పంతంతో ఆడి శ‌త‌క్కొట్టిన స్మృతి మంధాన | Smriti Mandhana-37 Balls-Century-Stuns-Kevin Pietersen Challenge | Sakshi
Sakshi News home page

పంతంతో ఆడి శ‌త‌క్కొట్టిన స్మృతి మంధాన

Dec 4 2026 1:58 PM | Updated on Nov 27 2026 2:00 PM

Smriti Mandhana-37 Balls-Century-Stuns-Kevin Pietersen Challenge

Photo Credit: Twitter

భార‌త మ‌హిళా కెప్టెన్ స్మృతి మంధాన 37 బంతుల్లోనే శ‌త‌కంతో మెరిసి ఔరా అనిపించింది. ప‌దునైన బంతులు ఇబ్బంది పెడుతున్న‌ప్ప‌టికీ, బ్యాట్‌ను ఝ‌లిపించిన మంధాన సిక్స‌ర్ల‌తో హ‌డ‌లెత్తించింది. 50 బంతుల్లో వంద ప‌రుగులు చేయాల‌ని ప్ర‌త్య‌ర్థి చాలెంజ్ విస‌ర‌గా, పంతంతో ఆడిన మంధాన కేవ‌లం 37 బంతుల్లోనే శ‌త‌కం సాధించ‌డం విశేషం. అయితే మంధాన ఈ ఫీట్ సాధించింది అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో అనుకుంటే పొర‌పాటే అవుతుంది.

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌కు చెందిన యూట్యూబ్ చానెల్ *స్విచ్‌* షోలో మంధాన పాల్గొంది. ఈ షో నిబంధనల ప్రకారం, బ్యాటర్ 50 బంతుల్లో 100 పరుగులు చేయాలి. అయితే, తొలి బంతి గంటకు 51 మైళ్ల వేగంతో వస్తే, ఆ తర్వాత ప్రతి బంతికీ వేగం ఒక మైలు చొప్పున పెరుగుతూ ఉంటుంది. 50వ బంతి నాటికి దాని వేగం గంటకు 100 మైళ్లకు చేరుకుంటుంది. 

ఇంతటి కఠినమైన ఛాలెంజ్‌లో స్మృతి మంధాన తన క్లాస్ చూపించింది. పెరుగుతున్న వేగాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ, అద్భుతమైన షాట్లతో 37 బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. గతంలో శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వంటి ఆటగాళ్లు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

మంధాన ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉంది. సీనియర్ మహిళల ఇంటర్-జోనల్ టీ20 టోర్నీలో వెస్ట్ జోన్ తరఫున ఆడుతోంది. డిసెంబ‌ర్‌లో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్ల‌నున్న భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు స‌ఫారీ గ‌డ్డ‌పై ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. 

డిసెంబ‌ర్ 9న గెబెర్హా వేదిక‌గా ఏకైక టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, తొలి వ‌న్డే డిసెంబ‌ర్ 16న‌, రెండో వ‌న్డే డిసెంబ‌ర్ 19న‌, మూడో వ‌న్డే డిసెంబ‌ర్ 22న జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 26న తొలి టీ20, డిసెంబ‌ర్ 29న రెండో టీ20, డిసెంబ‌ర్ 30న మూడో టీ20 మ్యాచ్‌తో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు టోర్నీ ముగించ‌నుంది.

భారత మహిళల జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్‌),హర్మన్‌ప్రీత్ కౌర్,  స్నేహ రాణా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, నందనీ శర్మ, ప్రతీకా రావల్, సయాలీ సత్‌ఘరే, క్రాంతి గౌడ్‌, జింటిమ‌ని క‌లిటా, శ్రీ చ‌ర‌ణి

ఇదీ చదవండి: రుతురాజ్‌పై వేటు!.. మళ్లీ కెప్టెన్‌గా పృథ్వీ షా.. మారని జట్టు రాత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement