
పౌరాణిక జిజ్ఞాస
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.
వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరిసోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.
ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!
ఈ క్షణమే సచ్చిదానందం
నీవు ‘ఈ క్షణం’లో ఉన్నప్పుడు కాలం, ప్రదేశం అనేవే ఉండవు. అవి లేనప్పుడు దుఃఖం కూడా ఉండదు. ఈ క్షణంలో ఉన్నపుడు నీవే దైవం. అదే అత్మసాక్షాత్కార స్థితి. సచ్చిదానంద స్థితిలో ఉంటావు. నీవే దైవమైనప్పుడు నీ గురించి ఎవరేమి అనుకున్నా నీకు చెందదు కదా! అసలు వ్యక్తి అనేదే మనస్సు కల్పితం. ఈ క్షణంలో మనస్సు–శరీరం అనేవే ఉండవు. శరీరం–మనస్సు అనేవి కాలం–ప్రదేశము అనేవాటితో కలిసే ఉంటాయి. శరీరం ప్రదేశానికి సంబంధించినదైతే, మనస్సు కాలానికి సంబంధించినది. నీవు ఈ దేశకాలాలకు అతీతమైన స్థితిలో ఉండాలి ఎల్లప్పుడూ. అంటే అతి సూక్ష్మమైన ‘ఈ క్షణం’లో ఉండాలి. అంటే ఆత్మతో ఉండాలి. ఆ స్థితిలో నీవు అనంతుడివి. పుట్టుకలేదు, చావుకూడా లేదు. కేవలం ఒక శుద్ధ చైతన్యానివి. వ్యక్తివి కావు.ఈ స్థితిలో నీవు విశ్వచైతన్యంతో నేరుగా అనుసంధానమై ఉంటావు. పరమానందంలో ఉంటావు. ఈ క్షణంలో నీవు ఆత్మవు. ఈ క్షణం నుండి మళ్ళితే శరీరమే నేను, మనస్సు నేను అనే భ్రమలో ఉంటావు. అదే దుఃఖానికి మూలం. అందుకే దైవం ఆనందస్వరూపం అంటారు. నిర్గుణం, నిరాకారం, నశ్వరం, సర్వవ్యాపితం, ఆద్యంత రహితం అంటారే, దానికి కారణం ఇదే. మరి నీవు దైవం కావాలంటే ఈ క్షణంలో కదా ఉండాలి! ఆత్మస్థితిలో కదా ఉండాలి! నశించి΄ోయే భౌతిక ప్రపంచంలో దైవాన్ని వెదికితే దానికి అతీతమైన దైవత్వాన్ని ఎలా పొందగలవు? మనస్సుకు అతీతంగా ఎదుగు. దైవత్వాన్ని చేరకుండా అడ్డుపడుతున్నది ఈ మనస్సే. నీ శక్తులన్నింటినీ నీ మూలం వైపుకు మళ్ళించు.
-స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు