావడంతో సెంట్రల్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం టాస్‌్కఫోర్స్ వైవీఎస్ సు«దీంద్ర వివరాలు వెల్లడించారు. చింతల్ వెంకటేశ్వర నగర్‌కు చెందిన కె.భార్గవ్ ఎంటెక్ పూర్తి చేసి కొన్ని ఐటీ కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్‌గా పని చేశాడు. ఇలా ఇతడికి ఆయా కంపెనీల్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పడింది. దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన అతను ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ వద్ద ఓ కార్యాలయాన్నీ అద్దెకు తీసుకుని అందులో నియోజీన్ సాఫ్ట్‌టెక్ పేరుతో కార్పొరేట్ లుక్‌తో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. అందులో కొందరిని ఉద్యోగులుగా నియమించడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ డిజైన్ చేశాడు. తన కార్యాలయం ఫొటోలను ఈ వెబ్సైట్లో పొందుపరిచాడు. క్లౌడ్ సరీ్వసెస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ రంగాల్లో వివిధ ఉద్యోగాలు ఉన్నట్లు ఆన్లైన్లోనే ప్రకటన ఇచ్చాడు. జూనియర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తదతర ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామని పేర్కొన్నాడు. కొందరు ఉద్యోగార్థులు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఈ కంపెనీ వెబ్సైట్, అందులో ఉన్న ఫొటోలు చూసి పెద్ద కంపెనీగా భావించారు. దరఖాస్తు చేసిన వారికి కన్సల్టెంట్స్ ద్వారా శిక్షణ కూడా ఇప్పించాడు. ఆపై ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరు ఎంపికైనట్లు ప్రకటించాడు. వీరికి ఈ–మెయిల్ ద్వారా జాబ్ ఆఫరింగ్ లెటర్లు పంపి... వారి నుంచి అడ్వాన్సులు, డిపాజిట్ల పేరుతో రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశాడు. భారీ మొత్తం దండుకున్న తర్వాత తన కార్యాలయం మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి చేతిలో మోసపోయిన వారి ఫిర్యాదుతో లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. భార్గవ్ ఆచూకీ కనిపెట్టడానికి మధ్య మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.లక్ష నగదు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, గుర్తింపుకార్డులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లాలాగూడ పోలీసులకు అప్పగించారు. ఈ మోసాలు చేయడంలో ఇతడికి సహకరించిన వారు మరికొందరు ఉన్నారని గుర్తించిన టాస్‌్కఫోర్స్ వారి కోసం గాలిస్తోంది. -
నకిలీ వైద్యానికి ముకుతాడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) సిద్ధమైంది. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా వైద్యం పేరిట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ఆసుపత్రులతో పాటు ఎంబీబీఎస్ డాక్టర్ల పేరిట, స్పెషలిస్ట్ వైద్యులుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నవారి ఆట కట్టించేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న విజిలెన్స్ బృందాలకు తోడు ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. వరంగల్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ బృందాలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరిపి, అవసరమైన చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నాయి. ఒక్కో టీంలో 30 మంది వైద్యులు టీజీఎంసీ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఒక్కో బృందంలో దాదాపు 30 మంది స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా), హెల్త్‌కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ)లకు చెందిన డాక్టర్లు ఇందులో ఉంటారు. మెడికల్ అండ్ హెల్త్, డ్రగ్ కంట్రోల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పోలీస్ ఆధికారులు, న్యాయవాదులు, ఎన్జీవోల ప్రతినిధులు, జర్నలిస్టులను సైతం ఈ బృందాల్లో భాగస్వాములను చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై ఎక్కడికక్కడ నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాల్లో కీలక రంగాలవారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విజిలెన్స్ టీంలు క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. టీజీఎంసీ బృందాల ద్వారా క్షేత్రస్థాయి వరకు నిఘా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామాల్లోని ఆర్ఎంపీలు, ప్రాథమిక చికిత్స క్లినిక్‌లు, అంబులెన్స్ సర్వీస్‌లు నడిపేవారు పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు దళారులుగా వ్యవహరిస్తున్న అంశాన్ని టీజీఎంసీ సీరియస్‌గా పరిగణిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు విజిలెన్స్ బృందాల తనిఖీల్లో 400 మంది నకిలీ డాక్టర్లు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీకి టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా పది టాస్‌్కఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బృందాలు క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించి నివేదిక ఇవ్వాలన్నారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన శాఖ ఉన్నాధికారులతో సమావేశం నిర్వహించారు. టాస్‌్కఫోర్స్ బృందాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల తీరు ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ సాగేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి తేవాలని చెప్పారు. దీనిపై త్వర లో సెంట్రల్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్న ట్లు పేర్కొన్నారు. ఎక్విప్మెంట్ స్థాయిని బట్టి రెండు నుంచి నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకో బయోమెడికల్ ఇంజనీర్ రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లనునియమించకపోవడంతో చిన్న చిన్న రిపేర్ల కోసమూ ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని అధికారులు రాజనర్సింహకు వివరించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలన్నా రు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మిషన్లను రిపేర్‌లో పెడుతున్నారని అధికారులు వివరించగా... అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారిపై కొర డా ఝుళిపించాలన్నారు. ఎక్స్పైరీ తేదీ కంటే 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేని పక్షంలో వెనక్కి పంపించాలన్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలన్నారు. పలు హాస్పిటల్స్‌లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ సరిగా లేవని గుర్తించామని, నాలుగైదు సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేదని అధికారులు వివరించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త వద్దని, ప్రతి హాస్పి టల్లో అవసరమైనమేర అలారమ్, స్మోక్ డిటెక్టర్స్, మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచాలని రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార నాణ్యతపై టాస్క్‌ఫోర్స్!