అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ (Salesforce) మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ తాజా కోతల ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపైనా పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన కొందరు సిబ్బంది తమ అనుభవాలను అనామక ఉద్యోగుల వేదిక బ్లైండ్ (Blind)లో పంచుకున్నారు. వారికి గార్డెన్ లీవ్‌తో పాటు అదనపు పరిహారం కూడా అందించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
బ్లైండ్‌లో సేల్స్‌ఫోర్స్ ఇండియా ఉద్యోగిగా చెప్పుకున్న ఓ వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయినట్లు పోస్టు చేశారు. కంపెనీ ఉద్యోగుల సంబంధాల విభాగం నుంచి క్యాలెండర్ ఆహ్వానం అందిన అనంతరం మేనేజర్, హెచ్‌ఆర్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించారని తెలిపారు. తనకు 2027 ఫిబ్రవరి 1 వరకు గార్డెన్ లీవ్ వర్తిస్తుందని పేర్కొన్నారు.
గార్డెన్ లీవ్ అంటే ఏమిటి?
ఉద్యోగిని విధులకు హాజరుకావద్దని చెప్పినప్పటికీ, నోటీసు వ్యవధిలో కంపెనీ పేరోల్‌లో కొనసాగిస్తూ జీతం, వర్తించే ప్రయోజనాలు అందించే విధానాన్ని గార్డెన్ లీవ్ అంటారు. ఈ సమయంలో ఉద్యోగి రోజువారీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
21 వారాల వరకు పరిహారం?
సేల్స్‌ఫోర్స్ ఉద్యోగుల తొలగింపులపై బ్లైండ్‌లో మరో ఉద్యోగి చేసిన పోస్టు కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభావిత ఉద్యోగులకు సుమారు రెండు నెలల గార్డెన్ లీవ్‌తో పాటు, వారి ఉద్యోగ అనుభవం (టెన్యూర్), పనిచేసే ప్రాంతాన్ని బట్టి అదనపు వారాల జీతం అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొందరికి సుమారు 21 వారాల వేతనానికి సమానమైన ప్యాకేజీ లభించవచ్చని వెల్లడించారు.
అయితే, ఈ పరిహార వివరాలు ఉద్యోగులు బ్లైండ్‌లో పంచుకున్న సమాచారమే. వీటిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. భారత్‌లో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు? ఏయే విభాగాలపై ప్రభావం పడింది? అనే వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు.
ఇదీ చదవండి: ఎంబీఏ విద్యార్థులు ఏఐ నేర్చుకోవాల్సిందేనా?


