ఫండే
భక్త విజయం
పూర్వం దుర్గముడు అనే అసురుడు ఉండేవాడు. అతడు హిరణ్యాక్షుడి వంశంలో రురుడు అనేవాడికి పుట్టాడు. దుర్గముడు పరమ క్రూరుడు. దేవతల బలమంతా వేదాలలో ఉంటుంది. దేవతలను అణచాలంటే, ముందుగా వేదాలను నాశనం చేయాలని తలచి, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. ఏళ్ల తరబడి ఘోరమైన తపస్సు కొనసాగించాక ఒకనాడు బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు.
‘బ్రహ్మదేవా! వేదాలను, ముల్లోకాలలో ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలను నాకు స్వాధీనం చెయ్యాలి. దేవతలను జయించాలనే బలం ఇవ్వాలి’ అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.
అప్పటి నుంచి బ్రాహ్మణులకు వేదాలు దూరమయ్యాయి. వారికి మంత్రాలు స్ఫురణకు రావడం మానేశాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. దేవతలకు హవిర్భాగాలు అందక నీరసించిపోయారు. ఇదే అదనుగా తలచి, దుర్గముడు స్వర్గంపై దండెత్తాడు. అతడి ధాటికి దేవతలు పలాయనం చిత్తగించి, అడవుల్లో తలదాచుకున్నారు. దుర్గముడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. హోమాలు జరగక వర్షాలు నిలిచిపోయాయి. భూలోకమంతా కరవు కాటకాలతో అల్లాడసాగింది. దిక్కుతోచని పరిస్థితిలో అడవుల పాలైన దేవతలందరూ జగన్మాత ఆరాధన ప్రారంభించారు. మరోవైపు, బ్రాహ్మణులందరూ కూడబలుక్కుని, హిమాలయాలకు వెళ్లి, జగన్మాత అర్చనను ప్రారంభించారు.
బ్రాహ్మణుల శ్రద్ధాభక్తులకు సంతృప్తి చెందిన జగన్మాత వారి ముందు ప్రత్యక్షమైంది. ఆమె చేతులలో కాయగూరలు, పండ్లు ఉన్నాయి. అమ్మవారి దయానయనాల నుంచి ధారలుగా వర్షం కురిసింది. లోకాలు హర్షించాయి. నదీ నదాలు, వాపీ కూప తటాకాలు నీటితో నిండాయి. అడవుల్లో కొండకోనల్లో దాక్కున్న దేవతలందరూ బిలబిలమంటూ వచ్చి, అక్కడకు చేరుకుని, బ్రాహ్మణులతో గొంతు కలిపి జగన్మాతను స్తుతించారు. దుర్గమాసురుడి నుంచి వేదాలను తెచ్చి, రక్షించమని ప్రార్థించారు.
జగన్మాత ప్రసన్నురాలైంది. తన చేతుల్లో ఉన్న కూరగాయలను, పండ్లను అందరికీ పంచిపెట్టింది. పశుపక్ష్యాదులకు కూడా కావలసిన ఆహారాన్ని అందించింది. దేవతలు, విప్రులు జగన్మాతను ‘శాకంబరీ’ అంటూ స్తుతించారు. సురనరాదులు సహా ప్రాణికోటి కోలాహలం దుర్గమాసురుడికి వినిపించింది. బయట ఏం జరుగుతోందో కనుక్కోమని తన భటులను పంపాడు. వారు తిరిగి వచ్చి, తాము చూసినదంతా చెప్పారు.
అడవుల్లో దాక్కున్న దేవతలు బయటకు వచ్చి, కోలాహలం చేస్తున్నారని తెలుసుకోగానే దుర్గముడిలో ఆగ్రహం పెల్లుబికింది. వెంటనే ఆయుధాలను అందుకుని, సైన్యాన్ని వెంటపెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు.
