
అల్లుణ్ణీ, కూతుర్నీ చూసివద్దామని వెళ్ళినప్పుడు, ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి, తగిన మర్యాదలు చేయలేదని శంకరుడిపై కోపగించిన దక్షుడు, ప్రతీకారంగా శంకరుడిని అవమానించాలనే ఆలోచనతో ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి శంకరుడిని తప్ప సకల దేవతలనూ, మునిగణాలనూ పిలిచాడు. అది తెలుసుకున్న నారదుడువెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతితో, ‘అమ్మా, మీ తండ్రిగారికి ఏమైందో తెలి యడం లేదు. మీ ఇరువురనూ తప్ప మిగతా అందరినీ పిలిచి, అన్ని హంగు లతో యాగం చేస్తున్నాడు. వినడానికే నాకు బాగా అనిపించక, నీ చెవిన వేసి పోదామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్ళొస్తాను!’ అని చెప్పి, అగ్గి రాజేసి వెళ్ళిపోయాడు.
తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని పార్వతికి మనసులో కోరిక కలిగింది. అయితే, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎలాగ? కలత చెందిన మనస్సుతో, చెప్పాలా వద్దా అని సందేహిస్తూనే, విషయం శంకరుడి చెవిలో వేసింది. సతి మాటలలోని ఉద్దేశాన్ని గ్రహించిన శంకరుడు ఇలా సమాధానం చెప్పాడన్నాడు పోతన, తాను రచించిన ‘వీరభద్ర విజయం’ కావ్యం ప్రథమాశ్వాసంలో:
మెచ్చని మామలిండ్లకును మేకొని శోభనవేళ బిల్వమిన్
పొచ్చముగల్గుబో దగుట పోలదు నల్లుర కెజ్జగంబులం
బొచ్చెము లేదు కన్యలకు బుట్టినయిండ్లకు బోవ లోకము
న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీతలిదండ్రుల జూడ బైదలీ!‘
తనను ఇష్టపడని మామల ఇండ్లలో జరిగే శుభ కార్యాలకు, ఆహ్వానం లేకుండా వెళ్ళడం ఏ లోకంలోని అల్లుళ్ళకైనా మర్యాద కాదు. అయితే, ఆహ్వానం లేనప్పటికీ కన్యలకు తమ పుట్టినిండ్లకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. లోకం మెచ్చుకుంటుంది కూడా! అందు వలన, మీ తల్లిదండ్రులను చూడటానికి నీవు వెళ్ళు!’ అలా పార్వతి పుట్టినింటికి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. పుట్టినింట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, శివుడిని మనసులో తలుచుకుని శివయోగవహ్నిని మేలుకొలిపి, ఆ ఘోరాగ్నిలో తనను తాను భస్మం చేసుకుంది. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. కనుకనే, జరగబోయేది తెలిసిన శంకరుడు పార్వతిని ‘పోయిరమ్మని’ అనకుండా, కేవలం ‘పొమ్ము పబ్బమునకు’ అని మాత్రమే అన్నాడు. సర్వజ్ఞుల మాటలు భవిష్యత్తుకు దర్పణములుగా భాసిల్లుతాయి.
– భట్టు వెంకటరావు