జైలు గోడల మధ్య బంధించినా గెలుపును అడ్డుకోలేకపోయిన టీడీపీ | YSRCP candidate Kamireddy Satyanarayana Reddy won by 1719 votes | Sakshi
Sakshi News home page

జైలు గోడల మధ్య భర్త.. ప్రజాక్షేత్రంలో భార్య.. తలవంచిన విజయం

Nov 7 2026 7:44 PM | Updated on Nov 7 2026 7:58 PM

YSRCP candidate Kamireddy Satyanarayana Reddy won by 1719 votes

తిరుపతి: జైలు గోడల మధ్య భర్త ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఆయన భార్య పోరాటం చేశారు. చివరికి వారి ముందు విజయం తల వంచింది. ఆ కుటుంబానికి అండగా ఎవరు నిలిచినా.. నిలవకపోయినా వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు అండగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,719 ఓట్లతో విజయం సాధించారు. ఆయన విజయంలో ఆయన జీవిత భాగస్వామి కీలక పాత్ర పోషించారు. రాజకీయ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేసింది ఈ తీర్పు.

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. కూటమి నాయకుల దుర్మార్గాలను నిలదీస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. 

అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచే నామినేషన్‌ వేసి పెళ్లకూరు జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన భార్య కామిరెడ్డి ప్రభావతమ్మ, కుమార్తె కామిరెడ్డి రజిని స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఏది ఏమైనప్పటికీ అధైర్య పడకుండా గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించారు.

ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న భార్య పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వెనుకడుగు వేయకుండా ఎన్నికల బరిలో నిలిచి వైఎస్సార్‌సీపీ తరఫున ఘనవిజయం సాధించడం రాజకీయంగా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. కుటుంబ పరిస్థితులు ఒకవైపు.. రాజకీయ సవాళ్లు మరోవైపు.. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలకు ప్రజాతీర్పుతో సమాధానం చెప్పించారు.

రాజకీయాల్లో అధికారం, అంగబలం, అర్థబలం మాత్రమే విజయాన్ని నిర్ణయించవని.. ప్రజల ఆదరణ, నమ్మకం, కార్యకర్తల కష్టమే అసలైన బలమని ఈ ఎన్నికల ఫలితం మరోసారి నిరూపించాయి అని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. విజయం ఎవరికీ చుట్టం కాదు.. పోరాడితేనే దేన్నైనా సాధించొచ్చని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి దంపతులు మరోసారి నిరూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement