ప్రమథ గణాలంటే శివపరివారం లేదా శివుని సేన. ప్రమథ అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులు. ప్రమధ గణాలు కోట్లకొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్రగణాలుగా ఉండి పోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు.

వీరిలో ముఖ్యులు
వీరభద్రుడు: సాక్షాత్ శివస్వరుపం. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.
ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపం లో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి.
నందీశ్వరుడు: శివునికి ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం!
భృంగి: శివుని పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని ఖ్యాతిగాంచాడు.
స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.
కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. క΄ాల హస్తుడు. కాశీ పురాధీశుడు.
రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.
బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన శ్రీ కృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.
చండీశుడు: ఒక గోప బాలుడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు. ఇలా శివగణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది.


