అప్‌లోడ్ కాని 1.16 లక్షల ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రజలకు అందుబాటులో లేని 58.5 శాతం ఆర్డర్లు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 1,99,115 జీవోల జారీ
ప్రజలకు అందుబాటులో ఉన్నవి 82,657 జీవోలే
అమలుకు నోచుకోని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు
ధిక్కరణ పిటిషన్ వేసినా పట్టించుకోని అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) రహస్య పత్రాలుగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఉత్తర్వులు.. ఉండటం లేదు. 2014 జూన్ 2 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు మొత్తం 1,99,115 జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిలో 82,657 జీవోలనే ప్రజలకు అందుబాటులో ఉంచింది. మిగిలిన 1,16,458 జీవోపై గోప్యత పాటిస్తోంది. దీంతో సుమారు 58.5 శాతం ఉత్తర్వులను ప్రజలు నేరుగా పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండటం పారదర్శక పాలనకు నిదర్శనం. కానీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచించడంలేదు.
జీవోల్లోనూ భారీ వ్యత్యాసం
2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 వరకు జారీ చేసిన 19,064 జీవోలకుగాను 3,290 జీవోలే ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సమాధానంలో వెల్లడైంది. ఈ గణాంకాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రచురణలో పారదర్శకతపై ఆందోళన కలిగిస్తున్నాయి. జీవోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో వాటిని పబ్లిక్ లేదా ఇంటర్నల్ విభాగాల్లో ఉంచే అవకాశం శాఖలకు ఉంది. అయితే ఆర్టీఐ సెక్షన్ 8 లేదా 9 కింద మినహాయింపులు వర్తింపజేస్తూ ఎటువంటి కారణాలు వెల్లడించకుండానే జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంచుతున్నారనే ఆరోపణలున్నాయి.
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రచురణకు సంబంధించి గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్‌లోని జీవోలను 8 వారాల్లో అప్‌లోడ్ చేయాలని 2022 మార్చి 10న ఆదేశించింది. తర్వాత దాఖలైన మరో పిటిషన్‌లోనూ ఇదే తరహా ఆదేశాలిచ్చింది. రెండో పిటిషన్‌లో ఆదేశాల అమలుకు నిర్దేశించిన గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 17తో ముగిసినా అవి అమలుకు నోచుకోలేదు. దీనిపై ధిక్కరణ పిటిషన్ దాఖలైనా అధికారుల్లో చలనం రావడం లేదు.
పారదర్శకత కోసమే పిటిషన్..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటికి సంబంధించిన అధికారిక ఆధారాలను ప్రజలు తెలుసుకోవడానికి ప్రభుత్వ ఉత్తర్వులు కీలకం. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అధిక సంఖ్యలో జీవోలు ప్రజలకు కనిపించడం లేదు. గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛతోపాటు సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంది. – విజయ్‌రెడ్డి, మెదక్ (పిటిషనర్)
‘ప్రభుత్వాలు జారీ చేసే ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలన్న జీవో 4ను అమలు చేయాలి. జీవోల రహస్య నిర్వహణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’ – హైకోర్టు (గత డిసెంబర్‌లో ఉత్తర్వులు)
వందల రోజుల సమయం..
ప్రభుత్వం జారీ చేసిన జీవోల సంఖ్య, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వివరాలు, శాఖలవారీ గణాంకాలు, ప్రచురించని జీవోలకు సంబంధించిన కారణాలు, అప్‌లోడింగ్ నిబంధనలపై సమాచారం కోరుతూ కొందరు ప్రజాసమాచార అధికారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. అయితే పోర్టల్‌లో దరఖాస్తును ‘డీమ్డ్ రిఫ్యూజల్’గా నమోదు చేశారు. దీనిపై మొదటి అప్పీల్‌ను వేసినా ‘డీమ్డ్ రిఫ్యూజల్’గా పేర్కొన్నారు. చివరకు ప్రజా సమాచార అధికారి సమాధానమిస్తూ ఈ అంశం తమ శాఖ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారానికి వందల రోజులు తీసుకోవడం గమనార్హం.
హైకోర్టుకు అభ్యర్థనలు..
» జీవోలకు సంబంధించిన సమాచారాన్ని రెండు వారా ల్లోగా ఉచితంగా అందించేలా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఈఅండ్‌సీ) శాఖను ఆదేశించాలి.
» 2014 జూన్ 2 నుంచి జారీ చేసిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను జీవోఐఆర్ పోర్టల్‌లో ప్రచురించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
» చట్టప్రకారం మినహాయింపు వర్తించే జీవోలనే ఆయా కారణాలతో కూడిన ఉత్తర్వుల ద్వారా ప్రచురణ నుంచి మినహాయించాలి.
» ప్రచురించని జీవోల సంఖ్యను శాఖలవారీగా వెల్లడించాలి. భవిష్యత్తులో జారీ చేసే జీవోలను గడువులోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా ఆదేశాలివ్వాలి.
» జీవో ఎంఎస్ నంబర్ 4 ప్రకారం ప్రతి ప్రభుత్వ శాఖలో వెబ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్లను నియమించాలి.
» సమాచార కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు నిర్వహించేలా కనీసం ఏడు రోజుల ముందుగా లిఖితపూర్వక నోటీసులిచ్చేలా ఆదేశించాలి.
» విచారణల రోజువారీ ఉత్తర్వులను మూడు రోజుల్లోగా నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదును నాలుగు వారాల్లో పరిష్కరించాలి.
» హైబ్రిడ్ విచారణల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిధులను సమాచార కమిషన్‌కు ప్రభుత్వం సమకూర్చేలా ఆదేశించాలి.


