 
															నటనా కౌశలం
													 
										
					
					
					
																							
											
						 నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం వివిధ నాటక సమాజాల కళాకారులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు.
						 
										
					
					
																
	- అలరించిన పద్యనాటకాలు
	- ఆసక్తికరంగా సాగిన నందినాటకోత్సవాలు
	కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం వివిధ నాటక సమాజాల కళాకారులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. రైతు కళా నిలయం పత్తికొండ కళాకారులు ప్రదర్శించిన సీతారామ కల్యాణం అలరించింది. కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన కృష్ణభీమ సేన, సాయి కళాస్రవంతి రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణసత్య పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 
	రాముని పరాక్రమ విశిష్టత..
	సీతారామ కల్యాణం నాటకం.. రామాయణ ప్రాధాన్యతను, రాముని పరాక్రమ విశిష్టతను చాటి చెప్పింది.  సీతా స్వయం వరానికి వెళ్లి శివధనస్సును ఎత్తలేక రావణుడు గర్వభంగానికి గురై వెనుదిరుగుతాడు. రాముడు శివధనుస్సును ఎత్తి సీతను పరిణయమాడటమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. వేదాల వెంకటప్పలాచార్య రచించిన ఈ నాటకానికి పీవీ జనార్దనరెడ్డి దర్శకత్వం వహించారు. 
	 
	భారత గాథలోని ఇతివృత్తం..
	 కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణభీమసేనం పద్య నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.  ఈ నాటకంలో శ్రీకృష్ణునికి, భీమసేనునికి మధ్య ఉన్న ఆత్మీయ అనుబం«ధాన్ని చాటిచెప్పారు. పల్లేటి లక్ష్మి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పీవీ రెడ్డి దర్శకత్వం వహించారు. 
	 
	దృశ్యకావ్యం శ్రీకృష్ణసత్య  
	శ్రీసాయి కళా స్రవంతి రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణసత్య నాటకం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపింది. యుద్ధరంగంలో సత్యభామ పతిప్రాణ సంరక్షణకు విల్లంబులు చేతబూని విజృంభిస్తుంది. తన తల్లి చేతిలో తప్ప అన్యుల చేతిలో తనకు మరణం లేదని గ్రహించిన నరకాసురుడు సత్యభామనే తల్లిగా గుర్తించి తన తప్పులు క్షమింపమని ఆమె పాదముల చెంత మరణిస్తాడు. ఈ ఇతివృత్తాన్ని అత్యంత హృద్యంగా చిత్రించిన శ్రీకృష్ణ సత్య నాటకం ప్రేక్షకులను అలరించింది. సీవీ రామారావు రచించిన ఈ నాటకానికి ఏ.నాగభూషణం దర్శకత్వం వహించారు. 
	 
 
					
					
					
						