ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అవలంభించిన ధోరణినే పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలకు బలవంతంగా తన ఖాతాలో వేసేసుకుంటోంది. అధికారులు, పోలీసుల అండతో ఫలితాలను తారుమారు చేస్తోంది. చెల్లుబాటు కాని ఓట్లను టీడీపీకి కలిపేసి విజయం సాధించినట్టు ప్రకటిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించిన స్థానాల్లో రీకౌంటింగ్ పేరుతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చంద్రవరం గ్రామం ఎంపీటీసీ కౌంటింగ్‌లో అధికారుల పక్షపాత ధోరణి ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి సత్యనారాయణ ఒక్క ఓటుతో విజయం సాధించగా.. అధికారులు ఫలితాన్ని మార్చేశారు. సత్యనారాయణకు 770 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 769 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయాన్ని ప్రకటించకుండా ఆర్వో నాదెండ్ల శ్రీరామ్ కుట్ర చేశారు. చెల్లుబాటు కాని ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ ఆర్వో దుర్భాషలాడారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అధికారులు చేస్తున్న దుర్మార్గ చర్యలపై కోర్టును ఆశ్రయిస్తామని కొవ్వూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు తెలిపారు.
జక్కంపూడి రాజా ధర్నా
కోరుకొండ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 800కు పైగా ఓట్ల మెజారిటీ ఉన్నట్లు లెక్కల్లో వెల్లడైనప్పటికీ, చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించడంపై జక్కంపూడి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో చోటుచేసుకున్న పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయిలో రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు.
ఇదీ చదవండి: కౌంటింగ్ కేంద్రం ముందు ఆర్కే రోజా నిరసన
రీకౌంటింగ్ నిర్వహించి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు.


