సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) నమోదైన కేసులో వాంటెడ్‌గా ఉండి, గత వారం టాస్క్ ఫోర్స్ పోలీసుల కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన సతీష్ ఉప్పలపాటి వ్యవహారంలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని విచారిస్తున్న ఉన్నతాధికారులు పోలీసు బృందాలకి నేతృత్వం వహించిన సబ్–ఇన్‌స్పెక్టర్ కదలికల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క పరారీలో ఉన్న నిందితుడు సతీష్‌తో పాటు ఆయన భార్య శిల్ప బండ కోసం సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహారం...
ఘరానా మోసగాడు సతీష్‌ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్‌ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్‌్కఫోర్స్ ఎస్‌ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.
రెండు గంటల ముందే వచ్చిన మరో కారు...
వీరిది ఎస్‌యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్‌లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్‌ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్‌ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్‌లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు.
బృందం రాకముందే హైదరాబాద్‌కు..
సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్‌ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గా లిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్ ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్‌ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్‌ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్‌ను పోలీసులు ప్రశి్నస్తున్నారు.
వాహనాలు మారుస్తూ ఏమారుస్తూ...
సదాశివపేట్ దాబా వద్ద నుంచి సతీష్, అతడి కుటుంబం మహారాష్ట్రలోని కొల్హాపూర్ వరకు వెళ్లింది. అక్కడ నుంచి మరో కారు అద్దెకు తీసుకుని ముంబై రూట్‌లో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిందితులను పట్టుకోవడానికి బుధవారం నుంచి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఫిర్యాదు మేరకు సతీష్ తదితరులపై సీసీఎస్‌లో నమోదైన కేసులో నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు దొరకొద్దని భావించిన సతీష్, శిల్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈలోపే టాస్‌్కఫోర్స్‌కు చిక్కడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.


