వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం | Seven people die in separate accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం

Nov 22 2026 5:21 AM | Updated on Nov 22 2026 5:21 AM

Seven people die in separate accidents

ఒంగోలు సమీపంలో నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు

కల్వర్టును ఢీకొట్టిన పెళ్లి బృందం కారు

వరుడి తల్లిదండ్రులు, స్నేహితుడు, వధువు తల్లి మృత్యువాత

స్వల్పగాయాలతో బయటపడిన నవదంపతులు

బాపట్ల జిల్లా కారంచేడు సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీ

చిన్నారి సహా ముగ్గురు మృతి.. 8 మందికి గాయాలు

ఒంగోలు టౌన్‌/కారంచేడు: ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. నవదంపతులు సహా 10 మంది గాయపడ్డారు. ఒంగోలు సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టిన దుర్ఘటనలో వరుడి తల్లిదండ్రులు, స్నేహితుడు, వధువు తల్లి మృత్యువాత పడగా.. నవదంపతులు ఆస్పత్రి పాలయ్యారు. బాపట్ల జిల్లా కారంచేడు వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టి పొలాల్లోకి పల్టీకొట్టిన ఘటనలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా పెళ్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బాపట్లకు వస్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శుభకార్యానికి వెళ్లి వస్తున్న కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి మెరుగైన వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నలుగుర్ని బలిగొన్న నిద్రమత్తు
ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు పెళ్లూరు సమీపంలో శనివారం తెల­్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... బాపట్లలోని నరాలశెట్టి వారి పాలెంకు చెందిన జంపాల శ్రీతేజ, విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన తాడిశెట్టి వెంకట కైవల్యకు ఈ నెల 18న వివాహం జరిగింది. 19వ తేదీ రాత్రి తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబీకులతో కలిసి నవ దంపతులు కారులో బయలుదేరారు. శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణంలో ఒంగోలు శివారులోని పెళ్లూరు వద్దకు రాగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెన్నై–కోల్‌కతా హైవే పక్కనున్న కల్వర్టును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. 

ప్రమాదంలో వరుడు శ్రీతేజ తలిదండ్రులు జంపాల వెంకటరావు (60), సుజాత (52), వధువు తల్లి సీతామహాలక్షి్మ(52), కారు నడుపుతున్న వరుడి స్నేహితుడు ప్రవీణ్‌ (29) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కారు వెనుక భాగంలో కూర్చున్న నూతన వధూవరులు శ్రీతేజ, కైవల్య స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సీఐ విజయ కృష్ణ, ఎస్సైలు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిద్దరినీ మెరుగైన చికిత్స కోసం ఒంగోలు సత్యనారాయణపురంలో గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

తెల్లవారుజామున విపరీతమైన మంచు కురుస్తుండటం.. 
చల్లటి గాలివల్ల కారు నడుపుతున్న ప్రవీణ్‌కు కునుకు పట్టడంతో కారు అదుపుతప్పి జాతీయ రహదారికి పక్కనున్న కాలువ కల్వర్టును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. కారు నడుపుతున్న ప్రవీణ్‌ స్వస్థలం ఒంగో­లు కాగా.. కొద్దిసేపట్లో ఒంగోలుకు చేరుకుంటారనగా ఊహించని రీతిలో ప్రమాదం ముంచుకొచి్చంది.

కారంచేడు వద్ద ఘోర ప్రమాదం
బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ప్రధాన రహదారి డివైడర్‌ను ఢీకొట్టి అదే వేగంతో రోడ్డు దాటి సమీప పొలాల్లోని దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 11 మందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చీరాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మరో ఆరుగురికి గాయాలు కావడంతో చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

చీరాల డీఎస్పీ మహ్మద్‌ మొయిన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన ఓ కుటుంబం గుంటూరులో నివాసం ఉంటోంది. వారంతా వ్యక్తిగత పనుల నిమిత్తం బొప్పూడి వెళ్లి స్వగ్రామైన చిలకలూరిపేటకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు గడిపి బంధువులంతా ఇన్నోవా కారులో డ్రైవర్‌ సహా 11 మంది బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు సముద్ర స్నానానికి బయలుదేరారు. కారంచేడు–చీరాల జాతీయ రహదారిలో కుంకలమర్రు దొంగ చప్టాల సమీపంలో గల ఫ్లైఓవర్‌ ఎక్కే క్రమంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. 

అదే వేగంతో డివైడర్‌ను దాటుకుని పొలాల్లోకి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ప్రయాణిస్తున్న పల్లపు లక్ష్మయ్య (65), గుంజి నాగేంద్రం (55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న నాలుగేళ్ల పాప అశ్వినిని చీరాల ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. 11 మందిలో ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకొల్లు సీఐ రమానాయక్, కారంచేడు ఎస్‌ఐ పి.గోపి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement