అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గౌరవంపై స్టార్ హీరో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని, ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం బెంగళూరు వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళల గౌరవంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది.
దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారం ఉండాలని అన్నారు. ‘నా ఇద్దరు కొడుకులను (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను’ అని ఆయన పేర్కొన్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయడం పట్ల నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘డ్రాగన్’ లుక్ వైరల్
కాగా, ఎన్టీఆర్ బెంగళూరుకు వస్తున్నాడని తెలిసి.. స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.వారిని అభివాదం చేయడానికి ఎన్టీఆర్ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు. గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు.ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న డ్రాగాన్(వర్కింగ్ టైటిల్) సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ లుక్‌లోకి మారాడు. ఇన్నాళ్లు తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్న తారక్..ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది.


