PC: BCCI X
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 (SMAT) సూపర్ లీగ్ మ్యాచ్‌లలో ఆడేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. సొంతజట్టు ముంబై తరఫున అతడు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
సూపర్ లీగ్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే
కాగా SMAT సూపర్ లీగ్ మ్యాచ్‌ల గురించి బీసీసీఐ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. ‘‘ఎలైట్ గ్రూప్ దశలో ఆయా గ్రూపులలో టాప్-2లో నిలిచి ముంబై, విదర్భ, ఆంధ్ర, కేరళ, ఢిల్లీ, పంజాబ్, బరోడా, రాజస్తాన్ సూపర్ లీగ్‌కు చేరుకున్నాయి.
ప్రతీ జట్టు ఈ దశను కొత్తగానే మొదలుపెడుతుంది. ఎలైట్ గ్రూపులోని విజయాలు, పాయింట్లు, నెట్ రన్‌రేటు ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇక్కడ ప్రతీ జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడుతుంది.
గ్రూప్-ఎ, గ్రూప్-బి నుంచి టాపర్లుగా నిలిచిన జట్లు నేరుగా డిసెంబరు 6న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జామ్తాలోని వీసీఏ స్టేడియం ఇందుకు వేదిక. ఒకవేళ ఏదేని గ్రూపులో ఇరుజట్లు సమంగా పాయింట్లు సాధిస్తే.. అప్పుడు నెట్‌రన్‌రేటు ద్వారా ముందుకు వెళ్లే జట్టును నిర్ణయిస్తాము’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
సూర్య సారథ్యంలో శ్రేయస్!
ఇదిలా ఉంటే.. నాగ్‌పూర్ వేదికగా గ్రూప్-ఎ నుంచి బరోడా, ఢిల్లీ, కేరళ, విదర్భ తలపడనుండగా.. గ్రూప్-బి నుంచి ముంబై, ఆంధ్ర, పంజాబ్, రాజస్తాన్ జట్లు బరిలో ఉన్నాయి. ఇక ముంబై జట్టుకు టీమిండియా మాజీ సారథి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
సూర్య స్థానంలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ముంబై జట్టు తరఫున సూర్య కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధం కావడం విశేషం. కాగా శ్రేయస్ SMAT బరిలో దిగుతాడని టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు ఒకరు పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై స్పష్టత మాత్రం లేదు.
ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. అధికారిక ప్రకటన విడుదల


