వాషింగ్టన్: నాలుగేళ్లుగా రష్యాలో నిర్బంధంలో ఉన్న ఒక అమెరికన్ పౌరుడి విడుదల అనంతరం, రష్యాపై ఆంక్షలను సడలించడంపై ప్రశ్నించినందుకు సీఎన్‌ఎన్, ఏబీసీ న్యూస్ విలేకరులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్ వెలుపల జర్నలిస్టులతో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తరఫున కిరాయి సైనికుడిగా వ్యవహరించాడనే ఆరోపణలతో రష్యాలో ఖైదు అయిన మిచిగాన్‌కు చెందిన 74 ఏళ్ల స్టీఫెన్ హబ్బర్డ్ విడుదలైన కొద్ది గంటలకే ఈ ఘటన జరిగింది.
హబ్బర్డ్ విడుదల గురించి సీఎన్‌ఎన్ కరస్పాండెంట్ కైట్లాన్ కాలిన్స్ ప్రశ్నించగా, ఆ అమెరికన్ స్వదేశానికి తిరిగి వస్తున్నాడని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆంక్షలను కొనసాగించి ఉంటే ఈ ఫలితం సాధ్యమయ్యేది కాదని ఆయన వాదించారు. ఆంక్షలను అలాగే ఉంచితే హబ్బర్డ్ మరికొన్ని దశాబ్దాల పాటు జైలులోనే ఉండిపోయేవాడని చెబుతూ, ‘మీరు ఆ ఆంక్షలను కొనసాగించి ఉంటే, ఇక ఆయనను మర్చిపోవాల్సిందే... మరో 25 ఏళ్లపాటు జైలులోనే ఉండిపోయేవాడు’ అని ట్రంప్ అన్నారు.
ఆ తర్వాత కాలిన్స్ మరో అనుబంధ ప్రశ్న అడగడంతో ఆగ్రహించిన ట్రంప్.. ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ‘ఏం మాట్లాడుతున్నావో నీకు తెలీదు. నువ్వొక డమ్మీవి. తక్కువ ఐక్యూ ఉన్నదానివి, పైగా సీఎన్‌ఎన్‌లో పనిచేస్తున్నావు. ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు, అత్యంత సున్నితమైన చర్చలు జరుగుతున్నప్పుడు ఎవరూ ఆంక్షలు విధించరు’ అని ఘాటుగా సమాధానమిచ్చారు.
అనంతరం ఏబీసీ న్యూస్ మహిళా రిపోర్టర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, హబ్బర్డ్ విడుదల కోసం ఆంక్షలను సడలించడం అంటే మాస్కోకు అనుకూలంగా రాయితీలు ఇవ్వడమే కదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అధ్యక్షుడు మరింత తీవ్రంగా స్పందించారు. ‘హబ్బర్డ్ విడుదల కోసం రష్యాపై ఆంక్షలు ఎత్తివేయడం అంటే రష్యాకు ఏదో ఒకటి అందించినట్లే కాదా?’ అని ఆమె ప్రశ్నించగా, ట్రంప్ ఆమె వైపు కోపంగా చూస్తూ, తన వేలు చూపిస్తూ ‘నువ్వు తెలివితక్కువ దానివి. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు?” అని అడిగారు. ఆమె తాను ఏబీసీ న్యూస్‌లో పనిచేస్తున్నట్లు చెప్పడంతో ‘నువ్వొక తెలివితక్కువ దానివి.. మీ నెట్‌వర్కే అత్యంత చెత్తది’ అంటూ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇదీ చదవండి: ముంబై, పూణెలను వణికిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్