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో పంపిణీ చేస్తున్న ఆహారం నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మొదలు... సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభు త్వ వైద్య కళాశాలల్లో అందించే ఆహారం నాణ్య తపై నిఘా, పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ కమి టీని ఏర్పాటు చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్యారోగ్య శాఖ పరిధి లోకి వచ్చే అన్ని విద్యా సంస్థల్లో అందించే ఆహా రం నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ఈ కమి టీకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సంబంధిత విద్యా సంస్థ ఉన్నతాధికారి/ అదనపు సంచాలకుడు, విద్యా సంస్థ జిల్లా స్థాయి అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ/ డీటీడబ్ల్యూఓ/డీబీసీడబ్ల్యూఓ/ డీఈఓ) తదితరులుంటారు. ఈ కమిటీ నిర్దేశించిన విద్యా సంస్థలను సందర్శించి ఆహార భద్రత చర్యల ను పరి శీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సంస్థలో లోటుపాట్లను గుర్తిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు చేయాలని సూచించింది.విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పర్యవేక్షక అధికారిటాస్క్ఫోర్స్ మాత్రమేకాకుండా విద్యా సంస్థల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను, పర్యవేక్షక అధికారిని సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేసింది. విద్యా సంస్థల్లో మెరుగైన, బలవర్థకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. కలుషిత ఆహారంతో కలిగే అనా రోగ్య సమస్యలు, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.» ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యా సంస్థ ప్రధానోపా« ద్యాయుడు/ ప్రిన్సిపల్/ వార్డెన్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.» ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు స్టోర్ రూమ్, వంట గదిని తనిఖీ చేయాలి. తర్వాత వంటగది నిబంధనలకు అనుగుణంగా నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించాలి.» వంట వండిన తర్వాత ఆహార నాణ్యతను కమిటీ సభ్యులు రుచి చూసి పరిశీలించిన తర్వాతే విద్యార్థు లకు అందించాలి. ప్రతిరోజు ఈ బాధ్యతలను విధిగా పూర్తి చేయాలి.» త్వరలో నోడల్ డిపార్టుమెంట్ యాప్‌ను తయారు చేస్తుంది. అప్పటి నుంచి తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, ఇతర సమాచా రాన్ని యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.» ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారికి నియమి స్తారు. ఈ పర్యవేక్షక అధికారి ప్రతిరోజు భోజనం వండే ముందు, తర్వాత తనిఖీ చేస్తారు. అక్కడి పరిస్థితిని చిత్రాలు తీసి జిల్లా కలెక్టర్/ సంబంధిత ఉన్నతాధికారికి సమర్పిస్తారు.» వీటన్నింటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనంమల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మల్హర్ మండలం మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలను గురువారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
టాస్క్‌ఫోర్స్ కేంద్రంగా వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు, ఆ పార్టీ కోసం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకి షన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ నాయిని భుజంగరావు పోలీసుల ఎదుట వెల్లడించారు. నగరంలో ఆయనకున్న వనరులను అనుకూలంగా మార్చుకుని ఈ దందాలు చేసినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కేంద్రంగా సాగిన వ్యవహారాలను ఈ వాంగ్మూలా ల్లో పోలీసులు పొందుపరిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభా కర్రావు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌రావు పేర్లు చెప్పి సైబరాబాద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకుల ఆదేశాల మేరకు పనిచేసిన రాధాకిష న్‌రావు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సెటిల్మెంట్లు పెద్దఎత్తున చేశారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నగదు రవాణాలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం తన టాస్క్‌ఫోర్స్‌ను వినియోగించడంతోపాటు ప్రతిమ, యశోద ఆస్పత్రుల యజమానుల సహకారం తీసుకున్నాడు. 15 ఆపరేషన్లు చేసిన తిరుపతన్న టీమ్తనతోపాటు ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ సహకారం తీసుకున్నారని భుజంగరావు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదు పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్‌తో పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, పది మంది కానిస్టేబుళ్లు, మరో పది మంది హెడ్ కానిస్టేబుళ్లను నియమించుకున్నారు. తిరుపతన్న రోజూ గరిష్టంగా 40 ఫోన్లు ట్యాప్ చేశారు. తన కార్యాలయంలో మూడు సిస్టమ్స్‌తోపాటు తొమ్మిది లాగర్స్‌ను ఏర్పా టు చేసుకున్నారు. ఇలా వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారంతో 15 ఫీల్డ్ ఆపరేషన్లు చేశారు. రేవంత్‌రెడ్డి మిత్రులు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మిత్రు డు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, జి.వినోద్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసు కోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు.


