పాక్‌కు చుక్కలు చూపించిన పంజాబ్ కుర్రాడు.. ఎవరీ 'జూనియర్ యువరాజ్'? | Meet Arjun Rajput: India U19 Star Who Punished Pakistan With an 80-Ball Hundred | Sakshi
Sakshi News home page

IND vs PAK: పాక్‌కు చుక్కలు చూపించిన పంజాబ్ కుర్రాడు.. ఎవరీ 'జూనియర్ యువరాజ్'?

Nov 8 2026 2:52 PM | Updated on Nov 8 2026 3:05 PM

Meet Arjun Rajput: India U19 Star Who Punished Pakistan With an 80-Ball Hundred

అండ‌ర్‌-19 వ‌న్డే ఆసియా క‌ప్‌లో పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త యువ బ్యాట‌ర్ అర్జున్ రాజ్‌పూత్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భారత జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్జున్.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు క్ర‌మం తప్పకుండా వికెట్లు ప‌డుతున్నా, అర్జున్ మాత్రం ఒంటరి పోరాటం సాగించాడు.

ఈ క్ర‌మంలో కేవ‌లం 80 బంతుల్లోనే తొలి యూత్ వ‌న్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవ‌రాల్‌గా 85 బంతులు ఎదుర్కొన్న అర్జున్‌.. 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 107 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అతడి రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.3 ఓవ‌ర్ల‌లో 208 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్తాన్‌పై వీరోచిత సెంచ‌రీతో చెల‌రేగిన అర్జున్ గురించి తెలుసుకోవ‌డానికి క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు.

ఎవరీ అర్జున్ రాజ్‌పుత్?
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అర్జున్ రాజ్‌పుత్ కూచ్ బెహార్, వినూ మన్కడ్ ట్రోఫీలలో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో ఏకంగా 695 పరుగులు చేయడమే కాకుండా 11 వికెట్లు తీసి పంజాబ్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ అర్ధసెంచరీతో మెరిసాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ చేసే ఈ యువ సంచలనం దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుచేస్తుంటాడు.

ఈ ఏడాది జరిగిన పంజాబ్ టీ20 లీగ్‌లోనూ అత‌డు అద‌ర‌గొట్టాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 57.60 సగటుతో రెండు హాఫ్ సెంచ‌రీల సాయంతో 288 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్-2027 వేలంలో ఈ యువ ఆల్‌రౌండ‌ర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డే అవ‌కాశ‌ముంది. ఇప్పటివరకు 6 యూత్ వన్డేలు ఆడిన అర్జున్‌.. 43.60 సగటుతో 218 పరుగులు సాధించాడు. ఇందులో పాక్‌పై చేసిన ఈ సెంచరీతో పాటు శ్రీలంకపై చేసిన ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement