టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. టీ20 తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇటీవల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 వన్డే టోర్నీలో యూఏఈతో మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం ఇందుకు నిదర్శనం.
అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని.. వన్డే తుదిజట్టులో చోటు ఇవ్వకపోయినా.. జట్టుకు మాత్రం ఎంపిక చేయాలని యాజమాన్యానికి సూచించాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వైభవ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఇప్పుడే అతడిని టెస్టుల్లో ఆడించకపోయినా.. పదిహేను మంది సభ్యులలో ఒకడిగా ఎంపిక చేయండి. వన్డే జట్టులో చోటు ఇవ్వండి. శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా అతడిని ఆడించండి.
వన్డే వరల్డ్‌కప్-2027 జట్టుకు ఎంపిక చేయండి
వైభవ్‌ను ఇప్పటి నుంచే ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాలనుకుంటే వన్డే వరల్డ్‌కప్-2027 జట్టుకు అతడిని ఎంపిక చేయండి. ఏదో ఒకరోజు అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌లన్నీ గెలిపిస్తాడు. అతడి గాలివాటం బ్యాటింగ్ కాదు. పవర్‌తో పాటు టైమింగ్ కూడా పక్కాగా కుదిరితేనే అనుకున్న షాట్లు ఆడగలము.
అతడొక జీనియస్
వైభవ్‌కు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. అయినా సరే నెమ్మదిగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. అతడొక జీనియస్. ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ వచ్చాడు. ఆ తర్వాత కింగ్ విరాట్ కోహ్లి.. ఇప్పుడు వైభవ్.. క్రికెట్ దేవుడి కుమారుడిలా అనిపిస్తున్నాడు.
అతడికి ప్రోత్సాహం అందించి.. తీర్చిదిద్దకపోతే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. సెలక్టర్లు, యాజమాన్యం దయచేసి కళ్లు తెరవండి. వైభవ్‌ను అన్ని ఫార్మాట్లలో ఆడించే యోచన చేయండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు. కాగా పదిహేనేళ్ల వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: నీకంత ఆటిట్యూడ్ ఎందుకు?.. ఓవరాక్షన్ తగ్గించుకో!