దైవసైన్యం దుర్గముడి రాక్షససేనను ఎదిరించింది. దేవతలకు, రాక్షసులకు హోరాహోరీ పోరు మొదలైంది. దేవతలకు తోడుగా విప్రసమూహం కూడా యథాశక్తి యుద్ధంలో పాల్గొంది. రాక్షస సేనల ధాటికి దేవ మానవ సమూహాలు తాళలేకపోయాయి. ‘త్రాహి త్రాహి’ అంటూ వారంతా జగన్మాత వద్దకు పరుగులు తీశారు. జగన్మాత వారి చుట్టూ తేజోమయ రక్షణ వలయాన్ని కల్పించింది. తానే స్వయంగా ఆయుధాలు పూని రణరంగానికి చేరుకుంది.
దుర్గముడు తన రథాన్ని నేరుగా జగన్మాత రథానికి ఎదురుగా నిలిపి శర పరంపర గుప్పించాడు. జగన్మాత వాటిని తన బాణాలతో తిప్పి కొట్టింది. వారి ద్వంద్వ యుద్ధం తారస్థాయికి చేరుకుంది. జగన్మాత శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి రూపాలు ఆవిర్భవించాయి. బాల, త్రిపుర, భైరవి, తార, బగళ– ఇలా ఉద్భవించిన అనంత శక్తులు ఆయుధాలు ధరించి, రాక్షససేనపై విరుచుకుపడ్డాయి. రెప్పపాటులోనే రాక్షససేనను తుదముట్టించాయి.
తనతో పోరు సాగిస్తున్న దుర్గముడిపైకి జగన్మాత ఒకేసారి పదిహేను బాణాలను గుప్పించింది. దుర్గముడు నాలుగే నాలుగు బాణాలు ప్రయోగించి, వాటిని ఖండించాడు. జగన్మాత ఉగ్రురాలైంది. ఈసారి నాలుగు బాణాలను ప్రయోగించింది. వాటిలో రెండు బాణాలు దుర్గముడి కన్నులను పొడిచాయి. మరో రెండు అతడి చేతులను ఖండించాయి. జగన్మాత మరో ఐదు బాణాలను ప్రయోగించి, దుర్గముడి గుండెలను చీల్చివేసింది. అతడు హాహాకారాలు చేస్తూ నేలకొరిగాడు. దుర్గముడి మరణంతో ముల్లోకాలూ శాంతించాయి. విప్రులు, దేవతలు జగన్మాతను కీర్తిస్తూ స్తోత్రగానం చేశారు. దుర్గముడి నుంచి తనలోకి తేజోరూపంలో ప్రవేశించిన వేదాలను జగన్మాత తిరిగి విప్రులకు అందించింది. ‘నన్ను నిత్యం పూజించండి’ అని పలికి అంతర్థానమైంది.
- సాంఖ్యాయన
పురావిశేషం..
అమ్మవారి ఆలయాల్లో రకరకాల నైవేద్యాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. వీటిలో ఎక్కువగా కదంబం, పులిహోర, గుడాన్నం, దధ్యోదనం వంటివి ఉంటాయి. మహారాష్ట్రలోని మాహుర్లో ఉన్న రేణుకాదేవి శక్తిపీఠంలో మాత్రం మిగిన శక్తిపీఠాలకు భిన్నంగా ‘విడతాంబూల’ నైవేద్యాన్ని సమర్పిస్తారు. దీనినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. తమలపాకులు, గుల్కంద్, సోంపు గింజలు, ఏలకులు, లవంగాలు కాచు, సున్నం, నువ్వులు, కొబ్బరికోరు వంటివి నూరి, తమలపాకుల మధ్యపెట్టి ఇస్తారు. రేణుకాదేవి ఒకనాడు విష్ణుమూర్తికి కలలో కనిపించి, తనకు ‘విడతాంబూల’ నైవేద్యం సమర్పించమని అడిగిందట! అప్పటి నుంచి ఇదే నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా మారిందని స్థలపురాణ కథనం.
ఇదీ చదవండి: మండపం ముందు శివతాండవం!


