వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అయినా మా బౌల‌ర్లు అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌ | Mitchell Santner Praises Bowlers For Testing India In Low-scoring Wellington ODI | Sakshi
Sakshi News home page

వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అయినా మా బౌల‌ర్లు అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌

Nov 7 2026 6:54 PM | Updated on Nov 7 2026 6:56 PM

Mitchell Santner Praises Bowlers For Testing India In Low-scoring Wellington ODI

వెల్లింగ్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 4 ప‌రుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 134 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

ఈ సమయంలో వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం అప్పటికి 4 పరుగులు ఆధిక్యంలో ఉన్న భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందిస్తూ.. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని వెల్లడించారు.

"వెల్లింగ్టన్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. మ్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరికీ ఆ విషయం అర్థమై ఉంటుంది. భారత బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసి మాకు కఠిన సవాల్ విసిరారు. పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది. ఇన్నింగ్స్ సగం పూర్తయ్యేసరికి మేము చాలా వెనకబడిపోయాం. కనీసం 160-180 పరుగులు సాధించి ఉంటే బాగుండేది.

అయినప్పటికీ పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం లభించింది. అందుకు తగ్గట్టే మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. తక్కువ స్కోరును కాపాడుకోవాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయడమే ఏకైక మార్గం. ఆ పని మా బౌలర్లు విజయవంతంగా చేశారు. వన్డే క్రికెట్‌లో భాగస్వామ్యాలను బ్రేక్ చేయడం చాలా కీలకం. నేను కూడా బౌలింగ్ కోసం వార్మప్ అయ్యాను, కానీ మా బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తుండటంతో వారినే కొనసాగించాను. 

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంటుందని మాకు ముందే తెలుసు. ఇది చాలా కఠినమైన వికెట్. దాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఇక, కంకషన్‌కు గురైన టిక్నర్ ప్రస్తుతం హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నాను" అని శాంట్నర్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement