సమాధుల తవ్వకాలు.. అమెరికా సైన్యంలో కలకలం | US Army Conducts Mass Grave Training For First Time Since Korean War Amid Iran War Tensions, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సమాధుల తవ్వకాలు.. అమెరికా సైన్యంలో కలకలం

Oct 30 2026 12:39 PM | Updated on Oct 30 2026 1:07 PM

Us Army Practices Digging Temporary Battlefield Graves

ఇరాన్‌తో అమెరికా యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్న వేళ కీలక  పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సైన్యం కీలకమైన ముందస్తు సన్నద్ధతకు సిద్ధం కావడం కలకలం రేపుతోంది. యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతే.. వారి మృతదేహాలను తాత్కాలికంగా ఖననం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. 1950-53 కొరియా యుద్ధం తర్వాత ఈ రకమైన శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి..

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత..
దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత అమెరికా సైన్యం మళ్లీ సామూహిక సమాధుల తవ్వకాలకు సంబంధించిన కసరత్తు చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించే పరిస్థితులను ఎదుర్కొనేందుకే ఈ శిక్షణ చేపట్టినట్లు న్యూస్‌వీక్ కథనం వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా సైనికుల ప్రాణనష్టంపై ఆందోళనలు పెంచుతోంది. 

గత నెలలో 22 మంది అమెరికా సైనిక సిబ్బంది మరణించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. పెంటగాన్‌ అధికారిక డేటాబేస్‌లో పేర్కొన్న సంఖ్య కంటే ఇది నలుగురు ఎక్కువ. అయితే, ఈ మరణాల్లో కొన్ని నేరుగా యుద్ధానికి సంబంధించినవి కాకపోయినా.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనిక సిబ్బందికి సంబంధించినవేనని ఆ పత్రిక పేర్కొంది. ఈ కథనాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ తీవ్రంగా ఖండించారు. అదంతా పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.

ఆపరేషన్ డ్రాగన్ కోవెనెంట్ ఫేజ్-2 పేరుతో
న్యూస్‌వీక్ కథనం ప్రకారం.. ‘ఆపరేషన్ డ్రాగన్ కోవెనెంట్ ఫేజ్-2’ పేరుతో ఈ శిక్షణ గత నెలలో ప్రారంభమైంది. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్‌లో నిర్వహించారు. ఇందులో 3వ కార్ప్స్ సస్టెయిన్‌మెంట్ కమాండ్, 20వ ఇంజినీర్ బ్రిగేడ్‌కు చెందిన సైనికులతో పాటు మిలటరీ చాప్లిన్లు, ఇతర మతపరమైన సహాయక సిబ్బంది పాల్గొన్నారు. బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలను ఉపయోగించి తాత్కాలికంగా సామూహిక సమాధులు ఏర్పాటు చేయడం, భారీ యుద్ధంలో మరణించిన సైనికుల మృతదేహాలను ఎలా నిర్వహించాలనే అంశాలపై సాధన చేశారు.

ఇంత పెద్ద స్థాయిలో..
కొరియా యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో తాత్కాలిక సామూహిక ఖనన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అమెరికా సైన్యానికి రాలేదని ఆర్మీ వెల్లడించింది. ఆ యుద్ధంలో 36,515 మంది అమెరికా సైనికులు మరణించగా.. మరికొందరు గల్లంతయ్యారు. మరో 7,245 మంది శత్రువులకు బందీలుగా చిక్కారు. గత 25 ఏళ్లలో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో జరిగిన యుద్ధాల సమయంలో విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల మృతదేహాలను వెంటనే స్వదేశానికి తరలించేవారు. దీంతో పెద్ద ఎత్తున తాత్కాలిక సమాధుల ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి రాలేదని ఆర్మీ తెలిపింది.

భవిష్యత్తులో..
అయితే, భవిష్యత్తులో భారీ సంఖ్యలో సైనికులు మరణిస్తే ఒక్కొక్కరి మృతదేహాన్ని విడివిడిగా ఖననం చేయడం, వ్యక్తిగత మతపరమైన అంత్యక్రియలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సైన్యం సమర్థంగా వ్యవహరించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొంది. మృతదేహాలను వెలికితీసి భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ యుద్ధ కార్యకలాపాలు ఆగకపోవచ్చని వివరించింది.

అమెరికా సైన్యం నిర్దేశించిన ప్రామాణిక విధానం ప్రకారం.. ఒక తాత్కాలిక సామూహిక ఖనన స్థలంలో ఐదు పొడవైన గోతులు ఉంటాయి. వీటిలో గరిష్టంగా 100 మంది మృతదేహాలను ఖననం చేసేందుకు వీలుంటుంది. ఉత్తర కరోలినాలో నిర్వహించిన శిక్షణలో ఒక్కో సమాధి స్థలాన్ని సిద్ధం చేసేందుకు సగటున గంటా 15 నిమిషాల సమయం పట్టినట్లు సైన్యం తెలిపింది. ఎనిమిది బుల్డోజర్లు, నాలుగు సైనిక ఎక్స్‌కవేటర్లతో 24 గంటల్లో గరిష్టంగా 2,400 మంది సైనికుల మృతదేహాలను తాత్కాలికంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేయవచ్చని వెల్లడించింది.

అయితే, మృతదేహాలను ఖననం చేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం కాదు. వాటిని భద్రపరిచి, తర్వాత గుర్తించేలా చర్యలు తీసుకోవడం, చివరకు స్వదేశానికి తరలించడం కూడా ఇందులో కీలక అంశాలు. యుద్ధంలో మరణించిన సైనికుల మృతదేహాలను గౌరవప్రదంగా చూసుకోవడం, వాటి గుర్తింపును కాపాడటం ప్రతి స్థాయి కమాండర్ల బాధ్యతగా అమెరికా సైనిక నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే, సామూహిక సమాధుల శిక్షణను ఇరాన్‌ యుద్ధం కోసమే చేపట్టారనే అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి: తొందరపడొద్దు.. ట్రంప్‌నకు సౌదీ కీలక రిక్వెస్ట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement