ఉద్యోగులూ.. బీకేర్‌ ఫుల్‌! | Government employees must stay away from political campaigning | Sakshi
Sakshi News home page

ఉద్యోగులూ.. బీకేర్‌ ఫుల్‌!

Oct 18 2026 3:35 AM | Updated on Oct 18 2026 3:35 AM

Government employees must stay away from political campaigning

రాజకీయ ప్రచారానికి దూరంగా ఉండాల్సిందే.. 

నిష్పక్షపాతంగా వ్యవహరించాలి 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు 

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు  

సాక్షి,అమరావతి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండి, తమ విధులను నిష్పాక్షికంగా నిర్వర్తించాలని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే  చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీస్‌ ఇతర శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఎలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేయరాదని తేల్చిచెప్పారు.  రాజకీయ సమావేశాలు, ర్యాలీలకు హాజరుకావడం, ఓట్లు అభ్యర్థించడం నిషేధమని పేర్కొన్నారు. 

పార్టీ గుర్తుల ప్రదర్శన వద్దు 
వ్యక్తిగతంగా, వాహనాలపై, ఇళ్ల వద్ద లేదా ఇతర ఆస్తులపై ఎన్నికల గుర్తులు ప్రదర్శించకూడదని,  ఎన్నికల ఏజెంట్, పోలింగ్‌ ఏజెంట్, కౌంటింగ్‌ ఏజెంట్‌గా పనిచేయరాదని ఆదేశించారు. ఎన్నికల విధులను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని, ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు ఆటంకం కలిగించడం, ఓటర్లను బెదిరించడం, ఓటు హక్కును అడ్డుకోవడం వంటి చర్యలకు చట్టప్రకారం శిక్షలు ఉంటాయని వెల్లడించారు.

సమావేశాలకు సమాన అనుమతులు
బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల సమావేశాలకు అనుమతుల విషయంలో పార్టీల మధ్య వివక్ష చూపరాదని, ఒకే సమయం, ప్రదేశానికి దరఖాస్తులు వస్తే ముందుగా దరఖాస్తు చేసిన పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement