క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. వైట్-బాల్ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో టీమ్ మేనెజ్‌మెంట్ అతడికి టెస్టుల్లోనూ అవకాశం కల్పించింది. సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ తుది జట్టులోకి వచ్చాడు.
అయితే తొలి రోజు ఆటలో గుర్నూర్ 19 ఓవర్లు బౌలింగ్ చేసి 52 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గుర్నూర్ బౌలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి అరంగేట్ర ప్రదర్శనను ప్రశంసిస్తూనే, ఆట సాగుతున్న కొద్దీ బౌలింగ్ వేగం తగ్గందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
"గుర్నూర్ ఫస్ట్ క్లాస్ రికార్డులు అంత గొప్పగా లేకపోయినా.. ఇటీవల వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. వైట్-బాల్ క్రికెట్‌లో తరచూ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే అతడు.. టెస్టుల్లో ఎక్కువ ఓవర్లు వేయాల్సి రావడంతో కొంత కంట్రోల్‌గా బౌలింగ్ చేశాడు. తొలి సెషన్‌లో సగటున 138 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసిన బ్రార్, రెండో సెషన్‌లో 136 కి.మీ.కు, చివరి సెషన్‌కు వచ్చేసరికి 132 కి.మీ. వేగానికి పడిపోయాడు.
తొలి వికెట్ తీసిన తర్వాత గుర్నూర్ కివీస్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. అయినప్పటికీ అరంగేట్ర మ్యాచ్‌లో ఇది అతడికి చాలా మంచి ఆరంభమని" కార్తీక్ పేర్కొన్నాడు. అదేవిధంగా తొలి రోజు ఆటలో మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ అత్యుత్తమంగా రాణించాడని డీకే కొనియాడాడు. కాగా, క్రైస్ట్‌చర్చ్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
చదవండి: పంతంతో ఆడి శతక్కొట్టిన స్మృతి మంధాన


