నీకంత ఆటిట్యూడ్‌ ఎందుకు?.. ఓవరాక్షన్‌ తగ్గించుకో! | Full Of Attitude: Harshit Rana Trolled For On Field Outburst At Teammate | Sakshi
Sakshi News home page

నీకంత ఆటిట్యూడ్‌ ఎందుకు?.. ఓవరాక్షన్‌ తగ్గించుకో!

Nov 27 2026 4:05 PM | Updated on Nov 27 2026 4:24 PM

Full Of Attitude: Harshit Rana Trolled For On Field Outburst At Teammate

PC: BCCI X

భారత పేసర్‌పై నెటిజన్ల విమర్శలు

టీమిండియా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మరీ ఇంత ఆటిట్యూడ్‌ పనికి రాదని.. అంతర్జాతీయ స్థాయి ఆటగాడివి అయి ఉండి ఇంత ఓవరాక్షన్‌ అవసరమా?’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

ముగిసిన భారత జట్టు ప్రయాణం
గాయం నుంచి కోలుకున్న చాన్నాళ్ల తర్వాత ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌-2026 వన్డే టోర్నీ సందర్భంగా హర్షిత్‌ రాణా.. భారత్‌- ‘ఎ’ తరఫున మైదానంలో దిగాడు. ఈ మెగా ఈవెంట్లో సెమీస్‌ చేరిన తిలక్‌ వర్మ సేన.. గురువారం శ్రీలంక- ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో లంక ఫైనల్లో అడుగుపెట్టగా.. భారత్‌ ప్రయాణం ఇంతటితో ముగిసిపోయింది.

దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. అయితే, భారత బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక కేవలం 41.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది.

61 పరుగులు ఇచ్చుకుని
ఈ మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా ఏడు ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 61 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. అయితే, తన బౌలింగ్‌లో లంక బ్యాటర్‌ బంతిని బౌండరీకి తరలించగా.. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న షాబాజ్‌ అహ్మద్‌ బంతిని అందుకోవడంలో కాస్త ఆలస్యం చేశాడు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్‌.. షాబాజ్‌ను దూషించాడు. తొందరగా బంతి అందుకో పరుష పదజాలం వాడాడు.

ఆటిట్యూడ్‌ తప్ప.. ఇంకేం లేదు
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు హర్షిత్‌ రాణా ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి ఆటగాడిని తిట్టడం సరికాదని.. ఆటిట్యూడ్‌ తప్ప హర్షిత్‌ దగ్గర ఇంకేమీ లేదని విమర్శిస్తున్నారు. బీసీసీఐ ఈ విషయంలో జోక్యం చేసుకుని హర్షిత్‌ను మందలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో హర్షిత్‌ రాణా నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 26 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 217 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక 2024లో భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 24 ఏళ్ల హర్షిత్‌.. ఇప్పటి వరకు రెండు టెస్టుల్లో నాలుగు, 14 వన్డేల్లో 26, 14 టీ20 మ్యాచ్‌లలో 16 వికెట్లు కూల్చాడు.

ఇవీ చదవండి: Tilak Varma: 'చిన్న పొర‌పాటుతో భారీ మూల్యం చెల్లించుకున్నాం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement