శివుడు శరభుడిగా ఎందుకు మారాడు? | Sharabheswara Narasimha Story Shiva Harihara Tattva | Sakshi
Sakshi News home page

శివుడు శరభుడిగా ఎందుకు మారాడు?

Aug 27 2026 8:25 AM | Updated on Aug 27 2026 8:26 AM

Sharabheswara Narasimha Story Shiva Harihara Tattva

భక్తి

అరుదైన శిల్పం

శివపురాణం ప్రకారం పరమశివుని అత్యంత ఉగ్రశక్తిమంతమైన అరుదైన రూపాలలో శరభేశ్వర రూపం ఒకటి. హిరణ్యకశిపుని వధించిన తరువాత శ్రీమహావిష్ణువు నరసింహావతారంలోని ఉగ్రత, క్రోధం తగ్గక పోవడంతో ఆ శక్తి లోకాలకే ముప్పుగా మారుతుందేమోనని దేవతలు భయపడి పరమశివుడిని ప్రార్థించారు. నరసింహుడి ఉగ్రత తగ్గించడానికై శివుడు ముందుగా తన అంశమైన వీరభద్రుడిని పంపాడు. 

అయినా నరసింహుని ఉగ్రతను శాంతింపజేయడం సాధ్యం కాలేదు అప్పుడు శివుడే స్వయంగా శరభ రూపాన్ని ధరించాడు. ఈ రూపంలో సింహస్వభావం పక్షిశక్తి, మానవాకృతి లక్షణాలు కలిసిపోయినాయి. విశాలమైన రెక్కలు, పదునైన గోర్లు, బలమైన కాళ్లు కలిగిన మహాశక్తిగా శరభేశ్వరుడు ఆవిర్భవించి నరసింహుని ఉగ్రతను అదుపు చేసి లోకాలలో శాంతిని నెలకొల్పాడు.

వైష్ణవం ప్రకారం నరసింహుడు శరభుని ఎదుర్కొనేందుకు రెండుతలల మహాబలశాలైన గండభేరుండ రూపాన్ని ధరించాడు. శరభుడు గండభేరుండ మధ్య జరిగిన భీకరపోరాటం తరువాత ఆదిపరాశక్తి జోక్యంతో ఉగ్రశక్తులు శాంతించాయి. ఈ గాథల అంతరార్థం శివుడు విష్ణువు మధ్య పోటీని చెప్పడం కాదు అపరిమితమైన ఉగ్రతకు శాంతి అవసరం. ఎంతటి శక్తికైనా నియంత్రణ అవసరమని, చివరికి సమానత్వమే లోకక్షేమానికి ఆధారమని తెలియజేయడమే ఈ గాధ లక్ష్యం. హరిహరతత్త్వం కూడా శివకేశవుల మధ్య భేదం లేదనే తత్త్వాన్ని బలపరుస్తుంది.

శరభేశ్వరుని రూపం దక్షిణ భారత దేవాలయ శిల్పకళలో విశేష స్థానం పొందింది. ముఖ్యంగా తమిళనాడులోని త్రిభువనంలోని కంపహరేశ్వర ఆలయంలో చోళులకాలం నాటి శరభశిల్పం బాగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలోని హోయసలుల దేవాలయ శిల్పాలలో కూడా శరభుడు వంటి ఉగ్ర జీవరూపాలు అద్భుతమైన కళానైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు పురాణకథలను మహిమను మాత్రమే కాకుండా ఆనాటి శిల్పుల అపూర్వ ప్రతిభననూ తెలియజేస్తాయి.

శరభేశ్వరుని గాథ భారతీయ సనాతన ధర్మంలోని శక్తి, ఉగ్రత, శాంతి, సమతుల్యత, హరిహర ఏకత్వం వంటి గొప్ప భావాలను తెలియజేసే అరుదైన పురాణ గాథగా నిలిచింది.
– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement