వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరు నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై కర్రలతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు
నామినేషన్ల ఉపసంహరణలో వికృత కుట్రలు
ఎస్‌ఈసీ, పోలీసుల అండతో పేట్రేగుతున్న పచ్చపార్టీ
వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులపై టీడీపీ దాడులు
నామినేషన్ పత్రాలు చించేసి.. నామినేషన్ కేంద్రాలను కబ్జా చేసి బరితెగింపు
వైఎస్సార్ జిల్లాలో ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి అనుచరుల వీరంగం
కల్లమల్లలో బాధితులపైనే పోలీసుల లాఠీచార్జి.. మహిళా అభ్యర్థికి గాయాలు
పల్నాడులో యరపతినేని అనుచరుల దౌర్జన్యం.. పిడుగురాళ్లలో ఉద్రిక్తత.. నంద్యాల, చంద్రగిరిలో నామినేషన్ల తిరస్కరణకు ఒత్తిళ్లు
సత్యవేడులో అభ్యర్థిని బెదిరించి విత్‌డ్రా.. బంటుపల్లిలో ఇళ్లపై దాడులు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: పల్లె సీమల్లోనూ ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వెన్నుపోటు పార్టీ అడ్డగోలుగా దౌర్జన్యకాండ సాగిస్తోంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలోనూ వికృత కుట్రలకు తెగబడింది. దాడులు, అరాచకాలతో పేట్రేగిపోయింది. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పచ్చ భటులై అధికారపార్టీ తొత్తులుగా మారారు. వైఎస్సార్ కడప, పల్నాడు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో పచ్చమూకలు సాగించిన రాక్షసకాండ పరాకాష్టకు చేరింది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. ఎస్‌ఈసీ అనిల్‌చంద్రపునేఠ నోరుమెదపకపోవడం వెనుక గూడుపుఠాణి బట్టబయలవుతోంది.
వైఎస్సార్ జిల్లాలో దాడుల పరంపర.. బాధితులపైనే పోలీసుల లాఠీచార్జి
వైఎస్సార్ జిల్లాలో ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు కొనసాగాయి. ఎర్రగుంట్ల, ముద్దనూరు, కల్లమల్ల, మంగపట్నం, దేనేపల్లి, చింతకుంట, ధర్మాపురం ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేనేపల్లిలో మహిళా అభ్యర్థి గురులలితపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. కల్లమల్లలో కర్రలు, ఇనుప రాడ్లతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడి చేయగా పలువురు గాయపడ్డారు.
దాడులకు పాల్పడిన కూటమి శ్రేణులను వదిలేసిన పోలీసులు మంగపట్నం సహా పలుచోట్ల దెబ్బలు తిన్న బాధితులపైనే లాఠీచార్జ్ చేశారు. చిలంకూరు, చింతకుంటలలో నామినేషన్ పత్రాలను టీడీపీ శ్రేణులు చించివేసి కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. కొండాపురం మండలం బి.కొట్టాలపల్లిలో సర్పంచ్ అభ్యర్థి వరలక్ష్మిపై దాడిచేసి నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. జమ్మలమడుగు మండలం ధర్మాపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చి న అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
» చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా గ్రామ సచివాలయాన్ని టీడీపీ శ్రేణులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నాయి. బీటెక్ రవి, రాంభూపాల్‌రెడ్డి అనుచరులు హల్‌చల్ చేశారు. తొండూరు, మైదుకూరు మండలాల్లోనూ నామినేషన్లకు వెళ్తున్న విపక్షం బలపరిచిన అభ్యర్థులను అడ్డుకునే యత్నాలు జరిగాయి.
» ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ, కూటమి మద్దతుదారులను ఒకేసారి నామినేషన్ దాఖలుకు అనుమతించడంతో అక్కడ తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ పత్రాలను టీడీపీ రౌడీలు చించేశారు. ప్రత్యర్థులపై రాళ్ల దాడి చేశారు.
» మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం మిడుతూరు క్లస్టర్ పరిధిలోని తుడుమలదిన్నె వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన గుర్రమ్మ నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు లాక్కుని చించేశారు.
పల్నాడులో యరపతినేని అనుచరుల దాదాగిరి
పల్నాడు జిల్లాలోనూ నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు దాడులు, బెదిరింపులకు దిగారు. గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు సర్పంచ్ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సైదావలిపై దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దాడి జరుగుతున్నా ఎస్‌ఐ మోహన్ పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
» పిడుగురాళ్ల మండలం జానపాడులో సర్పంచ్ అభ్యర్థి ప్రయాణిస్తున్న ఆటోపై దాడి చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చి న అభ్యర్థులను ఎంపీడీవో కార్యాలయం తలుపులు మూసి అడ్డుకున్నారు. కరాలపాడులో నామినేషన్లు వేయొద్దంటూ పోలీసులు బెదిరించారని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచవరం మండలం రేగులగడ్డలో నామినేషన్ కేంద్రాన్ని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేందుకు యత్నించాయి. నాదెండ్లలో అభ్యర్థుల కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
» ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం క్లస్టర్ పరిధిలో కూటమి గూండాలు అరాచకం సృష్టించారు. మహిళా అభ్యర్థుల నామినేషన్లు లాక్కుని చించేశారు. రాళ్లు, కర్రలతో దాడులు చేశారు.
నంద్యాలలో అధికారులతో కుమ్మక్కు
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించేలా అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. పంచాయతీ కార్యాలయంలోకి టీడీపీ శ్రేణులు చొరబడి అధికారులతో కలిసి నామినేషన్ల తిరస్కరణకు ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. నిబంధనల ప్రకారం దాఖలైన నామినేషన్లను పరిశీలించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా అవుకు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దివంగత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సతీమణి చల్లా శ్రీదేవి నామినేషన్‌ను కారణం చూపకుండానే అధికారులు తిరస్కరించారు. నంద్యాల జిల్లా అహోబిలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీలో దిగిన రమణ కూల్‌డ్రింక్స్ షాపునకు టీడీపీ మూకలు నిప్పుపెట్టి పైశాచికం ప్రదర్శించారు. సుమారు రూ.2 లక్షల విలువైన ఫ్రిజ్‌తో పాటు దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

చంద్రగిరిలో తిరస్కరణలపై చెవిరెడ్డి ఆందోళన
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం, రామచంద్రాపురంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై వివాదం చెలరేగింది. దీంతో తొండవాడలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అన్యాయంగా నామినేషన్లు తిరస్కరించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చాంబర్ బయట బైఠాయించి నిరసన తెలిపారు. తిరుపతి చెర్లోపల్లిలో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నామినేషన్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
సత్యవేడులో విత్‌డ్రాకు బెదిరింపులు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం సిద్ధిరాజు కండ్రిగలో సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. రెండో వార్డు నుంచి పోటీలో ఉన్న చిత్రతో బలవంతంగా నామినేషన్ విత్‌డ్రా చేయించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. తిరుపతి జిల్లా అనుపల్లిలో నలుగురు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను కారణాలు చూపకుండా తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెనాలిలో రెబల్ అభ్యర్థిపై హత్యాయత్నం
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో టీడీపీ రెబల్ అభ్యర్థి నీలాంబరంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు రాజేష్ హత్యాయత్నం చేశాడు. దాడి చేసి తాడుతో గొంతు నులిమి చంపే ప్రయత్నం చేయడంతో నీలాంబరం పరిస్థితి విషమంగా మారగా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.
నెల్లూరు, శ్రీకాకుళంలోనూ కుమ్మక్కు కుట్రలు
నెల్లూరు జిల్లా మర్రిపాడులో అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఈశ్వరరావు స్వగ్రామం బంటుపల్లిలో సర్పంచ్, వార్డు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని అభ్యర్థులను బెదిరించడమే కాకుండా వారి ఇళ్లకు వెళ్లి దాడులు చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరిగినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ ఆగడాలకు వంతపాడుతోంది.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లిలో తమకు న్యాయం చేయాలని సీఐ అవతారాన్ని వేడుకుంటున్న దాడికి గురైన బాధిత మహిళలు
సీఎం మరదలు ఇందిరమ్మ ఘెరావ్
సీఎం చంద్రబాబు సొంత గ్రామం నారా వారిపల్లిలోనూ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ రాజకీయ దుమారం రేపింది. 8 నామినేషన్లు తిరస్కరణకు గురికావడం వివాదాస్పదమైంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆర్వో తమ నామినేషన్లను తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్ వేసిన అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చి న చంద్రబాబు మరదలు, నారా లోకేశ్ చిన్నమ్మ నారా ఇందిరమ్మను బాధిత అభ్యర్థులు అడ్డుకుని తమ నిరసన తెలిపారు.
టీడీపీకి కొమ్ముకాసిన ఆర్వోలు
మెడలో మంగళసూత్రం రాయలేదని నామినేషన్ తిరస్కరణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఆర్వోలు ఏకపక్షంగా టీడీపీకి కొమ్ముకాశారు. వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్లను అసంబద్ధ కారణాలతో తిరస్కరించారు. సీతారామపురం మండంలో మెడలో మంగళసూత్రాల వివరాలను నామినేషన్ పత్రాల్లో పొందుపరచలేదనే కారణంతో తిరస్కరించడం విస్తుగొలుపుతోంది. మర్రిపాడు మండలంలో ఆర్‌ఓలు ఇష్టానుసారం ప్రవర్తించారు. ఫోన్‌లో మాట్లాడటం, మెసేజిలు చూసుకుంటూ కాలయాపనచేశారు. జిల్లాలో ఏకంగా 34 సర్పంచులు, 124 వార్డు సభ్యుల నామినేషన్లను కుంటిసాకులతో తిరస్కరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు నామినేషన్ల కార్యక్రమానికి ఆయనను వెళ్లకుండా అడ్డుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయగా, పిడుగురాళ్లలో కాసు మహేశ్‌రెడ్డి కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీమంత్రి విడదల రజిని వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను చిలకలూరిపేటలోని ఆమె ఇంటికి పంపి గృహనిర్బంధం చేశారు. ఇంటిచుట్టూ పోలీసులను మోహరించారు.


