దైవోక్తులతో నిండి ఉండేలా ప్రసంగం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనుష్యుల మెప్పు, వారి వినోదం కొరకు కాకుండా, దేవుణ్ణి సంతోషపెట్టేలా ప్రసంగాలు చేయాలి. ప్రసంగం దేవుని వరం.
ప్రసంగం చేయుట ఒక కళ లేదా ఒక శాస్త్రంగానే చూడాలి తప్ప దాన్ని ఏనాడూ నిర్లక్ష్యం చేయరాదు. ప్రసంగ కళాశాస్త్రం ఉనికి, దాని విలువైన మూలాలు పంచ కాండములు అనబడే ధర్మశాస్త్ర గ్రంథములో నిధిలా నిక్షిప్తమై ఉన్నాయి. ఎన్నడూ మరువలేని అత్యుత్తమ ప్రసంగానికి మూడు దశలే బహు కీలకం. పరిచయం,ముఖ్యాంశం, ముగింపు అను ఈ మూడు సృజనాత్మక చట్రాలలోనే ప్రసంగాంశం ఉన్నతంగా ఇమిడ్చి చెప్పాల్సి ఉంటుంది.
ఆదికాండం అనేకానేక పరిచయాలకు, ప్రారంభ ఆరంభాలకు నెలవు. ప్రసంగ శాస్త్రం ప్రకారంగా చూస్తే ఆదికాండము పరిచయం అనే దాన్ని సూచిస్తుంది. ధర్మ శాస్త్రం అనగా నిర్గమ, లేవీ, సంఖ్యా కాండములే. ఇందులోనే ప్రధానమైన పది ఆజ్ఞలు, అనేకానేక ఇతర ఆజ్ఞలు, ముఖ్యమైన విధులు, విధానాలు, బాధ్యతలు ఉన్నాయి.
ప్రసంగ శాస్త్ర ప్రకారంగా చూస్తే నిర్గమ లేవీ సంఖ్యా కాండములు ముఖ్య సమాచారంగా, ముఖ్య సందేశంగా ఉన్నాయి. ఇక ద్వితీయోపదేశ కాండము ముగింపును సూచిస్తుంది. రెండవ మారు ఉపదేశం చేయడం అంటే మరెన్నో జాగ్రత్తలు తీసుకొని హెచ్చరిస్తూ చెప్పడం. ధర్మశాస్త్రానికి బద్ధులై ఆచరించేలా, బుద్ధి బోధ కలిగేలా, దేవుని యెడల వారి పితరుల తిరుగుబాటు ఫలితాలను కళ్ళకు కట్టినట్టుగా వారి పిల్లలకు వివరించడం.
ముఖ్యంశాలు మరోసారి అంటూ విషయసారం మొత్తం పదే పదే గుర్తుచేస్తూ శ్రోతలలో బాగా నాటుకుపోయేలా చెప్పుటే ద్వితీయోపదేశ కాండము. ధర్మశాస్త్రపు అయిదు గ్రంథాలలో ప్రసంగం శాస్త్రం అందు నిండుగా ఒదిగి అమర్చబడిన తీరు ఆశ్చర్యకరం. ఏదో యాదృచ్చికంగా, యాంత్రికంగా కాక గొప్ప సదుద్దేశపూర్వకంగానే ప్రసంగ శాస్త్రాన్ని దేవుడు తన ధర్మశాస్త్రంలో ఉంచాడనేది ధర్మశాస్త్ర జ్ఞానులు, పండితుల సమాలోచన ఏకాభిప్రాయం.
– జేతమ్
ఇదీ చదవండి: నోబెల్ ప్రైజ్.. రచయితల మధ్య మరో యుద్ధమా?!


