అమెరికా: అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు ట్రంప్ ప్రభుత్వం కీలక షాక్ ఇచ్చింది. EB-5 ఇన్వెస్టర్ వీసా కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ పెంపు 2026 నవంబర్ 30 నుంచి అమల్లోకి రానుంది.
EB-5 వీసా ద్వారా అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలో శాశ్వత నివాసం పొందవచ్చు. ఇందుకోసం సాధారణ వ్యాపారాల్లో కనీసం 10.5 లక్షల డాలర్లు లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 8 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అలాగే కనీసం 10 పూర్తిస్థాయి ఉద్యోగాలను కూడా వారు సృష్టించాలి.
భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు
వ్యక్తిగత పెట్టుబడిదారులు సమర్పించే I-526 దరఖాస్తు ఫీజు 3,675 డాలర్ల నుంచి ఒక్కసారిగా 7,615 డాలర్లకు పెరగనుంది. ప్రాంతీయ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసే I-526E ఫీజు మొత్తం 7,850 డాలర్లుగా నిర్ణయించారు. గ్రీన్కార్డుపై షరతుల తొలగింపునకు ఉపయోగించే I-829 ఫీజు 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త నిబంధనలతో మొత్తం తొమ్మిది రకాల దరఖాస్తులపై సగటున 70.7 శాతం ఫీజు పెరుగుదల ఉంటుందని DHS వెల్లడించింది. దీనివల్ల ఏడాదికి సుమారు 16,600 దరఖాస్తులు ప్రభావితమవుతాయని ఓ అంచనా.
ప్రాంతీయ కేంద్రాలకూ అదనపు భారం
20 మందికి పైగా అర్హత కలిగిన పెట్టుబడిదారులున్న ప్రాంతీయ కేంద్రాల వార్షిక ఫీజు 20 వేల డాలర్ల నుంచి 22 వేల డాలర్లకు పెరగనుంది. 20 లేదా అంతకంటే తక్కువ మంది పెట్టుబడిదారులున్న కేంద్రాలకు ఈ ఫీజు 10 వేల డాలర్ల నుంచి 11 వేల డాలర్లకు చేరనుంది. నిర్ణీత గడువులో ఫీజులు చెల్లించకపోతే జరిమానాలతో పాటు ప్రాంతీయ కేంద్రాల గుర్తింపు కూడా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇదీ చదవండి: గ్యాస్, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారం.. విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్


