చరిత్ర సృష్టించిన నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ | Sandeep Lamichhane-Bags-Hat-Trick-NPL 2026-Record-Best Bowling Figures | Sakshi
Sakshi News home page

NPL 2026: చరిత్ర సృష్టించిన నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌

Nov 12 2026 4:17 PM | Updated on Nov 12 2026 4:24 PM

Sandeep Lamichhane-Bags-Hat-Trick-NPL 2026-Record-Best Bowling Figures

Photo Credit: Twitter

నేపాల్ స్టార్ లెగ్ స్పిన్న‌ర్ సందీప్ ల‌మిచానే నేపాల్ ప్రీమియ‌ర్ లీగ్ (ఎన్‌పీఎల్‌)లో హ్యాట్రిక్‌తో మెరిశాడు. ఈ సీజ‌న్‌లో సందీప్ లమిచానే బిరాట్‌నగర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. గురువారం కీర్తిపూర్‌లోని టీయూ ఇంటర్నేష‌న‌ల్ మైదానంలో పొఖారా అవెంజర్స్ జట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో సందీప్ ఈ ఫీట్‌ను సాధించాడు. 

ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో మూడు, నాలుగు, ఐదు బంతుల్లో మూడు వరుస వికెట్లు ప‌డ‌గొట్టి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఓవ‌రాల్‌గా మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసి 27 ప‌రుగులిచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టి నేపాల్ ప్రీమియ‌ర్ లీగ్ త‌న బెస్ట్ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశాడు. తొలి స్పెల్‌లో అర్జున్ ఘాత్రి, స‌న్నీ బీకే, ర‌మేశ్ మెండిస్‌ల‌ను ఔట్ చేసిన సందీప్ మ‌రుస‌టి స్పెల్‌లో బౌలింగ్‌కు వ‌చ్చి యువ‌రాజ్ స‌మ్రాను వెన‌క్కి పంపాడు. 

ఆ త‌ర్వాత వ‌రుస బంతుల్లో చ‌మికా క‌రుణ‌ర‌త్నే, కిర‌ణ్ త‌గున్నాల‌ను గోల్డెన్ డ‌కౌట్లుగా పెవిలియ‌న్ చేర్చి సందీప్‌ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. ఎన్‌పీఎల్‌ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా (ప్రతీష్ జీసీ, షాహాబ్ ఆలం, రోహిత్ పౌడెల్ తర్వాత) రికార్డు సృష్టించాడు.

ఈ నేప‌థ్యంలో టీ20 క్రికెట్‌లో త‌న బెస్ట్ ఎవ‌ర్ బౌలింగ్ ఫిగ‌ర్స్‌ను కూడా న‌మోదు చేశాడు. 2022 ఆగ‌స్టులో కెన్యాతో మ్యాచ్‌లో సందీప్ ల‌మిచానే (5-9) త‌న రికార్డును స‌వ‌రించాడు. ఇప్ప‌టికే సందీప్ ల‌మిచానే టీ20 క్రికెట్‌లో గ్రేటెస్ట్ స్పిన్న‌ర్స్ ఆఫ్ ఆల్‌టైమ్‌లో ఒక‌డిగా ఉన్నాడు. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సందీప్ ల‌మిచానే ఇప్ప‌టివ‌ర‌కు 80 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు తీశాడు. ఇటీవ‌లే టీ20ఐల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న ర‌షీద్ ఖాన్ కంటే కూడా ల‌మిచానే బౌలింగ్ స‌గ‌టు త‌క్కువ‌గా ఉండ‌డం విశేషం. అంతేకాదు టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్ల మార్క్ పూర్తి చేసిన రెండో బౌల‌ర్‌గా ల‌మిచానే నిలిచాడు. లమిచానే ఈ ఫీట్‌ణు 54 మ్యాచ్‌ల్లో పూర్తి చేశాడు. ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో సందీప్ ల‌మిచానే ఇప్ప‌టివ‌ర‌కు 182 మ్యాచ్‌ల్లో 262 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే బిరాట్‌న‌గ‌ర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో పోఖారా అవెంజ‌ర్స్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పొఖారా అవెంజ‌ర్స్ 17.5 ఓవ‌ర్ల‌లో 132 ప‌రుగుల‌కు ఆలౌటైంది. యువ‌రాజ్ స‌మ్రా (84) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. సందీప్ ల‌మిచానే ఆరు వికెట్లు తీయ‌గా, ఏంజెలో మాథ్యూస్‌, చ‌రిత్ అస‌లంక‌, రూపేశ్ సింగ్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన బిరాట్‌న‌గ‌ర్ కింగ్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 136 ప‌రుగులు చేసి గెలుపొందింది. బ‌సీర్ అహ‌మ‌ద్ (37), లోకేశ్ బామ్ (33) రాణించ‌గా, ఆఖ‌ర్లో ఇసురు ఉడాన (25 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు.

ఇదీ చదవండి: సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. వణకిపోయిన బౌలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement