బాలికను వేధించిన పోకిరీలు
ప్రశ్నించిన యువకుడి దారుణహత్య
మంచిర్యాల క్రైం: బాలికను వేధించిన పోకిరీల (గంజాయి బ్యాచ్)ను ప్రశ్నించడం ఆ యువకుడి నేరమైంది. చంపేస్తామంటూ హెచ్చరించి మరీ పథకం ప్రకారం గొంతుకోసి హత్య చేశారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సోకులతండా గ్రామానికి చెందిన బానోతు లక్పతి అలియాస్ చిన్న (29) రెండు నెలల క్రితం మంచిర్యాలకు వలస వచ్చాడు.
అండాళమ్మకాలనీలో నివాసం ఉంటూ బెల్టు షాపు నిర్వహిస్తున్న బత్తుల పద్మ (55) దగ్గరి బంధువు కావడంతో ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పద్మ భర్త బాపురావు గతంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పద్మ మనవరాలిని (13) (కూతురు బిడ్డ) అండాళమ్మకాలనీకి చెందిన వెంబడి వెంకటేశ్ (బన్నీ)తోపాటు మరికొందరు పోకిరీలు వేధించారు. ఈ నెల 24న లక్పతి వారిని మందలించడంతో గొడవకు దారితీసింది.
అదృశ్యం కేసు నమోదు..
లక్పతి బుధవారం కనిపించకుండా పోవడంతో పద్మ అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ బ్యాచ్ లక్పతిని చంపేస్తామంటూ బెదిరించారు. అదే రోజు రాత్రి పద్మ బెల్ట్‌షాపు లోనే వారు మద్యం కొనుగోలు చేసి తాగారు. బన్నీ స్నేహితుడు వినోద్ లక్పతిని తీసుకెళ్లాడని తెలుసుకున్న పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా రాత్రి 11గంటలకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పథకం ప్రకారమే హత్య..
పథకం ప్రకారం బన్నీ స్నేహితుడు ఆలకుంట వినోద్ బుధవారం లక్పతిని ఇంటి నుంచి అండాళమ్మకాలనీ గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. బన్నీతోపాటు నరసింహ అనే వ్యక్తి మరికొందరు అక్కడికి చేరుకుని లక్పతిని హత్య చేశారు. గురువారం కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా లక్పతి మృతదేహం కనిపించింది. పదునైన కత్తితో గొంతుకోసిన ఆనవాళ్లు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు పరిశీలించారు. పద్మ ఫిర్యాదు మేరకు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


