ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకూ గూగుల్, ఏఐ చాట్ సెర్చ్
వైద్యుడి కంటే అల్గారిథమ్స్‌పైనే ఎక్కువ నమ్మకం
అపోహలతోనే ఆస్పత్రి గడప తొక్కుతున్న రోగులు
డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌నూ గూగుల్ సెర్చ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ చదివి భయాందోళనలు
ఒకప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లి, ఆయన చెప్పే ప్రతి మాటనువేదవాక్కులా నమ్మేవారు. కాలక్రమేణా ఈ పరిస్థితుల్లో సమూల మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చాలామంది రోగులు జబ్బు లక్షణాలు కనిపించగానే డాక్టర్ కంటే ముందే గూగుల్, ఏఐ టూల్స్‌ను సంప్రదిస్తున్నారు. అక్కడ కనిపించే సగం జ్ఞానంతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొందరు రోగులు డాక్టర్ రాసిచ్చిన మందులనూ గూగుల్ సెర్చ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ చదివి భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రత్యేక కథనం..
సాక్షి, అమరావతి: ఒకప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లి, ఆయన చెప్పే ప్రతి మాటను వేదవాక్కులా నమ్మేవారు. కాలక్రమేణా ఈ పరిస్థితుల్లో సమూల మార్పులు వచ్చాయి. ప్రజల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరగడం, సోషల్ మీడియా జీవితాలను శాసించడం, ప్రతి చిన్న అవసరానికి గూగుల్ సెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగం వైద్య రంగంలో పెను సవాలుగా మారింది.
ప్రస్తుతం చాలామంది రోగులు జబ్బు లక్షణాలు కనిపించగానే డాక్టర్ కంటే ముందే గూగుల్, ఏఐ టూల్స్‌ను సంప్రదిస్తున్నారు. అక్కడ కనిపించే సగం జ్ఞానంతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఫలితంగా వైద్యుడు–రోగి మధ్య ఉండాల్సిన నమ్మకమైన బంధం తెగిపోతోంది. కొందరు రోగులు జబ్బు లక్షణాల ఆధారంగా డాక్టర్ చేసిన క్లినికల్ జడ్జిమెంట్ చేసి, రాసిచ్చిన మందులపైనా అనుమానం పెంచుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యులతో వాదనలు..: రోగి వయసు, శరీరతత్వం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, గతంలో వాడిన మందుల ప్రభావం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక స్థితి వంటి ఎన్నో సూక్ష్మ అంశాలను విశ్లేషించి వైద్యులు క్లినికల్ జడ్జిమెంట్ చేస్తుంటారు. ఒకే రకమైన జ్వరం/కడుపు నొప్పి ఇద్దరు వ్యక్తులకు ఉన్నప్పటికీ, వారి శారీరక పరిస్థితులను బట్టి వైద్యుడు వేర్వేరు చికిత్సా విధానాలను ఎంచుకుంటారు. దీని వెనుక వైద్యుడి చదువు, వేలాది మంది రోగులను చూసిన అనుభవం, ప్రత్యక్షంగా రోగిని పరీక్షించినప్పుడు గమనించిన సూక్ష్మ సంకేతాలు దాగి ఉంటాయి.
గూగుల్ పేషెంట్‌లు లోతైన వైద్య విచక్షణను గుర్తించకుండా ఏఐ అల్గారిథమ్స్ ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తాము ఆన్‌లైన్‌లో తెలుసుకున్న జ్ఞానంతో వైద్యుడి నిర్ధారణను, పరీక్షల అవసరాన్ని శంకిస్తున్నారు. కొందరైతే ఏకంగా ‘ఏఐ ఇలా చెప్పింది, గూగుల్‌లో ఈ మందు రాశారు.. మీరు వేరే చికిత్స చేస్తున్నారేంటి?’ అని తమతో వాదనలకు దిగుతున్నట్టు సీనియర్ వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇలా వైద్యుడి సామర్థ్యం, నిర్ణయంపై నమ్మకం కోల్పోయిన క్షణమే రోగి మెదడులో నోసిబో ఎఫెక్ట్ మొదలవుతోందని అభిప్రాయపడుతున్నారు.
వైద్యుడు, చికిత్సపై రోగికి ఉండే సంపూర్ణ నమ్మకంతో శరీరంలో సానుకూల మార్పులు జరిగి వ్యాధి తగ్గడాన్ని వైద్యశాస్త్రంలో ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. ఎలాంటి ఔషధ గుణాలు లేని సాధారణ చక్కెర మాత్ర, సెలైన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ ఇది అత్యంత శక్తివంతమైన మందు, జబ్బు నయం చేస్తుందని రోగి నమ్మినప్పుడు ఆ విశ్వాసం మెదుడును ఉత్తేజపరుస్తుంది. మెదడులో నొప్పిన నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్‌లు, డోపమైన్‌లు విడుదలై నొప్పుల నుంచి ఉపశమనంతో పాటు, జబ్బులు త్వరగా నయం కావడానికి వీలుంటుంది. గూగుల్ పేషెంట్లలో వైద్యుడి సామర్థ్యంపై, మందులపై అనుమానాలతో నోసిబో ఎఫెక్ట్ మొదలై కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్‌లు పెరిగి, కొత్త సమస్యలకు దారితీస్తున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు.
బీపీ పెంచిన చాట్‌బాట్
గుంటూరుకు చెందిన 46 ఏళ్ల గృహిణి అధిక రక్తపోటు సమస్యకు వైద్యుడు రాసిన మందుల పేర్లను ఏఐ చాట్‌బాట్‌లో సెర్చ్ చేశారు. అందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ జాబితా, యూట్యూబ్ వీడియోలు చూసి భయపడ్డారు. ట్యాబ్లెట్ వేసుకున్న ప్రతిసారీ గుండె దడ వస్తున్నట్లు భ్రమపడి మందులు ఆపేశారు. మరో వైద్యుడిని సంప్రదించారు. ఆయనా అవే మందులు సిఫార్సు చేశారు. గుండెదడ భయంతో వాడలేదు. చివరకు బీపీ విపరీతంగా పెరిగి బాధితురాలు ఆస్పత్రిపాలయ్యారు. వైద్యుడు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ మందుల పనితీరుపై భరోసా ఇచ్చాక, అవి వాడారు. ఫలితంగా బీపీ అదుపులోకి వచ్చింది.
భయపెట్టిన ఏఐ
విజయవాడకు చెందిన 38 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కడుపులో నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లారు. వైద్యుడు సాధారణ అల్సర్‌గా గుర్తించి మందులు రాశారు. ఇంటికి వెళ్లి ఏఐ చాట్‌బాట్‌లో తన లక్షణాలను అడగగా, అది ఇతర తీవ్రమైన వ్యాధుల గురించి చెప్పింది. దీంతో డాక్టర్‌పై నమ్మకం పోయి మందులు వాడకుండా, మరో డాక్టర్‌ను సంప్రదించారు. అక్కడా అల్సర్ అనే తేల్చారు. అయితే బాధితుడు ఏవేవో సందేహాలు వ్యక్తపరుస్తుండటంతో స్కానింగ్ చేశారు. రిపోర్ట్‌లో అంతా సాధారణంగా ఉందని తేలింది. చివరకు మొదట వైద్యుడు సిఫార్సు చేసిన మందులతోనే సమస్య నయమైంది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?..
» వైద్యుడిపై విశ్వాసం తక్కువగా ఉన్న రోగులలో, మందులను క్రమం తప్పకుండా వాడే అలవాటు 40 శాతం తక్కువగా ఉన్నట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు అదుపు తప్పడానికి ఇదే ప్రధాన కారణమవుతోంది. మందుపై, వైద్యుడిపై అనుమానం వ్యక్తం చేసిన రోగులలో అత్యంత శక్తివంతమైన నొప్పి నివారణ మందులు కూడా సగం సామర్థ్యంతోనే పనిచేసినట్లు క్లినికల్ ట్రయల్స్‌లోనూ నిరూపితమైంది.
» రోగి ముందుగానే ఇంటర్నెట్ సమాచారంతో ఒక నిర్ణయానికి రావడంతో వైద్యుడు చెప్పే శాస్త్రీయ విశ్లేషణ వినడానికి ఇష్టపడటంలేదని బెల్జియం, అమెరికా వైద్యుల అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్‌లో తెలుసుకున్న సమాచారంతో 22 శాతం మంది రోగులు అనవసరంగా స్కానింగ్‌లు, రక్త పరీక్షలు, ఇతర మందులు రాయాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చినట్లు గుర్తించారు.
» వైద్యుడిపై విశ్వాసం అనేది కేవలం భావోద్వేగమే కాదు.. అది మందుల పనితీరును ప్రభావితం చేస్తుందని బాసెల్ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల్లో గుర్తించారు.
రోగం ముదురుతుంది.. ఖర్చు పెరుగుతుంది..
నూటికి 90 మంది రోగుల్లో సమస్యలు క్లినికల్ జడ్జిమెంట్, సాధారణ మందులతో నయమవుతాయి. అయితే, ప్రస్తుత రోజుల్లో కొందరు రోగులు సోషల్ మీడియా, ఏఐ, గూగుల్‌లో శోధించి లేనిపోని అపోహలతో వస్తుంటారు. మీకున్నది చిన్న సమస్యే, సులువుగా నయం అవుతుందని చెప్పినా అర్థంచేసుకోరు. గుండె, మెదడు, కిడ్నీ సంబంధిత జబ్బులు, క్యాన్సర్ వంటి పెద్దపెద్ద రోగాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తారు. దీంతో వారి సందేహాలు నివృత్తి చేయడం కోసం ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఇలా అనేక పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఇంటర్నెట్‌లో చూసి పెంచుకున్న ఆందోళనలతో వైద్యం ఖర్చులు పెరగడమే తప్ప మరేమీ ఉండదు. మరికొందరు ఇచ్చిన మందులు వాడకుండా రిపోర్ట్‌లు చేత పట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మందులను నిర్లక్ష్యం చేయడంతో రోగం ముదిరి తీవ్ర అనర్ధాలకు దారితీస్తుంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి.. గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణుడు, కర్నూల్ జీజీహెచ్


