ట్రావెల్
దసరా అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. వాడవాడలా వెలసిన అమ్మవారి మూర్తులు, బతుకమ్మల సంబురాలు, దాండియా ఆటలు.. ఒక్కసారిగా అంతటా సందడి వాతావరణం, ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. భారత దేశంలో ఒక్కోచోట ఒక్కో విధంగా జరుపుకునే విజయదశమి వేడుకలకు కొన్ని ప్రదేశాలు పెట్టింది పేరుగా నిలుస్తాయి. వాటి గురించి తెలుసుకుంటూ.. ప్రయాణిద్దాం...
పశ్చిమ బెంగాల్
విజయదశమి అంటే ముందుగా పశ్చిమ బెంగాల్ గుర్తొస్తుంది. కోల్‌కతాలో దసరా అంటే దుర్గా పూజ. ఈ సమయంలో బెంగాల్ లోని ప్రతి వీధి జాతరను తలపిస్తుంది. మట్టితో చేసిన దుర్గా విగ్రహాలను దర్శించుకుని భక్తులు తరిస్తారు.
డోలు శబ్దం వింటుంటే, తెలియకుండానే భక్తులు ఉద్వేగానికి గురవుతారు. కుమార్టులీ అనే వీధిలో ఏడాది పొడవునా అమ్మవారి విగ్రహాలే తయారు చేస్తారు. అయితే పండగకు రెండు రోజుల ముందు వెళ్తే అమ్మవారి ముఖానికి కళ్లు అతికించే చక్షుదానం అనే కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అలాగే ఇదే సమయంలో జరిగే సింధూర్ ఖేలాలో ఆడవాళ్లు ఒకరికొకరు బొట్టు పెట్టుకుని అమ్మవారిని నిమజ్జనం చేసే ఆచారాన్ని వీక్షించవచ్చు.
వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రాచీన నగరమైన వారణాసిలో రామ్ లీలా నెలరోజుల పాటు జరుగుతుంది. గంగా తీరాన రామాయణం ప్రతి రోజూ ప్రత్యక్షమవుతుంది. రావణ దహనం చేసే రోజు మణికర్ణిక ఘాట్ దగ్గర జనాలు కిక్కిరిసిపోతారు.
మైసూరు, కర్నాటక
దసరా సందర్భంగా చాలా మంది మైసూరు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. కర్ణాటకలోని ఈ నగరం ఈ సమయంలో కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. మైసూరు ప్యాలెస్ రాత్రి సమయంలో దీపాలంకరణలో వైభవంగా వెలిగిపోతుంది. లక్ష బల్బులు ఒకేసారి వెలిగితే.. ఆ వెలుగును చూడటానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది.
కులూ, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ కు గుండెకాయ లాంటి కులూలో జరిగే దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. చల్లని గాలిలో దేవతామూర్తుల ఊరేగింపు అక్కడి ఆచారాల్లో ప్రధానమైంది. కులూలో మొత్తం 365 దేవతలు కొలువుండగా ఆ మూర్తులను కులూ మైదానానికి తీసుకొస్తారు. డోలు, నగారా మోగుతుంటే, పహాడాల మధ్య డ్యాన్స్ చేస్తూ ఈ దేవతలను రఘునాథ్ జీ ని (శ్రీరాముడు) రథంపై కూర్చోబెట్టి భక్తులు లాగుతారు. ఇలా రథం లాగిన తర్వాత ఏడు రోజుల పాటు కులూ మొత్తం ఫెస్టివల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.
బస్తర్, ఛత్తీస్ గఢ్
బస్తర్‌లో దసరా వేడుకలు కాస్త భిన్నంగా జరుగుతాయి. ఛత్తీస్ గఢ్ అడవుల్లో గిరిజన సంస్కృతి పరిమళిస్తుంది. స్థానికుల జీవన విధానం, ఆచారాల ప్రకారం దసరా ఇక్కడ 75 రోజుల పాటు జరుపుతారు. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద దసరా వేడుకగా పిలుస్తారు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ఈ యాత్ర మొదలు పెట్టడం మంచిది. ఉదయం ఎయిర్ పోర్ట్ తేనీటిని సేవిస్తూ ఫ్లైట్ ఎక్కొచ్చు. మైసూరుకి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోయినా, బెంగళూరు మీదుగా వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లే ప్రయాణం చాలా బాగుంటుంది. పచ్చని పొలాల మధ్య కారులో షికారు చేస్తుంటే దసరా సంబరాల వైబ్ ను ముందే ఫీల్ అవ్వొచ్చు.
విజయవాడ నుంచి ప్లాన్ చేసే వారు కూడా హైదరాబాద్ మీదుగా ప్లాన్ చేసుకోవాలి. . విజయవాడలో కృష్ణా నదిని చూసి, మళ్లీ హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కోల్‌కతాకి వెళ్తే ఒక చిన్న ట్రాన్సిషన్ లా ఉంటుంది. కోల్ కతాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి.
వారణాసికి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. కులూ కోసం చండీగఢ్ వరకు వెళ్లి, అక్కడి నుంచి పర్వతాల మధ్య జర్నీ చేయడం అద్భుతమైన అనుభవం.
బస్తర్ వెళ్లడానికి ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్ వరకు ఫ్లైట్ లో వెళ్లి తర్వాత రోడ్డు మార్గంలో అడవిలో ప్రయాణించవచ్చు.
ఎక్కడ ఉండాలి?
మైసూరులో ప్యాలెస్ దగ్గర ఉన్న హెరిటేజ్ బంగ్లాలో ఉంటే, మార్నింగ్ వాక్ సమయంలో ప్యాలెస్ గేట్ కనిపిస్తుంది. చెట్టు కింద టేబుల్ వేసి ఇచ్చే ఫిల్టర్ కాఫీలో కూడా పండుగ ఫ్లేవర్ ఉంటుంది. కోల్ కతాలో కుమార్టులీ దగ్గర ఉన్న బోటిక్ హోమ్ స్టేలో ఉంటే, రాత్రంతా డోలు శబ్దాన్నివింటూ నిద్రపోవచ్చు.
వారణాసిలో గంగా తీరంలో ఉన్న ఘాట్ సైడ్ హోటల్లో ఉంటే, సుబహ్ ఎ బనారస్ హారతి చూడొచ్చు. కులూలో వుడెన్ కాటేజీలో ఉంటే, బయట చలిలో హీటర్ ముందు కూర్చుని చాయ్ తాగడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది.
బస్తర్ లో చిత్రకోట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఎకో రిసార్ట్ లో ఉంటే జలపాతాల సౌండ్ తో నిద్ర నుంచి మెలకువ వస్తుంది.
ఏం చూడాలి?
మైసూరులో సాయంత్రం సమయంలో లైటింగ్ చూడటం మాత్రమే కాదు, చాముండి హిల్స్ పై నుంచి సిటీని చూడడం అస్సలు మిస్ అవ్వకూడదు. కోల్ కతాలో పూజా పండాల్స్ లో లైట్ ఆర్ట్, థీమ్ ఆర్ట్ చూడాలి.
వారణాసిలో రామ్ లీలా జరిగే సమయంలో శ్రీరాముడు ధనస్సు ఎత్తి బాణం వదిలే సమయంలో భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. కులూలో దేవతామూర్తుల ఊరేగింపు అంతా ఒకేచోటికి చేరుకోవడం, తర్వాత జరిగే కార్యక్రమాలు వినూత్నంగా అనిపిస్తాయి. బస్తర్ లో రథాన్ని లాగే సమయంలో గిరిజన యువతుల ఆట పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి.
ఏం తినాలి?
మైసూరులో మైసూర్ పాక్, మసాలా దోసె, అక్కి రొట్టి ఎంజాయ్ చేయవచ్చు. కోల్ కతాలో భోగ్ ప్రసాదం, ఖిచురి, లాబ్రా, మిష్టి దోయ్ ట్రై చేయవచ్చు. వారణాసిలో కచోరీ సబ్జీ, మలైయ్యో, లస్సీ, సమోసా ట్రై చేయవచ్చు. కులూలో సిద్దు, ట్రౌట్ ఫిష్, యాపిల్ తో చేసే స్వీట్స్ ట్రై చేయవచ్చు. బస్తర్ లో చ΄్డా చట్నీ, బాంబూ చికెన్, మహువాతో చేసిన లోకల్ స్నాక్స్ ట్రై చేయవచ్చు.
యాత్ర, బడ్జెట్ వివరాలు
హైదరాబాద్ నుంచి ఐదు రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తే సరిపోతుంది. అన్ని ప్రదేశాలు వరుసగా కవర్ చేయడం కాస్త కష్టమే. కానీ అన్నీ కవర్ చేయాలనుకోకుండా ఒక ప్రదేశం సెలెక్ట్ చేసుకుని అక్కడే ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి.
ఏ ప్రదేశానికి వెళ్లినా బడ్జెట్ ట్రావెల్ కోసం మీరు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ బడ్జెట్ రూ.60 వేల నుంచి 75 వేలకు పెరుగుతుంది. ప్రీమియం ట్రిప్ ప్లాన్ చేస్తే మీ బడ్జెట్ లక్ష కూడా దాటుతుంది.
విజయదశమి సమయంలో ఎక్కడికి వెళ్లాలనుకున్నా ట్రైన్, ఫ్లైట్ టికెట్లు దొరకడం కష్టం. రైలు టికెట్లు బుక్ అవ్వవు, ఫ్లైట్ టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి.
స్టే విషయానికి వస్తే బడ్జెట్ రూమ్స్ రూ.900 నుంచి రూ.2500 వరకు, స్టాండర్డ్ రూమ్స్ రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు, ప్రీమియం రూమ్స్ రూ.8 వేల నుంచి 25 వేల మధ్యలో ఉంటాయి.
ఫుడ్ విషయానికి వస్తే ఒక్క వ్యక్తికి రోజూ రూ.500 నుంచి 3000 వరకు లేదా అంతకు మించి ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఇవి మిస్ అవ్వకండి..
ఎక్కడికి వెళ్లినా మనం చెక్ లిస్ట్ ప్రకారం ఒక్కో టాస్క్ ఫినిష్ చేస్తూ ముందుకు వెళ్లిపోతాం. కానీ లిస్ట్ లో లేని చిన్న చిన్న ఆనందాలను మిస్ అవ్వకూడదు. మైసూరులో అంబారీ వెనుక నడవడం ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది.
కోల్ కతాలో పూజా పండాల్స్ లో కాసేపు కూర్చుని అమ్మవారి వైభవాన్ని కీర్తించడం మిస్ అవ్వకూడదు. వారణాసిలో గంగా హారతిలో ఒక చిన్న దీపం వదిలి మనసులో ఉన్న కోరిక చెప్పడం మర్చిపోకండి.
కులూలో కొండల మధ్య సాగే ఊరేగింపులో డోలు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా నడవడం మిస్ అవ్వకూడదు. బస్తర్ లో దంతేశ్వరీ మాత రథాన్ని టచ్ చేసే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇవి చెక్ లిస్ట్ కావు, ఇవే ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేసే క్షణాలు.
ఆసక్తికరమైన విషయాలు
మైసూరు దసరాకి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, వడియార్ రాజుల కాలం నుంచి కొనసాగుతోంది.
కోల్‌కతా దుర్గా పూజ యునెస్కో కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తింపు పొందింది.
వారణాసి రామ్ లీలా సుమారు నెలపాటు జరిగే పెద్ద నాటకం.
కులూ దసరా విజయదశమి రోజు మొదలవుతుంది, అంటే మిగిలిన చోట్ల అయిపోయాక.
బస్తర్ దసరా దేశంలో 75 రోజులు జరుగుతుంది, ప్రపంచంలోనే అతిపెద్దది.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
ఇదీ చదవండి: గుమ్మడితో పండగ ముస్తాబు! దిష్టికే కాదు..అలంకరణకుకూడా..


