‘పారా’ హుషార్‌ గెలుపు జీ హుజూర్‌! | sakshi special story about Asian Para Games winners of women athletes | Sakshi
Sakshi News home page

‘పారా’ హుషార్‌ గెలుపు జీ హుజూర్‌!

Oct 22 2026 2:37 AM | Updated on Oct 22 2026 2:37 AM

sakshi special story about Asian Para Games winners of women athletes

విజయపథం

‘ధనవంతులుగా పుట్టడం కంటే అదృష్టవంతులుగా పుట్టడం చాలా నయం’ అనే ప్రసిద్ధ నానుడి ఉంది.
వీరు ధనవంతులు కాదు... అదృష్టవంతులు అంతకంటే కాదు.
‘కష్టంతోనే అదృష్టం’ అనే మాటను నిజం చేసిన క్రీడా యోధులు. స్ఫూర్తిప్రదాతలు.
వైకల్యం ఉన్న చోట సహాయం అందాలి. కనీసం సానుభూతి అయినా దక్కాలి.
అదేమిటో... వైకల్యం ఉన్నవారికి వెక్కిరింతలే ఎక్కువగా ఎదురవుతుంటాయి.
అలాంటి వెక్కిరింపుల వెన్ను విరిచి, ఆత్మస్థైర్యమే శ్వాసగా 
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన మహిళలు వీరు. 
ఆసియా పారా గేమ్స్‌లో విజయపతాకం ఎగరేసిన స్వర్ణ ధీరవనితలు వీరు...

‘ఆ అమ్మాయిది మా ఊరే’ ‘మా పక్క ఊరే’... అని దీప్తి జీవాంజి గురించి ఇప్పుడు చాలామంది గర్వంగా చెబుతుంటారు. తాజాగా... జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో మహిళల 400 మీటర్ల టీ 20 ఈవెంట్‌లో చరిత్ర సృష్టించి స్వర్ణం గెలుచుకుంది దీప్తి. రేసును 56.36 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డ్‌ సృష్టించింది. గతంలో తన పేరు మీద ఉన్న రికార్డ్‌ను (56.59 సెకనులు) తానే బ్రేక్‌ చేసింది.

తన విజయాన్ని గురించి సంతోషిస్తూనే గతాన్ని గుర్తు తెచ్చుకుంది దీప్తి...
‘ఒకప్పుడు నా వల్ల నా కుటుంబం అవమానాలు ఎదుర్కొంది. తిట్లు తిన్నది. నాకంటూ ఒక పేరు సంపాదించుకున్నప్పటి నుంచి అంతా మారిపోయింది. ఇప్పుడు మాతో అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇది నాకు మరింత వేగంగా పరుగెత్తేలా శక్తిని ఇస్తోంది’

సూటిపోటి మాటలు
దీప్తి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని కల్లెడ. ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ‘ఈరోజు గడిస్తే చాలు’ అనుకునే పరిస్థితి. ఆర్థిక కష్టాల మాట ఎలా ఉన్నా, వారి బెంగ కూతురు దీప్తి గురించే. ‘మీ అమ్మాయికి మానసిక లోపం. ఎలా బతుకుతుందో ఏమో! అసలు పెళ్లవుతుందా?’... ఇలాంటి సూటిపోటి మాటలెన్నో భరించారు.

టర్నింగ్‌ పాయింట్‌
హైదరాబాద్‌లోని స్పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా శిక్షణా కేంద్రంలో చేరడం దీప్తి జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. అప్పుడు ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. దీప్తి మాట్లాడేది అర్థం కాకపోవడంతో ఆమెకు కోచింగ్‌ ఇవ్వడం కష్టం అయింది. మెల్లగా నేర్చుకోవడం వల్ల ఎక్కువ విషయాలు చెప్పడానికి లేదు. ఎక్కువ విషయాలు చెప్పడం వల్ల గందరగోళానికి గురయ్యేది. దీంతో చాలా జాగ్రత్తగా శిక్షణ ఇచ్చేవారు.

‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిసేబిటిటీ’ కేంద్రానికి దీప్తిని తీసుకెళ్లమని ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కోచ్‌ రమేష్‌కు సూచించారు. వైద్యపరీక్షల తరువాత దీప్తికి మానసిక వైకల్యం ఉన్నట్లు నిపుణులు ధ్రువీకరించారు. దీంతో ఆమె పారా మీట్స్‌లో పోటీ పడడానికి అనుమతి లభించింది. గోపీ–మైత్రా ఫౌండేషన్‌ ఆమెకు స్పాన్సర్‌గా వ్యవహరించింది.

హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో టీ 20 విభాగంలో 400 మీటర్ల పరుగులో స్వర్ణం గెలుచుకుంది. భువనేశ్వర్‌లో జరిగిన ఆల్‌–ఇండియా ఇంటర్‌–యూనివర్శిటీ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సాధించింది... 
ఆమె స్వర్ణచరిత్ర మొదలైంది.
‘రన్‌ దీప్తి రన్‌’ పేరుతో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దీప్తిపై స్ఫూర్తిదాయకమైన పుస్తకం రాశారు.

నా అంతిమ లక్ష్యం
నా కుటుంబం, నా దేశం కోసం రికార్డ్‌లు బద్దలు కొడుతూ వీలైనంత వేగంగా, వీలైనంత ఎక్కువ కాలం పరుగెత్తాలనుకుంటున్నాను. అయితే అంతకుమించిన లక్ష్యం ఒకటి ఉంది. ఎన్నో అడ్డంకులు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ నాలాగే తమ కలలను సాకారం చేసుకోవడానికి ధైర్యం చేసే యువతులకు శిక్షణ ఇవ్వడమే నా అంతిమలక్ష్యం.
– దీప్తి జీవాంజి

జయనగర్‌ నుంచి జయపథం వరకు
జయనగర్‌లోని ‘ఇండియన్‌ అథ్లెటిక్స్‌ అకాడమీ’లోకి అడుగు పెట్టినప్పుడు స్పైక్, ట్రాక్‌ టైమింగ్, స్ట్రైడ్‌ లెంగ్త్, ఆసియా పారా గేమ్స్‌ గురించి సౌమ్య కుమార్‌కు పెద్దగా అవగాహన లేదు. అయితే రెండేళ్ల వ్యవధిలోనే తానేమిటో నిరూపించుకుంది. కర్నాటకకు చెందిన సౌమ్య కుమార్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌.

ఆసియా పారా క్రీడల్లో అరంగేట్రం చేసిన సౌమ్య, దృష్టిలోపం ఉన్న మహిళల 1500 మీటర్ల టీ12/13 విభాగంలో స్వర్ణం గెలుచుకొని ప్రపంచదృష్టిని ఆకర్షించింది.
‘ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణపతకాన్ని సాధించే ప్రయాణంలో వరుస విజయాలతో సత్తా చాటింది. సౌమ్య విజయాలకు కారణం...ఆటలపై ఆమెకు ఉన్న ప్రేమ, మానసిక దృఢత్వం, కఠోరశ్రమ’ అన్నారు సౌమ్య కోచ్‌ రోషన్‌.

ఆర్థిక వనరులు అంతగా లేకపోవడం వల్ల తన ప్రయాణంలో సౌమ్య కుమార్‌ ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. అయినా ఎప్పుడూ నిరాశపడలేదు. ఉత్సాహం అనే ఇంధనంతో అడుగులు వేసింది.

అదే... తన తారకమంత్రం
‘అయ్యో...పోలియోతో పుట్టింది’ అని మోనా అగర్వాల్‌ గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు బాధ పడుతుండేవారు. అలాంటి కాలంలో ‘సంకల్ప బలం’ అనే మంత్రోపదేశాన్ని చేసింది బామ్మ. అదే... మోనా అగర్వాల్‌ సక్సెస్‌ మంత్రా.

తాజాగా... ఆసియా పారా గేమ్స్‌లో మహిళల పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో స్వర్ణపతకం గెల్చుకుంది మోనా అగర్వాల్‌...
పోలియో బారిన పడిన మోనా క్రీడారంగంలో కెరీర్‌ నిర్మించుకోవడానికి 2010లో ఇంటిని వదిలింది. పారాలింపిక్స్‌ వంటి క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం తనకు కూడా ఉందనే విషయం ఆమెకు ఆలస్యంగా తెలిసింది. ఆ తరువాత... 

ఆమె మాటల్లోనే...
→ పోటీలలో పాల్గొనే అవకాశం ఉందనే విషయం తెలిసిన తరువాత, దేనిలో నేను అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలనో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. మూడు, నాలుగు ఆటలు ప్రయత్నించిన తరువాత షూటింగ్‌ను ఎంచుకున్నాను. నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని పరికరాలు కొన్నాను. ఇది చాలా పెద్ద రిస్క్‌ అని తెలుసు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకుంటే కుటుంబం గర్వపడేలా చేయవచ్చు. అప్పులు తీర్చవచ్చు అనుకున్నాను.

→ ప్రాక్టీస్‌కు వెళ్లేముందు పిల్లలను ఇంట్లోనే వదిలి వెళ్లేదాన్ని. రోజూ వారికి వీడియో కాల్‌ చేసి మాట్లాడేదాన్ని. ‘అమ్మా... నువ్వు ఇంటిదారి మరచిపోయావా? జీపిఎస్‌ ఆన్‌ చేసి ఇంటికి తిరిగి వచ్చేయ్‌ అనేవారు’. నా మనసు బాధతో తల్లడిల్లేది. పిల్లలతో మాట్లాడిన ప్రతి సాయంత్రం ఏడ్చేదాన్ని.

→ నా ప్రయాణంలో ఆర్థిక కష్టాలు అడ్డుగా నిలిచాయి. అయినా వాటిని అధిగమించి ముందుకువెళ్లాను. పతకాలు సాధించాను.

ఆ మాటే... గెలుపు బాటగా...
‘పోటీ ఎంత గట్టిగా ఉంటే నేను అంత ఎక్కువగా సంతోషిస్తాను’ అంటుంది పారా అథ్లెట్, స్ప్రింటర్‌ సిమ్రాన్‌ శర్మ. తాజాగా... ఆసియా పారా గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల టి12లో స్వర్ణం గెలుచుకుంది.
వరల్డ్‌ పారా ఛాంపియన్‌షిప్‌(2024)లో స్వర్ణపతకం గెల్చుకొని పారా స్ప్రింట్‌ ఈవెంట్‌లో ఫస్ట్‌ ఇండియన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. పారిస్‌ పారాలింపిక్స్‌లో 200 మీటర్‌ల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. సిమ్రాన్‌ జ్ఞాపకాలు... 

ఆమె మాటల్లో...
→ ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాను. దృష్టిలోపం ఉండడంతో బంధువులు, స్నేహితులు ఎగతాళి చేసేవారు. ‘చెప్పు, ఎన్ని వేళ్లు ఉన్నాయి? 
అటువైపు ఎందుకు చూస్తున్నావు. ఇటువైపు చూడు’ అంటూ నన్ను వేధించేవారు. ఎముకలు బలహీనంగా ఉండడంతో నా శరీరం దృఢంగా ఉండేది కాదు.
నేను పరుగెడుతున్నప్పుడు బాడీ పక్కకు వంగేది. దీనివల్ల నాకు తెలియకుండానే వేరే రన్నర్‌ల దారిలోకి వెళ్లేదాన్ని. దీంతో గొడవలయ్యాయి. ఈ సమస్యను అధిగమించడానికి నా భుజాలపై రెండు–మూడు కిలోల బరువు పెట్టుకొని పరుగెత్తేదాన్ని.

→ నా భర్త, కోచ్‌ గజేంద్రసింగ్‌ ఆటల్లో నన్ను ప్రోత్సహించేవారు. అయితే ఇది గ్రామస్తులకు నచ్చేది కాదు. ఇది ఇతర మహిళలపై చెడు ప్రభావం చూపుతుందని అనేవారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేశాను.

→ ఒకరోజు శిక్షణ సమయంలో మా ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాను. ఇది చూసిన స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నాకు రెస్ట్‌ ఇచ్చారు. ఆ తరువాత ఇలా అన్నారు...

‘ప్రస్తుతానికి నువ్వు ఏమీ చేయలేవు. ఏడ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ కుటుంబానికి నువ్వు చేయగలిగే ఏకైన సహాయం ఈ పతకాన్ని గెలవడమే. గెలవాలంటే నువ్వు ప్రశాంతమైన మనసుతో శిక్షణ పొందాలి’ 
ఈ మాట నాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది. ఈ సలహా నన్ను మార్చివేసింది.  

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement