ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు సీనియర్ ఓపెనర్, దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో రిటెన్షన్ విండో ముగిసేలోపే రోహిత్ శర్మను తిరిగి సారథిగా నియమిస్తూ ముంబై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
హార్దిక్ పాండ్యా - అర్ష్‌దీప్ సింగ్ ట్రేడింగ్ డీల్!
గత మూడు సీజన్లుగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ట్రేడ్ కానున్నట్లు 'ఇండియా టుడే' జర్నలిస్ట్ రాహుల్ రావత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా పంజాబ్ కింగ్స్ తమ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్స్ ముంబై ఇండియన్స్‌కు ఇచ్చి, హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇరు జట్ల యాజమాన్యాలు ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది.
కాగా రోహిత్ శర్మ 2013 నుండి 2023 వరకు ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించి ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. అయితే 2024 సీజన్‌లో రోహిత్ స్థానంలో అనూహ్యంగా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
హార్దిక్ నాయకత్వంలో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో జట్టును మళ్లీ విజయాల బాట పట్టించేందుకు, పాత వైభవాన్ని తెచ్చేందుకు రోహిత్ శర్మకే తిరిగి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.


