‘కంటెంట్‌’పై టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు | Avoid communal anti national content govt tells TV channels | Sakshi
Sakshi News home page

‘కంటెంట్‌’పై టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు

Oct 22 2026 8:17 AM | Updated on Oct 22 2026 8:17 AM

Avoid communal anti national content govt tells TV channels

న్యూఢిల్లీ: దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెళ్లు ప్రోగ్రామ్ కోడ్‌ను కచ్చితంగా పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉగ్రవాదం, నేరాలు, హింస, మతపరమైన అంశాలు, ఇతర ప్రధాన సంఘటనలను ప్రసారం చేసేటప్పుడు పూర్తి నియంత్రణ పాటించాలని ఆదేశిస్తూ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అనుచితంగా వినియోగించడం, విచారకరమైన దృశ్యాలను సంచలనాత్మకం చేయడం, లైంగిక నేరాలకు గురైన బాధితుల గుర్తింపును బయటపెట్టడం వంటి చర్యలపై మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. లైవ్ డిబేట్లు, ప్యానెల్ చర్చల్లో మత విద్వేషాలను గానీ, దేశ వ్యతిరేక భావజాలాన్ని గానీ ప్రోత్సహించే ధోరణి ఉండకూడదని మార్గదర్శకాల్లో మంత్రిత్వ శాఖ ప్రముఖంగా ప్రస్తావించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995, రూల్స్ 1994లోని ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలను అనేక సందర్భాల్లో పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది.

వివిధ ఛానెళ్లలో ఒకే తరహా సంచలన వార్తలు, దృశ్యాలు నిరంతరం ప్రసారమవుతున్న తీరుపై ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీ (ఐడీసీ) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన ప్రవర్తన, అభ్యంతరకర భాషను సాధారణీకరించకూడదని, టీవీ ఛానెళ్లు  చట్టబద్ధమైన బాధ్యతలను గుర్తించాలని కమిటీ స్పష్టం చేసింది. భద్రతా దళాలు చేపట్టే ఉగ్రవాద వ్యతిరేక చర్యల ప్రత్యక్ష ప్రసారంపై ఉన్న ఆంక్షలను కేంద్రం మరోసారి పునరుద్ఘాటించింది. అలాంటి ఆపరేషన్ల సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు పూర్తిగా నిషేధమని, ఆపరేషన్ ముగిసే వరకు అధికారిక ప్రతినిధులు అందించే బులెటిన్ల ఆధారంగానే వార్తలను ఇవ్వాలని స్పష్టం చేసింది.

అలాగే పాత వీడియోలను ప్రత్యక్ష ప్రసారాలుగా భావించకుండా ఉండేందుకు దృశ్యాలపై స్పష్టమైన టైమ్-స్టాంప్‌లు తప్పనిసరిగా వేయాలని సూచించింది. హింస, నేరాల వార్తలను ప్రసారం చేసేటప్పుడు వాస్తవాలను నిర్ధారించుకుని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించింది. అసత్యాలు, అర్ధసత్యాలు, నేరాలను మరింతగా ప్రచారం చేసే వార్తలకు దూరంగా ఉండాలని తెలిపింది. ప్రేక్షకులకు తీవ్ర అసౌకర్యం, ఆందోళన కలిగించే భయానక దృశ్యాలను పదేపదే లూప్‌లో ప్రసారం చేయకూడదని, అవసరమైన చోట్ల తగిన విధంగా బ్లరింగ్, మాస్కింగ్ పద్ధతులను తప్పక ఉపయోగించాలని పేర్కొంది. వీటితో పాటు ఛానెళ్లు తమ గ్రాఫిక్స్, డిజిటల్ ప్రెజెంటేషన్లలో కేవలం ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రచురించిన అధికారిక భారత మ్యాపులను మాత్రమే వినియోగించాలని నిర్దేశించింది.

ఇదీ చదవండి: ట్రంప్‌ వీరంగం: రిపోర్టర్లను తెలివిలేనోళ్లంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement