మరుత్తుడు ఎందుకు సర్పాలన్నింటినీ సంహరించాడు? | Marutta Naga Samharam Hindu Mythology Gaya Temple | Sakshi
Sakshi News home page

మరుత్తుడు ఎందుకు సర్పాలన్నింటినీ సంహరించాడు?

Oct 4 2026 9:04 AM | Updated on Oct 4 2026 9:04 AM

Marutta Naga Samharam Hindu Mythology Gaya Temple

ఫండే

భక్త విజయం

కరంధముని కొడుకైన అవీక్షిత్తు వైశాలిని పెళ్లాడాడు. అవీక్షిత్తు, వైశాలి దంపతులకు మరుత్తు జన్మించాడు. పౌత్రుడైన మరుత్తుని చూసి కరంధముడు, ఆయన భార్య వీర పరమానందం చెందారు.

మరుత్తు దినదిన ప్రవర్ధమానంగా ఎదగసాగాడు. అవీక్షిత్తు దంపతులు కుమారుడికి బాల్యంలో జరిపించ వలసిన సంస్కారాలన్నీ శాస్త్రోక్తంగా జరిపించారు. అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి అవీక్షిత్తు కుమారుడిని పరశురాముడి గురుకులానికి పంపాడు. మరుత్తు శ్రద్ధగా సుశ్రూషలు చేస్తూ, పరశురాముడి వద్ద అస్త్ర విద్యలు నేర్చుకుని, ధనుర్వేదంలో ఆరితేరాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువు వద్ద సెలవు తీసుకుని, ఇంటికి వచ్చాడు.

సమర్థుడై తిరిగి వచ్చిన మరుత్తుడికి కరంధముడు పట్టాభిషేకం చేసి, రాజ్యభారాన్ని అప్పగించాడు. తర్వాత తాను భార్యా సమేతంగా తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళ్లిపోయాడు.
మరుత్తుడు రాజ్యాభిషేకం జరిగిన నాటి నుంచి ధర్మబద్ధంగా పరిపాలన సాగించసాగాడు. అసంఖ్యాకంగా యజ్ఞ యాగాదులు జరిపిస్తూ, ముల్లోకాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు. లోకసంచారం చేస్తుండగా, ఒకనాడు మరుత్తునికి మంజువ అనే బంగారు పర్వతం కనిపించింది. మరుత్తు ఆ పర్వతం నుంచి బంగారాన్ని తీసుకొచ్చి, దేవ బ్రాహ్మణ కార్యాలకు, ధర్మ కార్యాలకు, దీనులను ఆదుకోవడానికి ఉపయోగించసాగాడు. మరుత్తు పరిపాలనలో రాజ్యం సర్వసుభిక్షంగా తులతూగసాగింది.

రోజులిలా సాగుతుండగా, ఒకనాడు మరుత్తుడి వద్దకు ఒక మహర్షి వచ్చాడు. ‘రాజా! నీ పాలనలో ఎక్కడా దరిద్రులు లేరు గాని, నాగలోకం నుంచి భూలోకానికి వచ్చిన సర్పాలు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉత్పాతం సృష్టిస్తున్నాయి. సర్పాలు నిష్కారణంగా కాటు వేయడం వల్ల ఎనిమిదిమంది మహర్షులు ప్రాణాలు వదిలారు. ఈ సర్పాలు జలాశయాలను, ఫలపుష్పాదులను సైతం విషపూరితం చేస్తున్నాయి. రాజు చేసిన అధర్మం ప్రజలకు, ప్రజలు చేసిన పాపాలు రాజుకు చెందుతాయి. తక్షణ కర్తవ్యమేమిటో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు’ అని చెప్పి, ఆ మహర్షి వెళ్లిపోయాడు.

మహర్షి మాటలు విన్న మరుత్తుడు నేరుగా భార్గవాశ్రమానికి వెళ్లాడు. అక్కడి నుంచి సకల సర్పసంహారక సంవర్తాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వెలువడి, నాగలోకంలోని సర్పాలన్నింటినీ భస్మీపటలం చేయసాగింది. నాగలోకంలో జరుగుతున్న ఈ ప్రళయోత్పాతానికి భీతిల్లిన నాగకన్యలు పరుగు పరుగున మరుత్తుడి తల్లి అయిన వైశాలి వద్దకు వెళ్లారు.

‘అమ్మా! నువ్వు ఇదివరకు మాకు ఇచ్చిన వరం ప్రకారం నాగకులాన్ని నువ్వే రక్షించాలి’ అని ప్రార్థించారు.
వైశాలి నాగకన్యలకు అభయమిచ్చి, భర్త అవీక్షిత్తుతో కలసి కొడుకు వద్దకు వచ్చింది. 
‘కుమారా! అయినదేదో అయింది. ఇక సర్పసంహారాన్ని విరమించుకో’ అని చెప్పింది.
‘ఈ సర్పాలు అమాయకులైన ఎనిమిదిమంది మహర్షుల ప్రాణాలను బలిగొన్నాయి. అంతటితో ఆగక జలాశయాలను, ఫలపుష్పాలను విషపూరితం చేస్తున్నాయి. దుర్మార్గులైన ఈ సర్పాలను సంహరించడం రాజుగా నా ధర్మం. నేను రాజధర్మాన్ని నెరవేరుస్తున్నాను’ అని పలికాడు మరుత్తుడు.

అతడి మాటలు విన్న నాగకన్యలు ‘మహాత్మా! శరణు శరణు! నేటి నుంచి మానవులకు అన్యాయంగా కీడు చేయబోమని వాగ్దానం చేస్తున్నాం. అలాగే, మా జాతివారి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న ఎనిమిదిమంది మహర్షులను పునరుజ్జీవితులు కావిస్తాం. దయచేసి ఇప్పటికైనా సర్పసంహారాన్ని విరమించుకో!’ అని మొరపెట్టుకున్నారు.

నాగుల వల్ల ప్రాణాలు కోల్పోయిన మహర్షులను నాగకన్యలు తక్షణమే బతికించాయి. మృతులైన మహర్షులు పునర్జీవితులు కావడం చూసి, మునిగణమంతా సంతోషించారు. వారు కూడా మరుత్తుడిని శాంతించమని నచ్చచెప్పారు. మహర్షులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరుత్తుడు సంవర్తకాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటితో నాగవంశం అంతరించిపోకుండా బతికి బట్టకట్టింది. మరుత్తుడి ఔదార్యానికి దేవతలు, మునులు సంతోషించారు. కుమారుడి రాజ్యపాలన సామర్థ్యానికి అవీక్షిత్తు, వైశాలి సంతోషించారు. తిరిగి తపస్సు చేసుకోవడానికి వారు వనాలకు వెళ్లిపోయారు.
- సాంఖ్యాయన

పురావిశేషం..
మనదేశంలోని పురాతన పుణ్యక్షేత్రాల్లో గయ పితృకార్యాలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ పితృకార్యాలు నిర్వహిస్తే, పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని చాలామంది నమ్మకం. గయ క్షేత్రంలోని శ్రీవిష్ణుపాద ఆలయానికి చేరువలో ఉన్న ఫల్గు నదీతీరంలోను, ఇక్కడి పురాతన అక్షయ వటవృక్షం కింద ఎక్కువగా పిండ ప్రదానాలు చేస్తుంటారు. గయ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రేతశిల కొండ గురించి ఎక్కువమందికి తెలియదు. ఇక్కడ కూడా పితృకార్యాలు నిర్వహిస్తారు. ప్రేతశిల కొండ మీద పిండప్రదానం చేసినట్లయితే, పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు. ఈ కొండ మీద అత్యంత అరుదైన యమధర్మరాజు ఆలయం ఉంది.

ఇదీ చదవండి: ప్రసంగం.. దేవుని వరమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement