పసిడి పతకాలే లక్ష్యం! | Satvika Wins Gold Medal In CBSE National Athletics Championship | Sakshi
Sakshi News home page

పసిడి పతకాలే లక్ష్యం!

Nov 4 2026 3:24 AM | Updated on Nov 4 2026 3:24 AM

Satvika Wins Gold Medal In CBSE National Athletics Championship

ఆడిపాడే వయసే.. కానీ ఆశయం ఆకాశమంతది. అందుకే ఏడాది శిక్షణతోటే జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించి అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది. 600 మీటర్ల పరుగు పందెంలో సుమారు వందమంది ప్రత్యర్థులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది సూర్యాపేటకు చెందిన సాత్విక. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించడమే తన లక్ష్యమని చెబుతోంది ఈ చిచ్చరపిడుగు. 

బుంగపట్ల సాత్వికది నల్లగొండ జిల్లా సూర్యాపేట. అక్కడే స్థానికంగా ఉన్న సీబీఎస్‌ఈ ప్రైవేటు స్కూల్లో ఆరోతరగతి చదువుతోంది. చదువులోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచే సాత్వికకు చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఆసక్తి. ఈ విషయాన్ని గమనించిన.. అదే స్కూల్లో పనిచేసే కోచ్‌ హనుమంతరావు సాత్వికను ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేశాడు. ఏడాదిపాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ట్రైనింగ్‌ ఇచ్చి ఆమె ప్రతిభకు మెరుగు లు దిద్దాడు. అలా ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీబీఎస్‌ఈ పాఠశాలల హైదరాబాద్‌–విజయవాడ క్లస్టర్‌ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని సాత్విక ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయం సాత్వికను సీబీఎస్‌ఈ స్కూళ్ల జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ 2026 మీట్‌కు ఎంపికయ్యేలా చేసింది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణను తీసుకుని.. అక్టోబర్‌ 18న పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంది. అండర్‌–14 బాలికల విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తరఫున బరిలోకి దిగింది. 142 సెకన్లలో 600 మీటర్లు పరుగును పూర్తిచేసి తన సత్తా చాటింది. బంగారు పతకాన్ని సాధించింది. ఈ అథ్లెటిక్స్‌ లో సీబీఎస్‌ఈ పాఠశాలల జాతీయ, అంతర్జాతీయ క్లస్టర్లనుంచి సుమారు వంద మంది వరకు పోటీ పడగా, అందరిలోనూ సాత్విక ఒక్కతే విజేతగా నిలిచింది. 

ఒలంపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యం
ప్రస్తుతం అండర్‌ 14 విభాగంలో ఆల్‌ ఇండియా స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు సిద్ధమవుతున్న సాత్విక.. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి గోల్డ్‌ మెడల్‌ తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతోంది. 
– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement