
హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ (2018) ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మరో సినిమా ΄పౌరాణికం నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీ తాజా అప్‌డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్‌గారు మా బ్యానర్‌లో తొలిసారి ΄పౌరాణికం నేపథ్యంలో తీయనున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం.
నందమూరి తారక రామారావుగారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్‌ని దేవుడిగా చూపించబోతున్నామనే ఆనందం ఉంది. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ‘రామాయణ’(రణ్‌బీర్ కపూర్) చిత్రం గ్లింమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. దీంతో మేం చేయబోయే చిత్రం గురించి ‘రామాయణ’ కి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకుని ప్రకటిద్దామని ఆగాం. ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్‌గార్ల చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.