చౌక ఇళ్లకు అర్థం మారనుందా? | Affordable Housing Policy 2026 CREDAI Removal Rs 45 Lakh Price Cap | Sakshi
Sakshi News home page

చౌక ఇళ్లకు అర్థం మారనుందా?

Oct 4 2026 5:28 AM | Updated on Oct 4 2026 5:37 AM

Affordable Housing Policy 2026 CREDAI Removal Rs 45 Lakh Price Cap

దేశంలో చౌక (అఫర్డబుల్‌) గృహ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో రాబోయే ఆరు నెలల్లో మార్పులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చౌక  ఇళ్ల గుర్తింపునకు ప్రస్తుతం ఉన్న రూ.45 లక్షల ధర పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని కోరుతోంది. నగరాల్లో భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలు అందుబాటులో ఉండే ఇళ్ల నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మెట్రోల్లో 60, ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్లు

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల వరకు, ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్ల వరకు కార్పెట్ ఏరియా ఉన్న ఇళ్లకు గరిష్ఠంగా రూ.45 లక్షల ధర పరిమితి వర్తిస్తుంది. ఈ పరిమితి కారణంగా అధిక భూమి ధరలు ఉన్న నగరాల్లో ఇళ్లను సరసమైన గృహాల కేటగిరీలోకి తీసుకురావడం కష్టమవుతోందని క్రెడాయ్ చెబుతోంది. అందువల్ల ధరతో సంబంధం లేకుండా, ఇంటి విస్తీర్ణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతోంది. అయితే, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ పటేల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతిపాదిత విధానంపై గృహ నిర్మాణ శాఖ, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌తో చర్చలు జరుగుతున్నాయి. భూమి లభ్యత, నిర్మాణ సామగ్రి ధరలు, పన్నులు, అనుమతుల ప్రక్రియలో జాప్యం వంటి సమస్యలను కూడా పరిష్కరించాలని డెవలపర్లు కోరుతున్నారు. ఈ అడ్డంకులు తొలగితే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారికి అందుబాటులో ఉండే ఇళ్ల నిర్మాణం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

తగ్గుతున్న అఫర్డబుల్‌ ఇళ్ల వాటా

దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ రంగం విస్తరిస్తున్నప్పటికీ, సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల సరఫరా ఆశించిన స్థాయిలో లేదని క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం నివాస గృహాల అమ్మకాల్లో సరసమైన ఇళ్ల వాటా గణనీయంగా తగ్గిందని పేర్కొంది. పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, పన్నుల భారం కారణంగా డెవలపర్లు ఈ విభాగంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వెనుకాడుతున్నారని తెలిపింది.

ఇక్కడ విధానపరమైన మార్పులు కీలకంగా మారనున్నాయి. ధర పరిమితిని తొలగించడం వల్ల ఎక్కువ ఇళ్లకు సరసమైన గృహాల కేటగిరీ వర్తించే అవకాశం ఉన్నప్పటికీ, దానివల్ల ఇళ్ల ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేం. వాస్తవంగా కొనుగోలుదారులకు ప్రయోజనం కలగాలంటే నిర్మాణ వ్యయాలు తగ్గడం, భూమి లభ్యత పెరగడం, గృహ రుణ సదుపాయాలు మెరుగుపడటం కూడా అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement