ఈ–పంట నమోదులో రైతుల అగచాట్లు కథనంపై వ్యవసాయ శాఖ వివరణ
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో భాగంగా రైతుల ఈ–కేవైసీ 28 శాతమే పూర్తయిందని వ్యవసాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు జి.బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. ‘ఈ–పంట నమోదులో రైతుల అగచాట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై శనివారం ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల భూమి విస్తీర్ణపు నమోదులకు గాను 2.70 కోట్ల నమోదులు (98 శాతం) పూర్తయ్యాయని చెప్పారు.
అయితే 88,03,057 మంది రైతులకు గాను ఇప్పటివరకు 24,25,455 మందికే ఈ–కేవైసీ పూర్తయిందని, ఇది 28 శాతమేనని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగిస్తున్నామన్నారు. అప్‌లోడ్ చేసిన ఫొటోలను కృత్రిమ మేధతో పరిశీలించి 98 శాతం ఖచ్చితత్వం సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు.


