పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. పోరాడి ఓడిన టీమిండియా | Arjun Rajputs 107 in Vain as Pakistan Beat India in U19 Asia Cup | Sakshi
Sakshi News home page

Asia Cup 2026: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. పోరాడి ఓడిన టీమిండియా

Nov 8 2026 6:13 PM | Updated on Nov 8 2026 6:27 PM

Arjun Rajputs 107 in Vain as Pakistan Beat India in U19 Asia Cup

అండ‌ర్‌-19 వ‌న్డే ఆసియా క‌ప్ 2026లో భారత యువ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. అల్ అమెరాట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత అండర్‌-19 జట్టు 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఒంటరి పోరాటం చేసిన అర్జున్ రాజ్‌పుత్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 46.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. ఒకానొక దశలో భారత్ 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అర్జున్ రాజ్‌పుత్ (85 బంతుల్లో 107 పరుగులు; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. 

అయితే అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్‌ షఫీక్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా, మొహమ్మద్‌ సయ్యమ్‌ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

చెమటోడ్చి గెలిచిన పాక్.. 
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే బిగ్ షాక్ ఇచ్చారు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో పాక్ జట్టును 61 పరుగులకే 5 వికెట్లు తీసి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన హమ్జా జహూర్ (108 బంతుల్లో 100 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. హస్నైన్ అబ్బాస్ దార్ (38)తో కలసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఆ తర్వాత హస్నైన్ అబ్బాస్‌ను స్పిన్నర్ మనల్ చౌహాన్, వెంటనే వచ్చిన మొహమ్మద్ సయ్యమ్‌ను మోహిత్ ఉల్వా అవుట్ చేయడంతో భారత్ తిరిగి మ్యాచ్‌లోకి వచ్చినట్లే కనిపించింది. కానీ ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన హమ్జా జహూర్ అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్తాన్ 48 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement