పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు! | Biofuels as an Alternative to Petrol and Diesel Major Benefits for Farmers Says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు!

Nov 24 2026 1:53 PM | Updated on Nov 24 2026 2:06 PM

Biofuels as an Alternative to Petrol and Diesel Major Benefits for Farmers Says Nitin Gadkari

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో బయోగ్యాస్ అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) విస్తరణపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు.

40 శాతం వాయుకాలుష్యం
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలు 40 శాతం వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ నగరంలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని ఉదాహరణగా వెల్లడించారు. ఈ సమస్యను తగ్గించడానికి బయోఫ్యూయల్స్, బయోగ్యాస్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు.

రైతులు కేవలం ఆహార ధాన్యాలను పండించేవారిగా మాత్రమే కాకుండా.. దేశానికి అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసేవారిగా కూడా ఎదగాలని గడ్కరీ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యర్థాల నుంచి ఇథనాల్, విమాన ఇంధనం, బిటుమెన్, హైడ్రోజన్, ఐసోబ్యూటనాల్ వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలిపారు.

దిగుమతుల కోసం రూ.22 లక్షల కోట్లు
ప్రస్తుతం భారతదేశం ఇంధన దిగుమతుల కోసం ఏటా సుమారు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉత్పత్తి చేస్తే దిగుమతుల భారం తగ్గడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని వివరించారు.

వరి గడ్డి, గోధుమ గడ్డి, పత్తి వ్యర్థాలు, చెరకు పిప్పి, ప్రెస్‌మడ్, స్పెంట్ వాష్ వంటి వాటిని బయో ఇంధనాల తయారీకి ఉపయోగించవచ్చని తెలిపారు. ప్రభుత్వం గోబర్ధన్ పథకం ద్వారా ఈ రంగంలో పరిశ్రమలు స్థాపించేవారికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. ఈ ప్లాంట్ల నుంచి ఇంధనంతో పాటు ద్రవరూప సేంద్రియ ఎరువులు కూడా లభిస్తాయని, వాటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

రోజుకు 16 టన్నుల సీబీజీ
నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సేంద్రియ చెత్త నుంచి సీబీజీ తయారు చేసే ప్రాజెక్టును ప్రారంభించిందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ రోజుకు 16 టన్నుల సీబీజీ ఉత్పత్తి చేస్తోందని, సామర్థ్యాన్ని రోజుకు 36 టన్నులకు పెంచితే దేశంలోనే అతిపెద్ద వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రాజెక్టుగా నిలుస్తుందని వివరించారు.

మరోవైపు మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ ప్రారంభమైన తర్వాత మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.1,200 నుంచి రూ.2,600కు పెరిగిందని, దీని వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్ రైతులకు సుమారు రూ.45,000 కోట్ల ఆదాయం లభించిందని ఉదాహరణగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement