Photo Credit: Twitter
టీమిండియా స్టార్ క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఒకేరోజున రెండు శుభవార్తలు విన్నాడు. సంచలన ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్ గూటికి అర్షదీప్ చేరడం మొదటిదైతే, రెండోది అతడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం న్యూజిలాండ్ గడ్డపై తన గర్ల్‌ఫ్రెండ్ సమ్రీన్ కౌర్ చేతికి రింగు తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు.
మౌంట్ మాంగనూయ్‌లోని అందమైన ప్రదేశంలో మోకాళ్లపై నిలబడి సమ్రీన్ కౌర్‌కు ప్రపోజ్ చేసిన అర్షదీప్ ఆ తర్వాత ఆమె చేతికి రింగును తొడిగాడు. ఆ తర్వాత సమ్రీన్ తన చేతి వేలికి అర్షదీప్ తొడిగిన రింగును చూపిస్తూ ఫొటోలకు ఫోజివ్వడాన్ని ముంబై ఇండియన్స్ షేర్ చేసుకుంది.
ఈ విషయాన్ని సమ్రీన్ కౌర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. "జీవితం మనకిచ్చిన అత్యంత అద్భుతమైన కానుక.. మనమిద్దరం కలవడమే. ఇకపై మన జర్నీ జీవితాంతం కలిసి సాగుతుంది. హాయ్ ఫియాన్సీ" అంటూ సమ్రీన్ కౌర్ భావోద్వేగమైన క్యాప్షన్ రాసుకొచ్చింది.
దీంతో ఈ జంటకు క్రికెట్ అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అర్ష్‌దీప్ సహచర ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, నమన్ ధీర్ కూడా అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఇక అర్షదీప్ ప్రస్తుతం కివీస్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లో ఆడిన అర్షదీప్ ప్రస్తుతం వన్డేల్లోనూ కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు.2018 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించడమే కాకుండా రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులోనూ భాగస్వామిగా ఉన్నాడు.
ఎవరీ సమ్రీన్ కౌర్?
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ ప్రముఖ మోడల్, నటి. ఆమె 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో జమ్మూ కాశ్మీర్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఫైనలిస్ట్‌గా నిలిచారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం '83'తో ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేశారు.
ఇలా టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో ఒకేరోజు రెండు శుభవార్తలు జరిగాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి ట్రేడ్ అయిన కొద్ది గంటల్లోనే.. ఆయన తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం విశేషం. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే శుక్రవారం మౌంట్ మాంగనూయ్ వేదికగా జరగనుంది.
ఇదీ చదవండి: శతకాలతో పాక్‌ను చితక్కొట్టారు.. లంక కెప్టెన్ ప్రపంచ రికార్డు


