Photo Credit: Twitter
న్యూజిలాండ్‌తో శుక్రవారం మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా టీమిండియా నాలుగో వన్డే మ్యాచ్ ఆడనుంది. టెస్టు సిరీస్ సన్నాహకాల కోసం రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జట్టును వీడడంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడనున్న శ్రేయస్ ఏ మేరకు సఫలమవుతాడనేది చూడాలి.
గిల్, రాహుల్ స్థానాల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ లేదా తిలక్ వర్మల్లో ఒకరు ఆడే అవకాశముంది. ఓపెనింగ్ స్లాట్‌లో రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ జత కట్టనుండగా, రుతురాజ్ లేదా తిలక్‌లో ఒకరు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నారు. ఇక రోహిత్ శర్మకు బే ఓవల్‌లో మంచి రికార్డు ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అర్థసెంచరీలు చేసిన రోహిత్ శర్మ 74.5 సగటుతో 149 పరుగులు సాధించాడు.
మొత్తంగా కివీస్ గడ్డపై 17 మ్యాచ్‌లాడిన రోహిత్ 460 పరుగులు సాధించాడు. 2019లో బే ఓవల్ వేదికగా కివీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 96 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా 66 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఫలితంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.
అనంతరం న్యూజిలాండ్‌ను 40.2 ఓవర్లలో 234 పరుగలుకు ఆలౌట్ చేసి 90 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇదే సిరీస్‌లో మూడో వన్డే కూడా బే ఓవల్ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ (77 బంతుల్లో 62) అర్థసెంచరీ సాధించగా, కెప్టెన్ విరాట్ కోహ్లి (60 నాటౌట్) రాణించాడు. దీంతో భారత్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక తాజా సిరీస్‌లో రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌లు కలిపి 23 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డకౌట్ ఉంది. మూడో వన్డే వర్షార్పణం కావడంతో నాలుగో వన్డేలో రోహిత్ మెరుస్తాడేమో చూడాలి. అసలే తనకు అచ్చొచ్చిన మైదానం కావడంతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడేమో చూడాలి.
ఇదీ చదవండి:


